Politics

మా సంబరాలతో కనువిప్పు కలిగిస్తాం

Devineni Uma ready to celebrate victory from 2019 election results

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసుకుని తెలంగాణలో ఉన్న జగన్‌ సంబరపడుతున్నారని…23న వెలువడే ఎగ్జాక్ట్‌ ఫలితాలతో ఆంధ్రాలో తాము సంబరాలు చేసుకుంటామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…2014లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ జగన్‌కు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేశారు. 2014లో రాష్ట్రం ఏమైపోతుందోననే భయంతో ప్రజలు తెదేపాకు ఓటేశారని, 2019లో ‘తెదేపాను గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు’ అనే బాధ్యతతోనే ప్రజలు ఓటేశారని ఉమా అన్నారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్‌ తానే భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిపరులు, అరాచకశక్తులు రాజ్యాధికారిన్ని ఆశిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఉమ ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడతారని పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు అనుకూలంగా వచ్చాయన్న మోదీ, అమిత్‌ షాకు కనువిప్పు కలుగుతుందని ఉమా అన్నారు.