Business

హిందూజాలకు ఆసక్తి

Hindujas to buy out jet airways

రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్‌ ఆసక్తి చూపుతోంది. జెట్‌ వాటాల కొనుగోలుకు బిడ్డింగ్‌ అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ విషయమై జెట్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌, ఇన్వెస్టర్‌ ఎతిహాద్‌, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌ నేతృత్వంలోని రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ గానీ.. ఎతిహాద్‌ గానీ ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు జెట్‌ కొనుగోలుకు హిందూజా ఆసక్తి చూపిస్తుందన్న వార్తలతో ఎయిర్‌లైన్ షేర్లు భారీగా లాభపడ్డాయి. నేటి మార్కెట్‌ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర 12.94శాతం పెరిగి రూ. 148.40 వద్ద స్గిరపడింది. బీఎస్‌ఈలో షేరు విలువ 14.73శాతం పెరిగి రూ. 150.75 వద్ద ముగిసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌ లాంటి బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ల నుంచి పోటీ ఎక్కువవడంతో పాటు నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో జెట్‌ నష్టాల్లో కూరుకుపోయింది. కనీసం విమానాలకు లీజు చెల్లించలేని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారింది. రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడంతో జెట్‌ మూతబడింది.