Business

బంగారం దిగుమతుల్లో భారీ వృద్ధి నమోదు చేసిన భారత్

India marks 397 crore USD in importing gold reserves-TNILIVE business

భారత్‌ బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ లోహ దిగుమతులు 54 శాతం పెరిగి 397 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో బంగారం దిగుమతులు 258 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దిగుమతుల పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు మరింతగా పెరిగింది. కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) పైనా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.బంగారం దిగుమతులు పెరిగిన కారణంగా ఏప్రిల్‌లో వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలో 1,533 కోట్ల డాలర్లకు వెళ్లడానికి కారణమైనట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక కరెంట్‌ ఖాతా లోటు విషయానికొస్తే.. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 2.5 శాతానికి పెరిగింది. అధిక వాణిజ్య లోటే ఇందుకు ప్రధాన కారణం. దేశ విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నప్పటికీ క్యాడ్‌ మాత్రం తగ్గడం లేదు.దేశంలోకి వచ్చి, వెళ్లే విదేశీ మారక నిల్వల్లో వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఫిబ్రవరిలో బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. కానీ మార్చిలో మళ్లీ రెండంకెల వృద్ధి (31 శాతం) నెలకొంది. బంగారం దిగుమతుల్లో భారత్‌ అతిపెద్ద దేశంగా ఉంది. భారత్‌ వార్షికంగా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. విలువ పరంగా చూస్తే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు దాదాపు 3 శాతం తగ్గి 3,280 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.