Agriculture

వంటింటి చెత్తతో సేంద్రీయ ఎరువు తయారీ

Vijayanagaram women make organic compost using kitchen waste

వంటింటి వృథాను బయట పారేస్తాం కదా… కానీ ఆ మహిళలు మాత్రం ఆ చెత్తను భద్రపరుస్తారు. దాంతో ఎరువును తయారుచేసి మొక్కలకు వాడతారు. ఆంధ్రప్రదేశ్‌ విజయనగరానికి చెందిన చాలామంది మహిళలు అదే చేస్తారు. అందుకే ఆ జిల్లా సేంద్రియ ఎరువుల తయారీలో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. చాలా ప్రాంతాల్లో చెత్త అనేది ఓ పెద్ద సమస్య. విజయనగరం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎంత పురపాలక సంఘం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నా… రోడ్లపై అక్కడక్కడా కనిపించేది. దాంతో ఈగలు, దోమలు, ఎలుకలు, పందుల సమస్య పెరిగింది. పరోక్షంగా వ్యాధులూ మొదలయ్యాయి. ఇవన్నీ గుర్తించే పరిష్కారంగా ఇంటి కంపోస్టింగ్‌ విధానం ప్రోత్సహించాలని పురపాలక శాఖ సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు ప్రత్యేకంగా రూపొందించింది. అలా ఆ ప్రాంతాల్లోని గృహిణులతో చెత్తను ఎరువుగా మార్చే విధానాన్ని అమలు చేయించింది. ఆ అధికారుల ప్రోత్సాహంతో దీనిపై చాలామంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పురపాలక సంఘం కొనుగోలు చేసిన 780 ప్లాస్టిక్‌ డబ్బాలను 12, 15, 16, 22, 23, 35 వార్డుల్లో ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారీకి ముందుకొచ్చిన వారికి పంపిణీ చేశారు. దాంతో మహిళలు తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటూ కాయగూరలు, పూల మొక్కలకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం పురపాలక సంఘం అధికారులు ఇంటింటికీ రంధ్రాలున్న రంగుల డబ్బాలు అందించారు. కూరగాయలు, వ్యర్థాలు, పండ్ల తొక్కలు, కోడిగుడ్డు పెంకులు, కుళ్లే స్వభావం కలిగిన అన్నింటిని హైడెన్సిటీ పాలీ ఇథలీన్‌తో తయారు చేసిన డబ్బాలో వేస్తారు. తొలుత ఎర్రమట్టి, నల్లమట్టి, ఎండిన ఆకులు వేయాలి. పది రోజుల తర్వాత కేవలం కూరగాయల వ్యర్థాలను వేయాలి. నిమ్మకాయ వంటివి వేయకూడదు. ఎందుకంటే ఆ పండులో సిట్రిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను సంహరిస్తుంది. పదిరోజుల తరువాత కొంత పరిమాణంలో పెరుగు లేదా విరిగిన పాలను పోసి మట్టి వేయాలి. ఇలా చేయడం వల్ల వాసన బయటకు రాదు. ప్రతి రోజు చెత్తను పొరలు పొరలుగా వేసుకోవాలి. వేసిన చెత్తను ప్రతి రోజు పైకి కిందికి కలపాలి. ఇలా చేయడం వల్ల 35-45 రోజుల్లో మొక్కలకు వేసేలా సేంద్రియ ఎరువు తయారవుతుంది.