Sports

నా పేరు వింటేనే అందరికీ సుస్సు….

Chris gayle says every single bowler is scared of him but wont reveal it - tnilive sports

మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనేందుకు అన్ని జట్లు ఇంగ్లాండ్‌కు చేరుకుంటున్నాయి. విజయవంతంగా ఐదోసారి ఈ మెగా టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ కూడా ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. తనకు తానే యూనివర్స్‌ బాస్‌గా ప్రకటించిన క్రిస్‌ గేల్‌.. రానున్న ప్రపంచకప్‌లో బౌలర్లకు తనతో తిప్పలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు ‘ప్రపంచంలోని అన్ని జట్ల బౌలర్లకు నేనంటే వణుకు పుడుతుంది.. కానీ ఎవరూ బయటికి చెప్పరు’ అని పేర్కొన్నాడు. ‘ఎంతో మంది యువబౌలర్లు నా వికెట్‌ తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. మార్చిమార్చి బంతులు వేసినా సరే.. క్రీజులో ఉన్నది గేల్‌ అన్న విషయం వాళ్లకు తెలుసు. నాకు బౌలింగ్‌ వేసే సమయంలో గేల్‌ అంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను చూడలేదు అని వాళ్లు మనసులో అనుకుంటారు. కానీ, కెమెరా ముందు అడిగితే గేల్‌ అంటే భయం లేదని అంటారు. నిజానికి వాళ్ల మనసులో ఎంతోకొంత భయం ఉంటుంది. వాళ్లనే కెమెరా లేనప్పుడు అడిగితే.. అవును గేల్‌ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అని ఒప్పుకొంటారు. ఫాస్ట్‌ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎంతో ఎంజాయ్‌ చేస్తాను. అయితే, నా ఆట గురించి ఇంకా నిరూపించుకోవడానికి ఏం మిగల్లేదు. కేవలం నా అభిమానుల కోసమే ప్రపంచకప్‌ ఆడుతున్నా’ అని గేల్‌ అన్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ విండీస్‌ వీరుడు 13 మ్యాచుల్లో 490 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ కంటే ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టోర్నీలో కేవలం నాలుగు మ్యాచుల్లోనే 106 సగటుతో 424 పరుగులు చేశాడు. అందులో 39 సిక్సులు ఉండటం విశేషం.