Editorials

చావుదెబ్బ…వందకు వెయ్యి శాతం ఓడిన చంద్రబాబు–TNI ప్రత్యేకం

An analytical review on why chandrababu lost in 2019 elections

అహంకారం, అధికారమదం, వ్యవస్థలపై లెక్కలేని తనం, పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల పై నియంత్రణ లేకపోవడం అవినీతిని అరికట్ట లేకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం పై పట్టు లేకపోవడం తెలుగుదేశం పార్టీ అంతా నేనేనంటూ విర్రవీగడం, ప్రతి మీటింగులోనూ చెప్పిందే గంటల తరబడి చెప్పడం, ఇతరుల అభిప్రాయాలూ గౌరవించకపోవడం, పచ్చ మీడియా తప్పులను ఎత్తిచూపకుండా చంద్రబాబు భజన చేయడం ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోవడం తదితర కారణాల మూలంగా 36 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. ఇది వై.ఎస్.జగన్ విజయం అనే దానికన్నా ‘చంద్రబాబు వైఫల్యం’ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఎన్నికల ఫలితాల్లో దిమ్మతిరిగే షాక్ చంద్రబాబుకు తగిలింది. ఇప్పటికైనా అహంకారాన్ని వీడి ప్రజల్లో తనకున్న విలువేమిటో తెలుసుకుని పార్టీ పునః నిర్మాణం పై దృష్టి పెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు ఘోర వైఫల్యానికి ప్రధానమైన కారణాల్లో ఇవి కొన్ని …
*ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ప్రజలను పీడించుకు తిన్నారు.
*చింతమనేని ప్రభాకర్ వంటి ఎమ్మెల్యేలు, మహిళల పైనా , సామాన్య వ్యక్తుల పైనా ప్రతినిత్యం దాడులకు దిగి వారిని కొడుతూ ఉంటె చంద్రబాబు అటువంటి వ్యక్తులకు చీప్ విప్ పదవులను ఇచ్చి ప్రోత్సహించారు.
*ఎక్కడ మీటింగు పెట్టిన చంద్రబాబు గంటలకొద్దీ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల సహనాన్ని పరీక్షించారు. *చంద్రబాబు నోటి వెంట ‘నేను ఇది చేశాను’, అది చేశాను అంటూ వ్యక్తిగత పొగడ్తాలకే ప్రాధాన్యత ఇచ్చారే తప్ప మేము చేశాము అనే మాట ఏనాడు ఆయన నోటి వెంట రాలేదు. మంత్రులు, ఎమెల్యేలు, ముఖ్య నాయకులనూ దోచుకు తినమని చంద్రబాబు లైసెన్స్ ఇచ్చేశారు. మట్టి, ఇసుక, కంకర వంటి ప్రకృతి వనరులను తెలుగుదేశం నాయకులూ బహిరంగంగా కొల్లగొట్టారు.
*కార్యకర్తలకు ప్రభుత్వ ఫలితాలు ఏమీ అందకపోవడం, నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఈ పర్యాయం పార్టీ విజయానికి పని చేయలేదు.
*బూత్ లెవల్ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించగా, నాయకులు మాత్రం ఒక్కొక్క ఫోనుకు కార్యకర్తల నుండి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేశారు.
*ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని ప్రకటనలు గుప్పించి, దాని కోసం ఫోన్ నంబరు 1100 ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ వ్యవస్థ పని చేయకపోయినా మిన్నకుండిపోయారు. తమ ఫిర్యాదులు ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం కావడంలేదని ప్రజలు మొత్తుకున్నప్పటికి వినిపించుకునే నాధుడే కరువయ్యాడు.
*పోలవరం, పట్టిసీమ వంటి మంచి ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ వాటి గురించి పదేపదే చంద్రబాబు ‘డబ్బా’ కొట్టుకోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యింది.
*అసెంబ్లీలో ప్రతిపక్షమైన వైకాపాను ఆ పార్టీ నేత వై.ఎస్.జగన్ ను అణగదొక్కాలని చూశారు. చివరకు రోజావంటి మహిళా ఎమ్మెల్యేను అసెంబ్లీకి రాకుండా బహిష్కరించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.
*చంద్రబాబు తన ఐదేళ్ళ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కివేశారు. ఆందోళన చేసేవారిని లాటీలతో కొట్టించారు. ప్రతిపక్ష నేతలను , కార్యకర్తలను జైల్లో పెట్టించారు.
*గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని నాలుగేళ్ళు కాపురం చేసి ఆ పార్టీని వదిలివేయడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదం.
*కాంగ్రెస్ పార్టీకి చేరువైనప్పటికి ఆపార్టీతో కలిసి పోటీ చేయకపోవడం మరొక పెద్ద తప్పు. జనసేనతోను, ఉభయ కమ్యునిస్టు పార్టీలతోనూ పొత్తుపెట్టుకుని ఉంటె చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మరికొన్ని సీట్లు వచ్చి ఉండేవి.
*సామజిక మాధ్యమాల్లో చంద్రబాబు భజన బృందం వేసిన వెకిలి వేషాలు, పెట్టిన తప్పిదలైన పోస్టులు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి.
*పవిత్ర పుణ్యక్షెత్రం తిరుపతిలో ప్రధాన అర్చకుడిని తొలగించడం ఈవోగా ఉత్తరాదికి చెందిన అధికారిని నియమించడం తన భజన బృందాన్ని తిరుమల కొండపై నియమించడం, చైర్మన్ గా ఒక అనామకుడిని నియమించడం కూడా ప్రజల మనోభావాలను దెబ్బ తీసింది.
*ఈ ఎన్నికల్లో సుజనచౌదరి వంటి వారిని దూరంగా పెట్టడం ప్రజల్లో పరపతి లేని యనమల రామకృష్ణుడు వంటి వారిపై ఆధారపడటం చంద్రబాబును చావుదెబ్బ తీసింది.
*తొందరపడి లోకేష్ కు పుత్రవాత్సల్యంలో మంత్రి పదవి కట్టపెట్టడం పార్టీలోని సీనియర్లను విస్మరించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. ఈ పర్యాయం చంద్రబాబు ప్రస్తుత ఎమ్మెల్యేలకు, మంత్రులకు తొంభై శాతం వరకు తిరిగి టికెట్ లు కేటాయించడం కూడా పార్టీ పరాజయానికి పెద్ద కారణమని చెప్పవచ్చు. ఒకపక్క కొత్త రాష్ట్రంలో నిధులు లేవంటూనే ఆడంబర ఖర్చులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ప్రతి నిత్యం ప్రత్యెక విమానాల్లో చక్కర్లు కొట్టడం, ప్రజల నిరసనకు కారణమయింది.
*హైదరాబాద్ నుండి అర్దాంతరంగా రాజధానికి తరలించడం పట్ల ఐఏఎస్ అధికారుల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అసంతృప్తి వ్యక్తమయింది. అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ వంటి వాటికీ కోట్లాది రూపాయల ఖర్చుతో తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేయడం కూడా ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.
*లేనిది ఉన్నట్లుగా చూపించి ప్రజల దృష్టిలో చంద్రబాబు చులకనయ్యారు.
*చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు నియోజకవర్గ ఇన్చార్జిలు ప్రజలను దోచుకుతిన్నారు. చివరకు ఎన్నికలకు ముందు ఈ రెండింటిని రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు సహకరించలేదు.
*ఎన్నికలు అయిన తరువాత కూడా చంద్రబాబు నోరుఅడుపులో పెట్టుకోలేకపోయారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలను ఎద్దేవా చేయడం, వాటిని దిక్కరించడం ప్రజలకు ఆగ్రహం కలిగించింది. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వైకాపా కోవర్టు అంటూ చంద్రబాబు తన పరువును దిగజార్చుకున్నారు.
*చంద్రబాబు వైఫల్యాలను ఇవి కేవలం కొన్ని మాత్రమే మరికొన్ని వైఫల్యాల గురించి త్వరలోనే మాట్లాడుకుందాం. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
An analytical review on why chandrababu lost in 2019 elections-TNILIVE