Politics

తెలంగాణా కాంగ్రెస్‌కు కాస్త ఊపిరి అందింది

Telangana Congress Wins three mp seats in 2019 elections

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. ఇక మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి లీడ్‌లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 0 లేదా 1 స్థానానికి పరిమితం అవుతుందని వచ్చినా… అందుకు విరుద్ధంగా… కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మరోస్థానం కూడా గెలిస్తే, అది టీఆర్ఎస్ 16 స్థానాల ఆశలకు గండికొట్టినట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతో… ఇప్పుడు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి… ఉత్తమ్… లోక్ సభకు వెళ్లనున్నారు. ఫలితంగా ఉప ఎన్నిక జరగనుంది. ఉత్తమ్ హుజూర్ నగర్ స్థానంలో తన భార్యను బరిలో దింపే అవకాశాలున్నాయి.తన గెలుపును ప్రజలు ఇచ్చిన గిఫ్టుగా అభివర్ణించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమితో… ఉత్తమ్ కుమార్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ దశలో ఆయన్ని తప్పించి, ఇంకెవరికైనా ఆ పదవిని ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. ఐతే… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మాత్రం… లోక్ సభ ఎన్నికలపై దృష్టిసారించాలని కొన్ని సూచనలు చేశారు. ఐతే… లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ పెద్దగా ఆశలు పెట్టుకోలేదనీ, కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల ఆశలపై నీళ్లు చల్లుతూ… కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కూడా టీఆర్ఎస్‌కి షాకింగ్ తీర్పే. తెలంగాణాలో మల్కజీగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి గెలుపొందారు.
*వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం సాధించారు. దయాకర్‌కు 566367 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యకు 240101 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి 77325 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 326266 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలుపొందారు. మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. శ్రీనివాస్‌రెడ్డికి 282255 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 225851 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్‌రెడ్డి 119950 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 56404 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు.
*పాత పాలమూరు జిల్లాలో భాగమైన నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఈసారి టీఆర్ఎస్‌ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన ఓటర్లు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభివృద్ధి పనులు చూసి ఓటేశారు. కరువుకు పెట్టింది పాలమూరు. అలాంటిది కేసీఆర్‌ పాలనలో పచ్చగా మారింది. సాగు నీరు, రైతు బంధు, 24 గంటల కరెంటు, ఆసరా ఫింఛన్లు టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని చెప్పొచ్చు.నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిపై రాములు గెలుపొందారు. రాములుకు 476123 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 293529 ఓట్లు పోలయ్యాయి. 182594 ఓట్ల మెజార్టీతో రాములు విజయం సాధించారు.