Kids

పిల్లలూ…రండి బ్రిటన్ చూసొద్దాం

Telugu Kids Info - Tour To Britain

క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూసే వేడుక వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ సంబరం! క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భాగమైన మరో దేశం వేల్స్‌ కలిసి ఈ ఏడాది ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇంగ్లండ్‌లో పది చోట్లా, వేల్స్‌లో ఒక చోట మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్కడ క్రికెట్‌తో పాటు సందర్శించాల్సిన పర్యాటక ఆకర్షణలూ అనేకం!
**లండన్‌
యూరప్‌లో ఎక్కువమంది భారతీయ పర్యాటకులు సందర్శించే నగరం లండన్‌. థేమ్స్‌ నదీ తీరాన ఉన్న లండన్‌ కేవలం ఇంగ్లండ్‌కే కాదు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కూ రాజధాని. రోమన్‌ కాలం నాటి భవనాలు మొదలుకొని అత్యాధునిక నిర్మాణాల వరకూ… ఎన్నో విశేషాల మేలి కలయిక ఈ నగరం.
చూడాల్సినవి.. థేమ్స్‌ నదిపై నిర్మించిన లండన్‌ బ్రిడ్జ్‌, బ్రిటిష్‌ మ్యూజియం, నేషనల్‌ గ్యాలరీ, నేచురల్‌ హిస్టరీ మ్యూజియం, లండన్‌ టవర్‌… మరెన్నో.
**నాటింగ్‌హామ్‌
లండన్‌ నగరానికి సుమారు 200 కి.మీ. దూరంలో ఉన్న నాటింగ్‌హామ్‌ పేరు వినగానే రాబిన్‌హుడ్‌ కథలు గుర్తొస్తాయి. చారిత్రకమైన ఈ నగరంలో విశేషాలకు కొదవలేదు. ప్రపంచ లేస్‌ పరిశ్రమకు ఇది కేంద్ర స్థానం.
చూడాల్సినవి.. నాటింగ్‌హామ్‌ కోట-మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ, జస్టిస్‌ మ్యూజియం, లేళ్ళ పార్కు, అడ్రినలిన్‌ జంగిల్‌, సిటీ ఆఫ్‌ కేవ్స్‌… ఇవి కొన్ని మాత్రమే!
**టౌన్టన్‌
ఇంగ్లండ్‌లోని సోమర్‌సెట్‌ కౌంటీలో అతి పెద్ద పట్టణం టౌన్టన్‌. క్రైస్తవ మతపరంగానూ, సైనికపరంగానూ దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర దీనికి ఉంది. ఇది షాపింగ్‌ ప్రియులకు మంచి గమ్యం కూడా! లండన్‌ నుంచి ఈ పట్టణం 265 కి.మీ. దూరంలో ఉంది.చూడాల్సినవి.. వివరీ పార్క్‌, హెస్టర్‌కంబే గార్డెన్‌, సోమర్‌సెట్‌ మ్యూజియం, వెల్లింగ్టన్‌ స్మారక స్తూపం, సోమర్‌సెట్‌ క్రికెట్‌ మ్యూజియం… ఇంకా ఎన్నో!
**మాంఛెస్టర్‌
కళాత్మక హృదయం ఉన్న ఆధునిక నగరంగా మాంఛెస్టర్‌ను అభివర్ణిస్తూ ఉంటారు. పరిశ్రమలకూ, సంగీతానికీ ఇది ప్రసిద్ధి చెందడమే కారణం. లండన్‌కు 335 కి.మీ. దూరంలో ఉన్న మాంఛెస్టర్‌ ఒకప్పుడు జౌళి రంగానికి కేంద్ర స్థానం.చూడాల్సినవి.. మాంఛెస్టర్‌ క్యాథెడ్రల్‌, ఆర్ట్‌ గ్యాలరీ, ఇంపీరియల్‌ వార్‌ మ్యూజియం, జాన్‌ రేలాండ్స్‌ లైబ్రరీ, నేషనల్‌ ఫుట్‌బాల్‌ మ్యూజియం… మరెన్నో!
**బర్మింగ్‌హామ్‌
ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవానికి ప్రధాన కేంద్రం బర్మింగ్‌హామ్‌. జనాభాపరంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో రెండో అతి పెద్ద నగరం. ప్రపంచంలో తొలి మాన్యుఫేక్చరింగ్‌ టౌన్‌గా, వరల్డ్ వర్క్‌షాప్‌గా దీన్ని పిలిచేవారు. నీటి కాలువల అనుసంధాన వ్యవస్థ ఈ నగరం ప్రత్యేకతల్లో ఒకటి. లండన్‌కు ఇది 204 కి.మీ. దూరంలో ఉంది.
చూడాల్సినవి.. బర్మింగ్‌హామ్‌ మ్యూజియం, కానన్‌ హిల్‌ పార్క్‌, నేషనల్‌ సీ లైఫ్‌ సెటర్‌, క్యాడ్‌బరీ వరల్డ్‌, విక్టోరియా స్క్వేర్‌ తదితరాలు.
**తాంప్టన్‌
టైటానిక్‌ ఓడ పతనం చరిత్రలో నిలిచిపోయిన ఒక విషాద ఘట్టం. ఆ ఓడ తన ప్రయాణాన్ని సౌతాంప్టన్‌ రేవు నుంచే ప్రారంభించింది. నౌకాయానానికే కాదు, విమానయానానికి కూడా బ్రిటన్‌లో తొలినాటి కేంద్రాల్లో ఇది ఒకటి. సౌతాంప్టన్‌ ఓల్డ్‌ టౌన్‌ ఇప్పటికీ ఆ ఘన వారసత్వానికి చిహ్నంగా నిలుస్తోంది. ఇది లండన్‌కు 110 కి.మీ . దూరంలో ఉంది.
చూడాల్సినవి: టైటానిక్‌ చరిత్రను వివరించే సీ సిటీ మ్యూజియం, టుడోర్‌ గృహం గార్డెన్‌, మధ్యయుగం నాటి నగరం గోడలు, ఓల్డ్‌ టౌన్‌, మే ఫ్లవర్‌ పార్క్‌.
**బ్రిస్టల్‌
ఇంగ్లండ్‌లో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మరో నగరం బ్రిస్టల్‌. అంతేకాదు, సైక్లింగ్‌, వాకింగ్‌ టూర్లకు పేరు పొందిన నగరం ఇది. ఎవోన్‌ నదీ తీరంలో ఉన్న బ్రిస్టల్‌లో నిరంతరం కళలకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇది లండన్‌కు 190 కి.మీ. దూరంలో ఉంది.
చూడాల్సినవి.. క్లిఫ్టన్‌ వేలాడే వంతెన, పెరో వంతెన, కార్బెట్‌ టవర్‌-బ్రాండన్‌ హిల్‌, క్లిఫ్టన్‌ అబ్జర్వేటరీ, వివిధ ప్రాంతాల్లో గ్రాఫిటీ చిత్రాలు
**కార్డిఫ్‌
వేల్స్‌ దేశ రాజధాని కార్డిఫ్‌. వాణిజ్య కేంద్రమైన కార్డిఫ్‌ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 2017లో ప్రపంచంలోని ప్రత్యామ్నాయ పర్యాటక గమ్యస్థానాల్లో ఆరో స్థానంలో నిలిచింది. అలాగే రగ్బీ క్రీడకు పేరుపొందింది. ప్రపంచంలో ఎక్కువ కోటలు ఉన్న నగరంగా కూడా ఖ్యాతి గాంచింది. ఇది లండన్‌కు 243 కి.మీ. దూరంలో ఉంది.
చూడాల్సినవి.. కార్డిఫ్‌ కోట, మిల్లీనియం స్టేడియం, యుకెలో అతి పెద్ద షాపింగ్‌ కేంద్రాల్లో ఒకటైన సెయింట్‌ డేవిడ్‌ సెంటర్‌, కార్డిఫ్‌ బే… ఇంకా మరెన్నో!
**లీడ్స్‌
పారిశ్రామికంగా ఘనమైన గత కీర్తి ఉన్న లీడ్స్‌ నగరం ఇప్పుడు అత్యాధునికతకు చిరునామాగా నిలుస్తోంది. ఏది కోరుకున్న వారికి అది లభించే గమ్యం ఇది. లండన్‌కు 315 కి.మీ. దూరంలో లీడ్స్‌ నగరం ఉంది.
చూడాల్సినవి.. హేర్‌వుడ్‌ హౌస్‌, కిర్క్‌స్టాల్‌ అబ్బే మానిస్టరీ, రౌండ్‌హే పార్క్‌, సిటీ మ్యూజియం, రాయల్‌ ఆర్మరీస్‌ మ్యూజియం… ఇంకా ఎన్నో!
**దుర్హమ్‌
వేర్‌ నదీ తీరంలో ఉన్న దుర్హమ్‌ పట్టణం మధ్య యుగాల్లో ఆధ్యాత్మిక యాత్రా ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అతి పెద్ద సోషలిస్ట్‌ కార్మిక సమ్మేళనంగా పేర్కొనే మొదటి దుర్హమ్‌ మైనర్స్‌ గాలా (1871) జరిగింది ఇక్కడే. ఇది లండన్‌కు 435 కి.మీ. దూరంలో ఉంది.
చూడాల్సినవి.. కేథడ్రల్‌ చర్చ్‌ ఆఫ్‌ క్రీస్ట్‌, దుర్హమ్‌ కోట, ఆర్కియాలజీ మ్యూజియం, ఓరియంటల్‌ మ్యూజియం, బొటానికల్‌ గార్డెన్‌ … మరెన్నో!
**ఛెస్టర్‌- లె- స్ట్రీట్‌
దుర్హమ్‌కు సుమారు 12 కి.మీ. దూరంలో, వేర్‌ నదీ తీరంలో నెలకొన్న మరో పట్టణం ఛెస్టర్‌-లె-స్ట్రీట్‌. బ్రిటన్‌లోని ఉత్తర- దక్షిణ ప్రాంతాలను కలిపే మార్గంలో ఇది కీలకమైన ప్రదేశం. మార్కెటింగ్‌ కేంద్రంగా కూడా ఛెస్టర్‌-లె-స్ట్రీట్‌ ప్రసిద్ధి చెందింది. క్రైస్తవ సంస్కృతిలోనూ దీనికి సముచిత స్థానం ఉంది.
చూడాల్సినవి.. సెయింట్‌ మేరీ సెయింట్‌ కుత్‌బెర్ట్‌ చర్చి, రివర్‌ సైడ్‌ పార్క్‌, లేంబ్‌టన్‌ కోట, లుమ్లీ కోట తదితరాలు.
***వీసా ఇలా తీసుకోవాలి
ఇంగ్లండ్‌, వేల్స్‌ దేశాలు వెళ్ళాలంటే యుకె టూరిస్ట్‌ వీసా అవసరం. దాని కోసం అనుసరించాల్సిన విధానం:
www.gov.uk/ వెబ్‌సైట్‌లో మీ దరఖాస్తు నింపి, అవససరమైన పత్రాలను డిజిటల్‌ రూపంలో సమర్పించాలి.
వీసా అధికారులను కలుసుకోవడం కోసం అపాయింట్‌మెంట్‌ తేదీని పేర్కొని, నిర్దిష్టమైన ఫీజులను చెల్లించాలి.
ఫీజులు చెల్లించిన తరువాత దరఖాస్తు రిఫరెన్స్‌ నెంబర్‌ ఇస్తారు.కేటాయించిన నిర్దిష్ట సమయానికి యుకె వీసా దరఖాస్తు కేంద్రానికి వెళ్ళి, దరఖాస్తు ప్రతిని, దానితో దాఖలు చేసిన పత్రాల కాపీలను అందజేయాలి.అన్ని పత్రాలూ సక్రమంగా ఉండి, అధికారులు వాటిపై సంతృప్తి చెందితే వీసా మంజూరు అవుతుంది.త్వరగా వీసా పొందడానికి ‘యుకె ప్రియారిటీ వీసా’, ‘సూపర్‌ ప్రియారిటీ వీసా’ అనే సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రియారిటీ వీసాను అయిదు పని దినాల్లో, సూపర్‌ ప్రియారిటీ వీసాను 34 గంటల్లో ప్రాసెస్‌ చేస్తారు.
**మనవాళ్ళే ఎక్కువ
ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్‌- వేల్స్‌ దేశాల్లో జరగనున్న ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలకు అత్యధికంగా ప్రయాణం కడుతున్నది భారతీయులేనని తెలుస్తోంది. భారతదేశంలో యుకె వీసా సేవల్లో తమ భాగస్వామి విఎఫ్‌ఎస్‌ గ్లోబల్స్‌ సంస్థ రోజుకు 3,500 పైగా దరఖాస్తులు అందుతున్నట్టు చెన్నైలోని బ్రిటిష్‌ హైకమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య రెండు లక్షలకు పైగా యుకె వీసా అప్లికేషన్లను ఆ సంస్థ ప్రాసెస్‌ చేసిందనీ, వీటిలో మార్చి- ఏప్రిల్‌ నెలల్లోనే 1,32,00 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. కాబట్టి ప్రపంచకప్‌లో కోహ్లీ సేనకు గ్యాలరీ నుంచి గట్టి మద్దతు ఉన్నట్టే!
మరో విషయం ఏమిటంటే, ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్‌ కన్నా భారత్‌ ఆడే మ్యాచ్‌లకే టిక్కెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.