Sports

చాలా ఆనందంగా ఉంది

Dinesh Karthik on getting into 2019 Indian world cup squad-tnilive

టీమిండియాలో అవకాశాలు వచ్చినా రాకున్నా క్రికెట్‌లో కొనసాగినందుకే ప్రస్తుత ప్రపంచకప్‌లో చోటు దక్కిందని బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతుతోనే ఇది సాధ్యమవుతోందని వెల్లడించాడు. ‘నా కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదాలు లేకుంటే ఇప్పటి వరకు క్రికెట్‌ ఆడేవాడిని కాదు. మంచో, చెడో జనాలు ఇంకా నా గురించి మాట్లాడుతున్నారంటే అది క్రికెట్‌లో ఉండబట్టే. అందుకు నాకెంతో సంతృప్తిగా ఉంది. ఇప్పటికీ జట్టులో స్థానం కోసం కష్టపడుతున్నా’ అని కార్తీక్‌ అన్నాడు. ఎంఎస్‌ ధోనీ కన్నా ముందే 2004లో దినేశ్‌ కార్తీక్‌ జట్టులోకి వచ్చాడు. ధోనీ టీమిండియాలో స్థిరపడిపోవడంతో డీకేకు అవకాశాలు పోయాయి. దాంతో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అవతారం ఎత్తాడు. రెండేళ్లు నిలకడగా రాణించిన అతడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక అవ్వకపోవడంతో ప్రపంచకప్‌ జట్టులో చోటుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ‘ఆసీస్‌ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో కాస్త షాకయ్యా. కానీ నాకు నాపై విశ్వాసం ఉంది. చివరికి రెండేళ్ల నా ప్రదర్శన ఆధారంగా ప్రపంచకప్‌నకు ఎంపికయ్యా. చాలా స్థానాల్లో బ్యాటింగ్‌ చేశా. అన్ని స్థానాల్లోనూ రాణించా. ఇప్పుడు మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే నాకు ముఖ్యం. నాపై నాకు నమ్మకముంది. నన్ను నమ్మేవాళ్లూ ఉన్నారు. టీమిండియాలో కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య అత్యంత ఆప్తులు. ప్రపంచకప్‌ జట్టులో వారు లేకుంటే బాధపడేవాన్ని. జట్టుతో ప్రయాణం చేస్తుంటే ఇతర ఆటగాళ్లూ దగ్గరవుతారు’ అని దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.