Business

ఇండియాకు సోనీ గుడ్‌బై

Sony bids farewell to its mobile sales in India-tnilive business news

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం సోనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తుల విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే సోనీ ప్రతి వస్తువును భారత్‌లోనూ విడుదల చేస్తుంటుంది. అయితే, ఇక నుంచి ఈ జాబితాలో స్మార్ట్‌ఫోన్లు ఉండవు. భవిష్యత్‌లో సోనీ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో విడుదల కావు. గత కొంతకాలంగా వరుస నష్టాలను చవిచూడటమే ఇందుకు కారణమని సమాచారం. దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలపై ఇక నుంచి పెద్దగా దృష్టి సారించబోమని సోనీ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరాన్ని కంపెనీ లాభాల ఏడాదిగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నిర్వహణ వ్యయాలను 50శాతం వరకూ తగ్గించుకోవాలని చూస్తోంది. ‘లాభసాటి మార్గం, 5జీ సేవలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మేము జపాన్‌, యూరప్‌, హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ దేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇప్పటికే సెంట్రల్‌, సౌత్‌ అమెరికాలో విక్రయాలను నిలిపివేశాం. అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాం’ అని సోనీ ప్రకటించింది. ఇప్పటికే సోనీ స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారికి కంపెనీ తరపు నుంచి పూర్తి సేవలు అందుతాయని తెలిపింది. అమ్మకాలు ఆపేసినా వినియోగదారులకు అన్ని విధాలా సేవలందిస్తామని పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్స్‌తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత అతి పెద్ద సార్మ్‌ఫోన్‌ మార్కెట్‌ భారత్‌కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు విడుదల చేసే అన్ని ఫోన్లు ఇక్కడ కూడా విక్రయానికి వస్తాయి. ఇటీవల కాలంలో భారత విపణిలో చైనా కంపెనీల హవా నడుస్తోంది. అతి తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లలో స్మార్ట్‌ఫోన్లు వస్తుండటంతో వినియోగదారులు అటువైపు అడుగులు వేస్తున్నారు.