Devotional

తిరుమల కాలినడక ప్రత్యేకత ఇదే

The history of tirumala step route-TNILIVE devotional

వెండి వాకిలి వెలుగులు.. బంగారు వాకిలి జిలుగులు.. అంతా వైభవమే!రెప్పపాటు కాలం కళ్లముందు కదలాడే శ్రీనివాసుడి రూపం.. మహాద్భుతం.ఆ క్షణంలోనే శ్రీవారి చెక్కిళ్లపై దీపాల కాంతి చూసే అదృష్టం కొందరిదైతే!ఆపాదమస్తకం మెరిసిపోయే ఆభరణాలను చూడగలగడం కొందరి సుకృతం. వెంకన్న దర్శనంతో తిరుమల యాత్ర పూర్తవ్వదుసప్తగిరుల్లో మరెన్నో ప్రత్యేకతలున్నాయి! ఓ నాలుగు రోజులు కొండపట్టునే ఉండి.. అవన్నీ చూడగలిగితే.. మరిన్ని మధురానుభూతులు సొంతం చేసుకోవచ్చు.
***అన్నమయ్య నడిచిన దారిలో: మామండూరు
తిరుమల పరిసరాలన్నీ పచ్చదనంతో అలరారుతుంటాయి. మామండూరు మరింత పచ్చగా కళకళలాడుతుంటుంది. ఎకో టూరిజం సెంటర్‌గా పేరున్న మామండూరుకు సకుటుంబ సమేతంగా విహారానికి రావొచ్చు. కొండలు, చెట్లు, పిల్లకాల్వలు, జలధారలతో ఈ ప్రాంతం పర్యాటక ప్రియుల మనసు దోచేస్తుంది. కడప నుంచి అన్నమయ్య ఈ మార్గంలోనే తిరుమల చేరుకున్నారని చెబుతారు. ఇప్పటికీ కొందరు యాత్రికులు ఈ బాటన తిరుమలకు వెళ్తుంటారు. సాహసవంతులు ఇక్కడ ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. నైట్‌ క్యాంప్‌, జంగిల్‌ సఫారీ అవకాశమూ ఉంది. రిసార్ట్‌ సౌకర్యం ఉంది. బస కోసం టెంట్‌ హౌస్‌, హట్స్‌ అందుబాటులో ఉన్నాయి. చిక్కటి అడవిలో చక్కగా నిద్రించడం, ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వింటూ మేల్కొనడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకోవచ్చు. వివరాలకు www.vanadarshani.in వెబ్‌సైట్‌ చూడండి.
* మామండూరు.. తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో చేరుకోవచ్చు.
***రడవిలో కాలినడకన:
గుంజాల జలపాతం
ట్రెక్కింగ్‌ ప్రియులు చూడాల్సిన మరో ప్రదేశం గుంజాల జలపాతం. శేషాచలం అడవిలో సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే.. కళ్లముందు ఓ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. 230 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటిధారలను చూడగానే అలసట మాయమవుతుంది. ఈ ప్రయాణంలో గిరిజన గూడేలు తారసపడతాయి. వారి ఆత్మీయ ఆతిథ్యం మైమరపిస్తుంది. తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో గంగిరాజుపొదుల గ్రామం మీదుగా అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది.
* గుంజాల జలపాతం, శక్తి కఠారి తీర్థం వెళ్లాలంటే అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. దరఖాస్తు నింపి, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల నకలు జతపరచాలి. నిర్దేశించిన ఫీజు బ్యాంకులో చెల్లించి రసీదు ఇవ్వాలి. సహాయకులను వెంట పంపుతారు. వారికి నిర్దేశించిన రుసుం చెల్లించాలి.
***మనోహరం: జాపాలి తీర్థం
తిరుమల క్షేత్రంలో మనోహరమైన ప్రాంతాల్లో జాపాలి తీర్థం ఒకటి. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు సహా ఆంజనేయుడు ఇక్కడ కొంత కాలం నివాసం ఉన్నాడని పురాణ గాథ. జాపాలి తీర్థంలో ఆంజనేయుడి ఆలయం ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో విశాలమైన కోనేరు, చెంతనే దేవాలయం.. ప్రశాంతతకు చిరునామాగా ఉంటుంది. జాపాలి మహర్షి తపస్సు చేసిన చోటు కావడంతో దీనికాపేరు వచ్చింది. పాపవినాశనానికి వెళ్లే దారిలో ఉంటుందీ తీర్థం. కొండమీద ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు. రహదారి నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి.
***శ్రీవారి నిధి: శ్రీవేంకటేశ్వర మ్యూజియం
తిరుమలేశుడిని అన్నమయ్య వేల సంకీర్తనలతో అర్చించాడు. ఆ వాగ్గేయకారుడు పద సంపద కళ్లారా చూడాలనుకుంటే.. శ్రీవేంకటేశ్వర మ్యూజియానికి వెళ్లాలి. 16వ శతాబ్దంలో అన్నమయ్య రాసిన సంకీర్తనలు అక్కడ రాగిరేకులపై దర్శనమిస్తాయి. అంతేకాదు ఏడుకొండలవాడి వైభవాన్ని ఇక్కడ చూడొచ్చు. అపురూప చిత్రాలు, అందమైన విగ్రహాలు, విభిన్న కళాకృతులు ఇలా ఎన్నో ఇక్కడున్నాయి. 1.25 లక్షల చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో వీటన్నిటినీ భద్రపరిచారు. ఆలయం ఉత్తర భాగం వైపు 1997లో నిర్మించిన ఈ మ్యూజియం.. దేశంలోనే అత్యధికులు సందర్శించిన ప్రదర్శనశాలగా గుర్తింపు పొందింది.
*సుస్వాగతం: శిలాతోరణం
ఏడు కొండలపై మరో అద్భుతం శిలాతోరణం. 150 కోట్ల సంవత్సరాల నాటి పురాతన శిలలు స్వాగత తోరణంగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 15 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో కనువిందు చేస్తుంది. తిరుమల ఆలయానికి కిలోమీటరు దూరంలోనే ఉంటుంది. ఈ తోరణాన్ని తాకడాన్ని ప్రభుత్వం నిషేధించింది. దూరం నుంచి చూడొచ్చు. అక్కడి నుంచి నేరుగా పైకి వెళ్తే.. శేషాచలంలోని చిట్టచివరి కొండగా, తిరుమల ఆలయం కన్నా ఎత్తులో ఉన్న నారాయణాద్రిపై శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. వైకుంఠం నుంచి వచ్చిన నారాయణుడు తిరుమలలో మొదట కాలుమోపిన ప్రదేశమిదేనని చెబుతారు. ఇక్కడి నుంచి తిరుమల పరిసరాలన్నీ చూడొచ్చు.
***సాహసంతో..: తుంబురు తీర్థం
తిరుగిరుల్లో శతాధిక తీర్థాలున్నాయని ప్రతీతి. దేని పవిత్రత దానిదే! వీటిలో తుంబురు తీర్థం ఒకటి. ఇక్కడికి వెళ్లాలంటే చిన్నపాటి సాహసయాత్ర చేయాల్సి వస్తుంది. పిల్లతోవలో.. ఏడు కిలోమీటర్లు నడవాలి. కొండలు ఎక్కుతూ, గుట్టలు దిగుతూ.. ప్రకృతి ఒడిలో సాగే ప్రయాణం మనసుకు ఉత్సాహాన్నిస్తుంది. ఇదే దారిలో సనక సనందన తీర్థం వస్తుంది. అది దాటి ఇంకాస్త ముందుకు వెళ్తే.. నిర్మలంగా, ప్రశాంతంగా ప్రవహించే తుంబురు తీర్థానికి చేరుకోవచ్చు. భక్తులు అందులో స్నానం చేసి గట్టున ధ్యానం చేసుకుంటూ ఉంటారు.
***దుర్గమ్మ మాయమ్మ : శక్తి కఠారి తీర్థం
సప్తగిరుల్లో లోనికి వెళ్లే కొద్దీ ప్రత్యేకమైన తీర్థాలు ఎన్నో దర్శనమిస్తాయి. శక్తి కఠారి తీర్థం అలాంటిదే. దీనిని దుర్గమ్మ శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల దుష్ట గ్రహ బాధలు తొలగుతాయని నమ్మకం. దట్టమైన అడవిలో ఉన్న శక్తి కఠారి తీర్థానికి చేరుకోవడం అందరికీ సాధ్యం కాదు. అడవిలో దారి తెలిసిన వారిని వెంట తీసుకెళ్లాలి. ట్రెక్కింగ్‌లో నైపుణ్యం ఉండాలి. దారి తప్పినా, ఒంటరిగా వెళ్లినా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. పాత పాపవినాశనం సమీపంలో నుంచి అడవి గుండా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే.. ఇక్కడికి చేరుకోవచ్చు. గుట్టలు, పదునైన రాళ్లు దాటుకుంటూ ముందుకుసాగాలి.
**తెల్లపులిని చూద్దాం
అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ఉంటుంది. 5,532 ఎకరాల్లో విస్తరించిన జూలో రకరకాల జంతువులను చూడొచ్చు. విస్తీర్ణ పరంగా ఆసియాలోనే అతిపెద్ద జూ ఇది. సఫారీ అవకాశం ఉంది. పులులు, సింహాలను దగ్గరగా చూడొచ్చు. రాత్రిపూట సఫారీకి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
****కేరింతల కాన: తలకోన
తిరుమల పరిసరాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం తలకోన. సినిమా షూటింగ్‌లు విరివిగా జరుగుతుంటాయిక్కడ. 82 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలధారలు.. మనసును కట్టిపడేస్తాయి. అప్పటి వరకు జలపాత హొయలు చూస్తూ ఆశ్చర్యపోయిన వాళ్లు.. దాని కిందికి చేరగానే పెద్దలమన్న సంగతే మర్చిపోతారు. పిల్లల్లా కేరింతలు కొడుతూ జలక్రీడలు ఆడుతూనే ఉంటారు. వేసవిలోనూ కనువిందు చేసే జలపాతం.. రుతురాగాల వేళ మరింత ఆకట్టుకుంటుంది. పరిసర ప్రాంతాలు అంతెత్తు చెట్లతో, అందమైన లతలతో నయన మనోహరంగా ఉంటాయి. సాయంత్రం కావడంతోనే చల్లగాలి చక్కిలిగింతలు పెడుతుంది. కీచురాళ్ల సద్దు మొదలవుతుంది. వీటన్నిటినీ ఆస్వాదించాలంటే ఒక రాత్రి ఇక్కడ బస చేయాలి. పర్యాటకశాఖ అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి.
* తలకోన.. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు.
జంతు ప్రపంచం: పులిబోను
జంతు ప్రేమికులు తిరుపతి సమీపంలోని పులిబోను బేస్‌ క్యాంప్‌ చూడొచ్చు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో సఫారీ చేయొచ్చు. దట్టమైన అడవిలో ఏడు కిలోమీటర్లు సాగే సఫారీలో.. పొదల చాటునున్న హరిణాలను, కొమ్మపై ఉన్న కొండెంగలను, కోనేటి చెంతనున్న ఎలుగును చూడొచ్చు. సఫారీ మధ్యలో సద్దికోళ్లబండ, శ్యామకోన వంటి ప్రకృతి నిలయమైన ప్రదేశాలను చూడొచ్చు.
* పులిబోను.. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రగిరి సమీపంలోని అటవీశాఖ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాలు ఉంటాయి.
1. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఆశీర్వచనం అందజేసిన శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం అర్చకులు.
2. జగన్ నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్… టీటీడీ పురోహితులు…జగన్ కి వేద ఆశివచనం ఇచ్చిన పురోహితులు…స్వామి వారి తీర్థప్రసాదాలు ఇచ్చిన పురోహితులు…అనిల్ సింఘాల్ ,డాలర్ శేషాద్రి.
3. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు శుక్రవారం 24-05-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ……
శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి 26 గంటల సమయం” పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 07 గంటల సమయం పడుతోంది..
నిన్న మే 23 న 80,538 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.77 కోట్లు.
4. చరిత్రలో ఈ రోజు/మే 25
1865 : నోబెల్ బహుమతి గ్రహీత, డచ్చి భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం (మ. 1943).
1886 : భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు రాస్‌ బిహారి బోస్‌ జననం (మ. 1945)
1897 : స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త మరియు కవి కల్లూరు సుబ్బారావు జననం (మ.1973).
1899 : బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం (మ.1976 ).
1924 : బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ మరణం (జ.1864).
1936 : భారత క్రికెటర్ రూసీ సూర్తీ జననం (మ. 2013).
1972 : భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు కరణ్ జోహార్ జననం.
1975 : స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి పద్మజా నాయుడు మరణం (జ.1900).
2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.
2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలవత్ పూర్ణ
5 శుభమస్తు
తేది : 24, మే 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 20 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 25 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 14 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ వరకు)
యోగము : శుక్లము
రణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 15 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 40 ని॥ నుంచి మ తెల్లవారుజాము 0 గం॥ 26 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 11 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 55 ని॥ వరకు)
మగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 4 ని॥ వరకు)
సూర్యోదయం: ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 43 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మకరము
6. జగన్‌కు తితిదే ఆశీర్వచనాలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీస్సులు అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను తితిదే ఈవో అశోక్‌కుమార్‌ సింఘాల్ కలిశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు జగన్‌కు ఆశీర్వచనాలు ఇచ్చి.. శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
జగన్‌కు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆశీస్సులు అందించింది. తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను కలిసిన ఆలయ వేదపండితులు..అమ్మవారి తీర్థప్రసాదాలు, మొమొంటోను ఆయనకు అందించారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గగుడిని మరింత అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగన్‌ చెప్పినట్లు ఈవో తెలిపారు
8. అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం
రామగుండం ఫెర్టిలైజర్‌ సిటీ సమీపంలోని గౌతమీ నగర్‌లో నెలకొన్న అయ్యప్ప స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవాన్ని గ్రామస్థులు శుక్రవారం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో బొల్లారం అయ్యప్ప దేవాలయ ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో గణపతి హోమంతో పాటు అయ్యప్ప స్వామికి విశేషమైన అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
9. మావుళ్లమ్మ అన్నసమారాధనకు లక్ష విరాళం
భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం అందించారు. జక్కరం గ్రామానికి చెందిన పెరిచర్ల రామదేవన్‌రాజు విజయలక్ష్మి దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కొట్టు సత్యనారాయణకు ఈ నగదును అందించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ దాతలకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు బి. సత్యనారాయణ, తనిఖీ దారుడు కె బాపిరాజు, మావుళ్లమ్మ బంగారు చీర కమిటీ మాజీ కోశాధికారి గొంట్ల వెంకటనారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.