ScienceAndTech

భారత ఎన్నికల దెబ్బకు గట్టిగా కూతపెట్టిన ట్విట్టర్

Twitter sees a huge surge of tweets related to 2019 indian elections-tnilive telugu science and technology

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ సామాజిక మాధ్యమం వాడకంలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుందని ‘ట్విటర్‌ ఇండియా’ వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2019లో సుమారు 600శాతం మేర పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది. జనవరి 1నుంచి మే 23 మధ్య సుమారు 396 మిలియన్ల ట్వీట్‌లు జరిగినట్లు తెలిపింది. వీటిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న వివిధ అంశాల సరళిని ట్విటర్‌ విశ్లేషించింది. ఏప్రిల్‌ 11 మొదలుకొని మే 19వరకూ జాతీయ భద్రత అంశమే ఈ ఎన్నికల్లో అత్యధిక మంది చర్చించుకున్న విషయంగా చోటు సంపాదించింది. మతం, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం వంటి అంశాలు తరువాతి స్థానంలో నిలవగా.. నోట్లరద్దుపై నామమాత్రంగానే ట్వీట్‌లు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల మొత్తంలో ప్రధాని నరేంద్రమోదీ గురించి ఎక్కువగా చర్చలు, విశ్లేషణలు జరగగా, భాజపా, ఎన్డీయే పక్షాల ప్రస్తావనలు 53శాతం ఇందులో ఉన్నాయి. కాంగ్రెస్‌, యూపీయే భాగస్వామ్య పక్షాలు 37శాతం ట్విటర్‌ ప్రస్తావనల్లో చోటు సంపాదించాయి. మోదీ తరువాతి స్థానంలో.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాలు ఉన్నారు. ట్వీట్‌ల సంభాషణల్లో ఇంగ్లీషు, హిందీ భాషలు ఆధిక్యాన్ని కనబర్చగా, తమిళ్‌, గుజరాతీల్లో ఎక్కువగా ఎన్నికలకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లున్నాయని ట్విటర్‌ పేర్కొంది. సార్వత్రికల ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసున్నామని, తద్వారా అభ్యంతకరంగా ఉన్న పోస్టులను తొలగించే విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపామని ఈ సామాజిక మాధ్యమం పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు సోషల్‌ మీడియా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు కట్టుబడి వ్యవహరించామని ట్విటర్‌ తెలిపింది.