Politics

ఎంపీల సౌకర్యాలు ఇవే..

Indian MPs enjoy this long list of facilities and luxuries and allowances - tnilive

మనదేశంలో పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కావడం ఓ గొప్ప యోగం. దేశ రాజధానిలోని పార్లమెంటు గడపతొక్కడం మహర్జాతకం. మరి అలాంటి ఎంపీలకు ప్రభుత్వం అందించే జీతభత్యాలు, కల్పించే సౌకర్యాలూ ఘనమైనవే. వాటిని ఓసారి పరిశీలిస్తే..ఎంపీలకు దాదాపు అన్ని సౌకర్యాలు ఉచితంగా అందుతాయి. వీరికి నెలకు రూ.లక్ష మూలవేతనం అందుతుంది. దీనికితోడు నియోజకవర్గం అలవెన్స్‌ కింద రూ.45 వేలు, కార్యాలయ సిబ్బంది కోసం మరో రూ.45 వేలు అదనంగా ఇస్తారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తమ రాష్ట్ర ఎంపీలకు భద్రతా భత్యం కింద ప్రతినెలా రూ.50 వేలు అందిస్తున్నాయి. దిల్లీలో ఉచిత నివాసం, నీరు, విద్యుత్తు, టెలిఫోన్‌, వైద్య సౌకర్యం పార్లమెంటు సమకూరుస్తుంది. ఉచిత రైలు, విమాన, నౌకాయాన సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
***మూల వేతనం – రూ. లక్ష
ప్రతి అయిదేళ్లకోసారి అప్పటి ద్రవ్యోల్బణం ఆధారంగా ఆటోమేటిక్‌గా పెరుగుతూపోతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు వారి ఎంపీలకు అందించే భద్రత భత్యం నెలకు రూ.50 వేలు
* ఆఫీసు ఖర్చుల కింద నెలకు రూ.45 వేలు. ఇందులో రూ.15 వేలు స్టేషనరీ, పీఏలకు రూ.30 వేలు ఖర్చు చేసుకోవచ్చు.
* ఎంపీకి, జీవిత భాగస్వామికి రైలు ప్రయాణం ఉచితం. ఏ తరగతిలోనైనా వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించొచ్చు.
* వ్యక్తిగత సహాయకుడికి 2ఏసీ రైలుపాస్‌ ఇస్తారు.
* ఎంపీకి భార్య, భర్త లేకపోతే ఆ స్థానంలో ఇంకెవరినైనా తీసుకెళ్లవచ్చు.
* ప్రతి సభ్యుడికి సంవత్సరానికి 34 విమాన టికెట్లు ఇస్తారు.
* వాటిపై దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చు.
* ఎంపీ జీవిత భాగస్వామికి 8 విమానం టికెట్లు ఉచితంగా ఇస్తారు.
* ఒకవేళ ఎవరైనా ఏడాదిలో 34 ప్రయాణాలు చేయలేకపోతే మిగిలిన టికెట్లను మరుసటి ఏడాదిలో అదనంగా వాడుకోవచ్చు.
* పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వచ్చి వెళ్లడానికి రెండు టికెట్లు ఇస్తారు.
* స్థాయీ సంఘ సమావేశాలు ఉన్నప్పుడు వాటికి వచ్చి వెళ్లడానికి ఉచిత విమాన టికెట్‌ అందిస్తారు.
* ఎంపీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాదిని లెక్కిస్తారు.
* చూపుసరిగా లేని అభ్యర్థులు తమతోపాటు ఓ సహాయకుడిని విమానంలో, రైల్లో ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
* దివ్యాంగ ఎంపీలకెవరికైనా వ్యక్తిగత సహాయకుడు అవసరమైతే ఆ విషయాన్ని ముందుగా స్పీకర్‌కు తెలిపి అనుమతి తీసుకోవాలి.
* దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిలోని ప్యానల్‌ డాక్టర్లు ఎంపీ వైకల్యాన్ని ధ్రువీకరించి సర్టిఫికెట్‌ మంజూరు చేసిన తర్వాతే అతనితో పాటు సహాయకుడికి ఉచిత విమాన, రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి ఈ ధ్రువీకరణ తప్పనిసరి.
* మాజీ ఎంపీలు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.20వేల పింఛను వస్తుంది.
* అయిదేళ్లకు మించి పనిచేసిన వారికి ప్రతి సంవత్సర కాలానికి నెలకు రూ.15వందల అదనపు పింఛను లభిస్తుంది.
* 9 నెలలకు మించిన కాలాన్ని ఏడాదిగా గుర్తిస్తారు.
* ఈ పింఛను తీసుకొనే వారికి ఇంకా ఏవైనా పింఛన్లు వస్తుంటే వాటిని తీసుకోవడానికి ప్రతిబంధకాలేమీ ఉండవు.
* ఎంపీ చనిపోతే ఆయన / ఆమె కన్నుమూసే సమయానికి అందుకుంటున్న పింఛనులో 50% ఆయన / ఆమెపై ఆధారపడ్డ జీవిత భాగస్వామికి ఇస్తారు.
* అండమాన్‌ నికోబార్‌లాంటి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీలకు స్టీమర్‌ పాస్‌ ఇస్తారు.
* కొత్తగా ఎంపీగా ఎన్నికై వచ్చిన వారికి దిల్లీలోని హోటళ్లు, అతిథిగృహాల్లో తాత్కాలిక వసతి సౌకర్యం కల్పిస్తారు.
* అక్కడ ఉన్నంత కాలం ఆహారం, ఇతర ఛార్జీలకు అవసరమైన భత్యం అందిస్తారు. ఎంటీఎన్‌ఎల్‌ ఫోన్‌ కనెక్షన్‌ ఇస్తారు.
* తర్వాత ఆయన / ఆమె పదవిలో ఉన్నంత కాలం దిల్లీలో ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తారు.
* ఎంపీకున్న అనుభవాన్ని బట్టి పెద్ద బంగ్లా కానీ, అపార్ట్‌ మెంట్‌ తరహా ఇళ్లు కానీ ఇస్తారు. ఒకవేళ ఎంపీ చనిపోతే కుటుంబ సభ్యులు గరిష్ఠంగా ఆరునెలలపాటు ఆ ఇంటిని ఉంచుకోవచ్చు.
* ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే నెలరోజుల్లోపు ఖాళీచేయాల్సి ఉంటుంది.
* వీరికి ఏటా 4వేల కిలోలీటర్ల నీరు, 50 వేల యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తారు.
* ఒకవేళ ఎంపీ దిల్లీలోని ప్రైవేటు గృహంలో నివసిస్తున్నా ఈ రెండు సౌకర్యాలు కల్పిస్తారు. ఏడాదిలోపు ఇంత మొత్తం నీరు, విద్యుత్తు వాడకపోతే మిగిలిన యూనిట్లను తదుపరి సంవత్సరం అదనంగా వాడుకోవచ్చు.
* ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఎంపీలుగా ఉండి, ఒకే నివాసంలో ఉన్నట్లయితే వారికి ఏటా 8వేల కిలోలీటర్ల నీరు, లక్ష యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తారు.
* రెండు ఉచిత టెలిఫోన్లు ఇస్తారు. ఇందులో ఒకటి దిల్లీలో ఇంట్లోకానీ, కార్యాలయంలోకానీ వాడుకోవచ్చు.
* మరొకటి నియోజకవర్గంలో ఉపయోగించుకోవచ్చు. ఒక్కో ఫోనుకు ఏటా 50వేల ఉచిత లోకల్‌కాల్స్‌ అందిస్తారు.
* దీనికితోడు దిల్లీలోకానీ, స్వరాష్ట్రంలోకానీ తాను ఎంచుకున్న చోట ఒక అదనపు ఫోన్‌ పెట్టుకోవచ్చు.
* దానికీ 50వేల ఉచిత లోకల్‌కాల్స్‌ ఇస్తారు. ఎంపీ తన సొంత ఖర్చులు పెట్టుకొని మూడుకు మించి ఫోన్లు పెట్టుకుంటే ఈ 1.50 లక్షల ఫోన్‌కాల్స్‌ ను వాటి ద్వారానూ ఉపయోగించుకోవచ్చు.
* దిల్లీలో ఒక ఎంటీఎన్‌ఎల్‌ ఫోన్‌, నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్‌ వాడుకోవచ్చు.
* బీఎస్‌ఎన్‌ఎల్‌ కవరేజీ లేని చోట ప్రైవేటు ఫోన్‌ ఉపయోగించుకోవచ్చు.
* తనకిచ్చిన 1.50 లక్షల కాల్స్‌ ను వాటికి సర్దుబాటుచేస్తారు. తనకిచ్చిన మూడు ఫోన్లలో ఏదో ఒకదానికి బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వం గరిష్ఠంగా నెలకు రూ.1500 చెల్లిస్తుంది.
* ఎంపీ, వారి జీవిత భాగస్వామి, ఆధారపడ్డ మైనర్‌ పిల్లలకు కేంద్ర ప్రభుత్వ వైద్య పథకం వర్తిస్తుంది.
*****సరిపోవడం లేదంటున్న ఎంపీలు
పెరిగిపోతున్న ఖర్చులు, నియోజకవర్గంలో రోజూ వచ్చి కలిసివెళ్లే ప్రజలకు కల్పించే అతిథి సౌకర్యాలతో పోలిస్తే ఈ జీతభత్యాలు ఏమూలకూ సరిపోవడంలేదు. నిత్యం ప్రజలతో ఉంటూ, నియోజకవర్గంలో తిరగాలంటే ఇంకా చాలా మొత్తం చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉండాలంటే పెళ్లిళ్లు, చావులు, ఇతర అన్నిరకాల శుభాశుభ కార్యక్రమాలకు హాజరవడంతోపాటు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటి ఖర్చుతో పోలిస్తే మాకిచ్చే జీతభత్యాలు ఏ మూలకూ సరిపోవడం లేదు.