Sports

షమీ మంచి బలం అవుతాడు

Ganguly recommends shami as secondary pacer to icc 2019 indian world cup squad

ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌కి బదులు మహ్మద్‌ షమీని రెండో పేసర్‌గా తీసుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ సూచించాడు. ప్రస్తుతం షమీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని, కోహ్లీసేన అతడి సేవలను ఈ మెగా ఈవెంట్‌లో ఉపయోగించుకోవాలని పేర్కొన్నాడు. అయితే భువనేశ్వర్‌ ఇప్పుడు ఫామ్‌ కోల్పోయాడని త్వరలోనే ఇంతకన్నా మెరుగైన ఫామ్‌తో తిరిగొస్తాడని చెప్పారు. గంగూలీ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌ చక్కటి ప్రదర్శన చేసిన షమీ గత ఏడాదిగా టీమిండియాలో అద్భుతంగా రాణిస్తున్నాడు. నేను భువనేశ్వర్‌కి వ్యక్తిగతంగా అభిమానే.. అయినా అది అక్కడికే పరిమితం. గత నాలుగైదు నెలలుగా అతడు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అయితే త్వరలో ఇంతకన్నా మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు. అలాగే యువఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యని మూడో పేసర్‌గా తీసుకోవాలని, దాంతో మరో బ్యాట్స్‌మెన్‌కి జట్టులో అవకాశం దొరుకుతుందని అన్నాడు. కనీసం టోర్నీ ఆరంభంలోనైనా బుమ్రా, షమీ, పాండ్యల బౌలింగ్‌ లైనప్‌ను చూడాలనుకుంటున్నానని దాదా వివరించాడు. ఇంకా తాను ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ఖాన్‌తో మాట్లాడానని చెప్పాడు. మహ్మద్‌ షమీలా మరే ఇతర భారత బౌలర్‌ని జహీర్‌ గతకొన్నేళ్లుగా చూడలేదని చెప్పినట్లు తెలిపాడు. డెత్‌ ఓవర్లలో షమీ, బుమ్రా పదునైన యార్కర్లతో ప్రత్యర్థులను హడలెత్తించి సత్తా చాటుతారని అభిప్రాయపడ్డాడు.