Movies

“యాత్ర2” రానుందా?

Yatra2 is on its way to woo YSR fans

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ బయోపిక్‌ తెరకెక్కించారు దర్శకుడు మహి వి. రాఘవ్‌. వైఎస్సార్‌ చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్మట్టి రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. వైఎస్సార్‌ కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ తన తండ్రి మార్గాన్నే ఎంచుకుని ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మహి. వి రాఘవ్‌ ట్విటర్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు. జగన్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ..‘కంగ్రాట్స్‌ జగన్‌ అన్నా. ఈ విజయానికి నువ్వు అర్హుడివే. నువ్వు హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌ ప్రజల కోసం చేసిన కృషి కంటే ఎక్కువగా కష్టపడతావని ఆశిస్తున్నాం. ప్రజలకు చెప్పి తీరాల్సిన విజయం నీది’ అని పేర్కొంటూ ‘యాత్ర 2’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. నిర్మాత శివ మేకను కూడా ట్యాగ్‌ చేశారు. దీనిని బట్టి చూస్తే రాఘవ్‌ ‘యాత్ర 2’కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.