Editorials

తెలుగుదేశం కొంప ముంచిన లోకేష్ కోటరీ-TNI ప్రత్యేకం

How the fall of Telugudesam party began with Lokesh and his advisors-tnilive

దాదాపు 36ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వ్యవహరించి కేంద్ర రాజకీయాల్లోనూ బలమైన ముద్ర వేసిన తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. పరాజయానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. చాలా విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన చంద్రబాబునాయుడు కొడుకు విషయంలో మాత్రం పుత్రవాత్సల్యాన్ని ప్రదర్శించి అభాసుపాలయ్యారు. పరిపక్వతలేని లోకేష్‌ను చంద్రబాబు దొడ్డిదారిన క్యాబినెట్లోకి తీసుకురావడం పట్ల అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. వాస్తవానికి లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించి మంచి శిక్షణ ఇప్పించి ఉంటే బాగుండేదని…అలా కాకుండా లోకేస్‌ను నేరుగా మంత్రిగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమయింది. లోకేష్ కూడా మంత్రిగా ఆశించినంత మేర రాణించలేకపోయారు. వివిధ సందర్భాల్లో తడబడి దారుణంగా అభాసుపాలయ్యాడు.
*** కొంపముంచిన లోకేష్ కోటరీ
లోకేష్ కోటరీలో అనామకులు చేరారు. పట్టుమని పది ఓట్లు కూడా తేలేని వ్యక్తులు ఎప్పుడూ లోకేష్ చుట్టూ ఉండేవారు. వారంతా చినబాబును పక్కదారి పట్టించారని, బయటి విషయాలు తెలీయకుండా జాగ్రతలు తీసుకునేవారని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ ఎన్నార్టీ చైర్మన్‌గా ఉన్న డా.వేమూరు రవి, ఆయన సోదరుడు వేమూరు హరి, గతంలో కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించిన అమెరికాకు చెందిన కలపటపు బుచ్చిరాంప్రసాద్, లోకేష్ చిన్ననాటి మిత్రులు ఎక్కువగా ఆయన చుట్టూ కనిపించేవారు. ఏపీఎన్నార్టీ లోకేష్‌కు బీనామీగా వ్యవహరించిందని కోట్లాది రూపాయలు ఈ సంస్థ ద్వారా నిధులు దుర్వినియోగం అయ్యాయని వీటి ద్వారా పలు బోగస్ ఐటీ సంస్థలను అమరావతి చుట్టూ ఏర్పాటు చేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. లోకేష్ కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులును దూరంగా ఉంచడం వారి చెప్పే సమస్యలను పట్టించుకోకపోవడం కూడా పార్టీలో అసంతృప్తికి కారణమయ్యింది. లోకేష్ మీద తెలుగుదేశం పార్టీలో ఉన్న తీవ్ర అసంతృప్తి చివరకు ఆయన ఓటమికే దారి తీసింది. సాక్షాత్తు చంద్రబాబు కుమారుడే ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయినట్లు అయింది. చంద్రబాబు పుత్రవాత్సల్యం ప్రదర్శించకుండా ఉంటే కనీసం మరికొన్ని సీట్లు అయినా పెరిగేవని ఆ పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్