Sports

భారత క్రికెట్ జట్టు బలహీనతలు ఇవి

ICC CWC 2019 Indian Teams Weakness List

12వ వన్డే ప్రపంచకప్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈపాటికే అన్ని జట్లూ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమమై ఉంటాయి. కాగా ఏయే జట్లు ఎలా ఉన్నా.. టీమిండియా పరిస్థితి ఒకసారి విశ్లేషిస్తే ప్రధానంగా మూడు అంశాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం నెలకొంది. అందుకు కారణాలూ లేకపోలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో చేతులేత్తేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్‌ కోహ్లీ తన ఆటగాళ్లని వెనకేసుకొచ్చినా.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలవడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. అయితే బంగ్లాతో జరగబోయే రెండో మ్యాచ్‌లో వాటిని అధిగమించి ప్రపంచకప్‌లో ఘనంగా అడుగుపెడితే సగటు భారత అభిమానికి ఎంతో భరోసా కలుగుతుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓవల్‌ మైదానం పరిస్థితులు వేరు. పచ్చిక మైదానంలో బంతి ఇన్‌స్వింగవ్వడంతో భారత బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. అయితే రెండో సన్నాహక మ్యాచ్‌ కార్డిఫ్‌లో జరగనుండటంతో అక్కడి పిచ్‌ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. దీంతో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ నిలదొక్కుకుంటే భారత్‌ మంచి ఆరంభం సాధించగలదు. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ మిగతా పని పూర్తిచేస్తారు. టీమిండియా ప్రధాన సమస్యల్లో మిడిల్‌ఆర్డర్‌ బ్యాటింగే కీలకం. నాలుగు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు ఎంతో జాగ్రత్తగా ఆడాలి. అయితే ఈ స్థానాల్లో ఆడేందుకు చాలా మందిని పరీక్షించిన జట్టు యాజమాన్యం ఆఖరికి విజయ్‌శంకర్‌, కేదార్‌ జాధవ్‌లకు అవకాశం కలిగించింది. వీరిద్దరూ ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతుండగా కోహ్లీసేన బంగ్లాతో మ్యాచ్‌లో ఎవరిని ఆడిస్తుందో చూడాలి. ఒకవేళ విజయ్‌శంకర్‌, జాధవ్‌ మంచి ప్రదర్శన చేస్తే ఇక ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. ఈ సారి ప్రపంచకప్‌ టోర్నీకి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వబోతుండగా అక్కడి పిచ్‌లు ఫ్లాట్‌గా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ మెగా టోర్నీల్లో పేస్‌బౌలింగ్‌తో పాటు స్పిన్‌బౌలింగ్‌ కూడా అత్యంత కీలకం. ఇక టీమిండియాలో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఉన్నారు. యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వీరిద్దరూ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయారు. ఇక ఈ మ్యాచ్‌లోనైనా మాయ చేసి వికెట్లు తీస్తే దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి పోరుకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లొచ్చు.