Health

సిగరెట్ ఫ్యాషన్ కాదు-ఇది చదవండి-దయచేసి మానేయండి

One cigarette can smash multiple systems in human body

వంటింట్లో తాళింపు పొగలనే తట్టుకోలేం. అలాంటిది నోట్లోంచి ఒక్క ఉదుటున దూసుకొచ్చే సిగరెట్‌, బీడీల పొగను ఒంట్లోని అవయవాలెలా తట్టుకుంటాయి? సీసాలో వేసి, బిరడా బిగించి.. లోపల పొగ పెట్టినట్టుగా ఉక్కిరిబిక్కిరి అయిపోవూ? నిజానికి పొగ దుష్ప్రభావాలు అనగానే ముందుగా ఊపిరితిత్తులు దెబ్బతినటమే గుర్తుకొస్తుంది. క్యాన్సర్లూ, గుండెజబ్బులూ భయపెడతాయి. అందులో సందేహమేమీ లేదు. వీటి గురించి తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ‘పొగ కాటు’ ఒక్క ఊపిరితిత్తులతోనే ఆగిపోదు. అన్ని అవయవాలనూ చుట్టుముడుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను గట్టిగానే దెబ్బతీస్తుంది. నోరు దగ్గర్నుంచి.. జీర్ణాశయం, కాలేయం, పిత్తాశయం, చిన్నపేగులు, పెద్దపేగు వరకూ అన్నింటినీ కకావికలం చేస్తుంది. కాబట్టి పొగాకు వ్యతిరేక దినం (మే 31) సందర్భంగానైనా కాస్త ‘పొగ తెరలు’ తొలగించుకుందాం.
తిండి తింటేనే కండ. కండ ఉంటేనే మనిషి. ఇలా కండపుష్టితో కళకళలాడాలంటే కేవలం తిండి తింటేనే సరిపోదు. తిన్నది సరిగా జీర్ణం కావాలి. ఆహారంలోని పోషకాలు బాగా ఒంట బట్టాలి. మిగిలిన వ్యర్థ పదార్థం ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోవాలి. ఈ ప్రక్రియ ఎక్కడ గాడితప్పినా మొదటికే మోసం వస్తుంది. పొగ తాగే అలవాటు సరిగ్గా ఇక్కడే దెబ్బకొడుతుంది. మన జీర్ణ వ్యవస్థ ఒక పొడవైన గొట్టంలా.. నోటి దగ్గర్నుంచి మలద్వారం వరకూ విస్తరించి ఉంటుంది. కాలేయం, క్లోమం, పిత్తాశయం వంటి అవయవాలన్నీ దీనిలోని భాగాలే. నోటితో నమలటంతో మొదలయ్యే జీర్ణ ప్రక్రియ మల విసర్జనతో అంతమవుతుంది. ఈ మధ్యలో తిన్న ఆహారం జీర్ణం కావటం, పోషకాలను శరీరం గ్రహించటం తనకు తానుగా జరిగిపోయే ప్రక్రియ. అయితే పొగలోని విషతుల్యాలు లోపలికి అడుగుపెడుతూనే జీర్ణ వ్యవస్థ పనితీరును అస్తవ్యస్తం చేయటం ఆరంభిస్తాయి. దీంతో క్రమంగా రుచి తగ్గిపోవటం, ఛాతీలో మంట, పేగుల్లో పుండ్ల వంటి సమస్యలెన్నో పుట్టుకొస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టటానికి క్యాన్సర్ల వంటి పెద్ద సమస్యలే కానక్కర్లేదు ఇలాంటి చిన్నా చితకా సమస్యలైన చాలు. నిజానికివి చిన్నవిగా అనిపించినా తీవ్రంగానే వేధిస్తాయి.

*** నోటితో మొదలు..
పొగ తాకిడికి ముందుగా గురయ్యేది నోరే. సిగరెట్‌ పొగలోని విషతుల్యాలు నాలుక మీది రుచిమొగ్గలపై, లాలాజలంపై విపరీత ప్రభావం చూపుతాయి. మన నోటి ఆరోగ్యానికి లాలాజలం అత్యవసరం. ఇది నోటిని తడిగా ఉంచటంతో పాటు జిగురుపొరలను కాపాడటం, దంతాల్లో ఖనిజ లవణాలను భర్తీ చేయటం, జీర్ణక్రియకు తోడ్పడటం వంటి పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. ఇందులో సోడియం, పొటాషియం వంటి ఎలెక్ట్రోలైట్లు.. రకరకాల పెప్టైడ్లు, గ్లైకోప్రోటీన్లు, సూక్ష్మక్రిములను అడ్డుకునే గుణం గల కొవ్వుల వంటివెన్నో ఉంటాయి. అందువల్ల నిరంతరం లాలాజలం ఊరుతుంటే నోరు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. అయితే సిగరెట్‌ పొగ మూలంగా.. ముఖ్యంగా దీర్ఘకాలంగా పొగ తాగే అలవాటు గలవారిలో లాలాజల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీంతో నోరు ఎండిపోవటం, పళ్లు పుచ్చిపోవటం, రంగు మారటం, పళ్లు కదలిపోవటం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు.. పొగ మూలంగా నాలుక మీది రుచిమొగ్గలు నున్నగానూ అవుతాయి. వీటికి రక్తప్రసరణా తగ్గుతుంది. దీంతో పదార్థాల రుచి సరిగా తెలియకుండా పోతుంది. దీంతో ఉప్పు, చక్కెర వంటివి ఎక్కువెక్కువగా తినేస్తుంటారు. ఉప్పు, తీపి పదార్థాలు ఎక్కువగా తింటే అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది.

*** ఛాతీలో మంట
మనం తిన్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది కదా. మన జీర్ణాశయానికీ అన్నవాహికకూ మధ్య బిగుతైన కండర వలయం (స్ఫింక్టర్‌) ఉంటుంది. ఇది జీర్ణాశయంలోకి ముద్ద చేరుకునేటప్పుడు తెరచుకొని, ముద్ద లోపలికి చేరగానే గట్టిగా మూసుకుపోతుంది. ఇలా జీర్ణాశయంలోని ఆహార పదార్థాలు, ఆమ్లాలు పైకి ఎగదన్నుకొని రాకుండా చూస్తుంది. అయితే పొగ సరిగ్గా ఈ ప్రక్రియ మీదే గురిచూసి దెబ్బకొడుతుంది. పొగ మూలంగా కండర వలయ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో అది సరిగా మూసుకుపోక జీర్ణాశయంలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకొని రావటం ఆరంభిస్తాయి. ఇది పులి తేన్పులకు, ఛాతీలో మంటకు దారితీస్తుంది. లాలాజలం ఉత్పత్తి తగ్గటం కూడా వీటిని మరింత ప్రేరేపిస్తుంది. ఎందుకంటే లాలాజలంలోని బైకార్బోనేట్‌ జీర్ణాశయ ఆమ్లాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అన్నవాహిక దెబ్బతినకుండా కాపాడుతుంది. కానీ పొగ తాగటం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి సమస్యలు మరింత ఎక్కువవుతాయి. పైగా జీర్ణాశయం మాదిరిగా ఆమ్లాలను తట్టుకునే వ్యవస్థ లేకపోవటం వల్ల అన్నవాహిక గోడలు కూడా దెబ్బతింటాయి. ఇలా దీర్ఘకాలం కొనసాగితే అన్నవాహికలో పుండ్లు పడొచ్చు. అన్నవాహిక మార్గం సన్నబడి ముద్ద మింగటం కష్టం కావొచ్చు. ఇక అన్నవాహికలోని కణాల్లో మార్పులు తలెత్తితే క్యాన్సర్‌కూ దారితీయొచ్చు.

*** జీర్ణాశయంలో పుండ్లు
నిజానికి జీర్ణాశయంలో పుండ్లకు (అల్సర్లు) ప్రధాన కారణాలు హెచ్‌.పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, నొప్పి మందులు అతిగా వాడటం. కానీ పొగ అలవాటుతోనూ అల్సర్ల ముప్పు పెరుగుతుంది. పొగ మూలంగా జీర్ణాశయంలో జిగురుపొరల్లోని రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా హెచ్‌.పైలోరీ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశం పెరుగుతుంది. ఇది అల్సర్లకు దారితీస్తుంది. అంతేకాదు.. అప్పటికే ఏవైనా పుండ్లు ఉంటే అవి మానిపోయే ప్రక్రియను పొగ అలవాటు నెమ్మదింపజేస్తున్నట్టూ, ఒకసారి మానిపోయినా తిరిగి పుండ్లు తలెత్తేలా చేస్తున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. మనం తిన్న ఆహారంలోని మాంసకృత్తులు జీర్ణం కావటానికి తోడ్పడే పెప్సిన్‌ లాంటి ఎంజైమ్‌లు కొన్నిసార్లు జీర్ణాశయం గోడలనూ దెబ్బతీసే అవకాశముంది. పొగ ఇలాంటి ఎంజైమ్‌లను మరింత ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. జీర్ణాశయం గోడలను కాపాడే జిగురుద్రవం ఉత్పత్తినీ, జీర్ణాశయానికి రక్త సరఫరానూ తగ్గిస్తుంది. అంటే జీర్ణాశయానికి హాని చేసేవి ఎక్కువగా, జీర్ణాశయాన్ని కాపాడేవి తక్కువగా ఉత్పత్తి కావటంలో పొగ పాలు పంచుకుంటుందన్నమాట. ఇలా ఇది రెండు రకాలుగా జీర్ణాశయానికి ముప్పు తెచ్చిపెడుతోంది.

*** కాలేయ జబ్బు
కాలేయాన్ని పొగ నేరుగా ఏమీ తాకదు. అయినా కూడా విపరీత ప్రభావమే చూపుతుంది. మన జీర్ణవ్యవస్థలో అన్నింటికన్నా పెద్ద అవయవం కాలేయమే. ఇది ముఖ్యమైన రక్త ప్రోటీన్లు, పైత్యరసం తయారుచేయటంతో పాటు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చటం.. మద్యం, విషతుల్యాల వంటి వాటిని విడగొట్టటం వరకూ రకరకాల పనుల్లో పాలు పంచుకుంటుంది. అయితే పొగ తాగటం వల్ల కాలేయం సామర్థ్యం తగ్గుతోందని.. దీని మూలంగా కాలేయం నిర్వహించే పనులన్నీ మందగిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇది కాలేయంలోని సూక్ష్మ పైత్యనాళాలు నెమ్మదిగా దెబ్బతినేలా చేస్తుంది కూడా. దీంతో పైత్యరసం బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతుంది. పొగ మూలంగా కాలేయానికి కొవ్వు పడుతుంది (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) కూడా. ఇలాంటి సమస్యలు క్రమంగా కాలేయం గట్టిపడటానికి (సిరోసిస్‌) దారితీస్తాయి. పొగ మూలంగా నేరుగా కాలేయ క్యాన్సర్‌ రాకపోవచ్చు గానీ దీర్ఘకాలంగా హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారికి మాత్రం పెద్ద ముప్పునే తెచ్చిపెడతాయి. సిగరెట్లలోని క్యాన్సర్‌ కారకాలు కాలేయ కణాలను మరింత దెబ్బతినేలా చేస్తాయి. అప్పటికే క్యాన్సర్‌ ముప్పు గలవారికిది మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది. వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే ఇంటర్‌ల్యూకిన్‌-1, ఇంటర్‌ల్యూకిన్‌-6, టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా వంటి సైటోకైన్లను పొగ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. ఇవి కాలేయ కణాలను దెబ్బతీసి రకరకాల సమస్యలకు దారితీస్తాయి.

*** క్లోమగ్రంథి వాపు
దీర్ఘకాలంగా పొగ తాగటం వల్ల క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) సామర్థ్యం తగ్గే ప్రమాదముంది. దీంతో రక్తంలో గ్లూకోజును నియంత్రించే ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. అంటే పొగ తాగటం మూలంగా మధుమేహం వచ్చే అవకాశమూ పెరుగుతుందన్నమాట. అంతేకాదు క్లోమగ్రంథి వాపు (పాంక్రియాటైటిస్‌) ముప్పూ ఎక్కువవుతుంది. సాధారణంగా క్లోమం నుంచి పుట్టుకొచ్చే ఎంజైమ్‌లు పేగుల్లోకి చేరుకున్న తర్వాతే ఉత్తేజితమవుతాయి. అయితే క్లోమగ్రంథి వాపు తలెత్తినపుడు ఎంజైమ్‌లు బయటకు రాకుండా లోపలే ఉండిపోతాయి. ఇవి క్రమంగా క్లోమగ్రంథి కణజాలం మీదే దాడిచేస్తాయి. దీంతో పాంక్రియాస్‌ దెబ్బతింటుంది. క్లోమంలో ఎంజైమ్‌లను పర్యవేక్షించే అసినార్‌ కణాల పనితీరును పొగలోని నికొటిన్‌ అస్తవ్యస్తం చేస్తుండటం దీనికి కారణం కావొచ్చని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పొగ అలవాటుకు మద్యం కూడా తోడైతే దీని ముప్పు మరింత ఎక్కువ అవుతుండటం గమనార్హం.

*** పిత్తాశయంలో రాళ్లు
మనం తినే ఆహారంలోని కొవ్వులు జీర్ణం కావటానికి పైత్యరసం చాలా అవసరం. ఇది కాలేయంలో ఉత్పత్తి అయ్యి పిత్తాశయంలోకి వచ్చి నిల్వ ఉంటుంది. అయితే పొగ తాగటం వల్ల కొందరికి ఈ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. పిత్తాశయంలో రాళ్లకు రకరకాల అంశాలు దోహదం చేస్తున్నప్పటికీ.. పొగ తాగేవారికి వీటి ముప్పు 19% ఎక్కువగా ఉంటోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇతరత్రా కారణాలను పక్కనపెట్టి చూసినా ఈ ముప్పు కనబడుతోందని వివరిస్తున్నాయి. అలాగే ఎంత ఎక్కువ సిగరెట్లు తాగితే రాళ్ల ముప్పు అంత ఎక్కువ అవుతోంది కూడా. పొగ తాగటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుండటం దీనికి ఒక కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు, పొగ తాగేవారి రక్తంలో మంచి కొవ్వు (హెచ్‌డీఎల్‌) మోతాదులు తగ్గుతాయి. ఇలా హెచ్‌డీఎల్‌ కొవ్వు తగ్గటం మూలంగానూ పిత్తాశయంలో రాళ్ల ముప్పు పెరిగే అవకాశముంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నా చాలామందికి పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. కానీ కొందరికి పిత్తాశయంలో ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. రాళ్లు పైత్యరస నాళంలోకి జారి ఇరుక్కోవచ్చు. క్లోమగ్రంథికి అడ్డుపడి తీవ్రంగానూ పరిణమించొచ్చు. కాబట్టి తేలికగా తీసుకోవటానికి లేదు.

*** పేగు పూత, వాపు
పొగ ప్రభావం పేగులను కూడా వదిలిపెట్టటం లేదు. పేగుల్లో పూత, వాపు, పుండ్ల సమస్య (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌).. ముఖ్యంగా క్రోన్స్‌ జబ్బు ముప్పు పెరిగేలా చేస్తుంది. క్రోన్స్‌ సమస్య చాలావరకు చిన్నపేగుల్లో తలెత్తే సమస్యే గానీ ఇది జీర్ణకోశంలో ఎక్కడైనా రావొచ్చు. దీని బారినపడ్డవారిలో కడుపుబ్బరం, కడుపునొప్పి, విరేచనాల వంటివి తెగ వేధిస్తుంటాయి. కొందరిలో పేగు గోడల కణజాలం ఉబ్బిపోయి అడ్డంకులూ తలెత్తొచ్చు. పుండ్లు పడొచ్చు. కొన్నిసార్లు పేగుల నుంచి ఇతర అవయవాలకు మార్గాలూ ఏర్పడొచ్చు. పొగ తాగేవారికి క్రోన్స్‌ ముప్పు పెరగటమే కాదు, క్రోన్స్‌తో బాధపడేవారు పొగ తాగితే దీని లక్షణాలు మరింత తీవ్రంగానూ, తరచుగానూ వేధిస్తుండటం గమనార్హం. ఫలితంగా మరింత ఎక్కువ మోతాదులో మందులు వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చు కూడా. శస్త్రచికిత్స తర్వాత కూడా లక్షణాలు వేధించే ప్రమాదమూ లేకపోలేదు. పేగుల్లోని రక్షణ వ్యవస్థను, రక్త సరఫరాను పొగ అస్తవ్యస్తం చేస్తుండటం దీనికి మూలం కావొచ్చన్నది పరిశోధకుల భావన. వంశపారంపర్యంగా క్రోన్స్‌ రావటానికి దారితీసే జన్యువుల పనితీరునూ పొగ అలవాటు మార్చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పొగ మూలంగా పెద్ద పేగులో బుడిపెలు (పాలిప్స్‌) తలెత్తే ముప్పూ పెరుగుతుంది. పైగా పొగ అలవాటు గలవారిలో బుడిపెలు మరింత ఎక్కువగానూ, పెద్దగానూ ఉంటాయి. బుడిపెలు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశమూ ఉంది. ఇవి పెద్దపేగు క్యాన్సర్‌కు ముందస్తు సూచికలని గుర్తించటం అవసరం.

పొగ అలవాటు ఒకపట్టాన వదిలేది కాకపోవచ్చు. కానీ మనసుంటే మార్గం దొరక్కపోదు. సిగరెట్‌ తాగాలని మనసు ఎంత తహతహలాడుతున్నా కాసేపు దాని జోలికి వెళ్లకుండా నిగ్రహించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. సిగరెట్‌ తాగినా, తాగకపోయినా 5-10 నిమిషాల్లో ఆ కోరిక తగ్గుముఖం పడుతుందని గుర్తించాలి. కాబట్టి మనసులో గట్టిగా సంకల్పించుకుంటే చిన్న చిన్న ప్రయత్నాలతోనే పొగ అలవాటును మానుకోవచ్చు.
* కొందరు కొన్ని చోట్ల తరచుగా సిగరెట్లు కాలుస్తుంటారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లగానే అప్రయత్నంగానే సిగరెట్‌ ముట్టించాలనే కోరిక పుట్టుకొస్తుంది. కాబట్టి అలాంటి ప్రదేశాలకు, పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది.
* వాయిదా పద్ధతి మేలు. సిగరెట్‌ తాగాలని అనిపించినపుడు ఇతరత్రా పనుల మీదికి మనసును మళ్లించొచ్చు. పది మంది ఉన్నచోటుకో, సిగరెట్‌ కాల్చటాన్ని నిషేధించిన చోటుకో వెళ్లొచ్చు. దీంతో నిగ్రహం పెరుగుతుంది.
* చక్కెర లేని చాక్లెట్లు, బిళ్లల వంటివి చప్పరించటం ద్వారా పొగ యావను తగ్గించుకోవచ్చు. కావాలంటే క్యారెట్‌ ముక్కలు, బాదం వంటి గింజపప్పులు నోట్లో వేసుకోవచ్చు.
* పొగరాయుళ్లు చేసే పెద్ద పొరపాటు ‘ఈ ఒక్కటి కాల్చి ఆపేస్తా’ అని సర్దిచెప్పుకోవటం. ఇలా తమను తాము వంచించుకోవటం ఎంతమాత్రమూ తగదు.
* శారీరక శ్రమతో సిగరెట్‌ తాగాలనే కోరిక తగ్గుతుంది. అందువల్ల సిగరెట్‌ తాగాలని అనిపించినపుడు కాసేపు అటూఇటూ నడవటమో, మెట్లు ఎక్కటమో చేయటం మంచిది.
* ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలామంది సిగరెట్లు ముట్టిస్తుంటారు. కాబట్టి గట్టిగా శ్వాస తీసుకోవటం., ధ్యానం వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది.
* పొగ అలవాటును మానెయ్యటం వల్ల ఒనగూడే ప్రయోజనాలను తరచుగా కాగితం మీద రాయటమో, గట్టిగా చెప్పటమో సాధన చేసినా మంచి ఫలితం కనబడుతుంది.
* మానటం మరీ కష్టంగా ఉంటే నికొటిన్‌తో కూడిన బిళ్లలు చప్పరించొచ్చు. చర్మానికి అతికించుకునే నికొటిన్‌ పట్టీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి పొగ తాగాలనే కోరికను చాలావరకు కట్టడి చేస్తాయి.