Sports

రేపటి నుండి ఐసీసీ క్రికెట్ సమరం

England vs South Africa Match To Open ICC CWC 2019

క్రికెట్‌ ప్రేమికుల పండగకు వేళైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. మైదానంలో అసలు పోరు మొదలయ్యేదీ రేపటినుంచే. కానీ, అంతకంటే ముందే విశ్వకప్‌ సంబరాలు మొదలవనున్నాయి. 12వ ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకలు బుధవారమే జరగనున్నాయి. సెంట్రల్‌ లండన్‌లోని ప్రఖ్యాత వెస్ట్‌మినిస్టర్‌ సిటీ రోడ్‌లోని ది మాల్‌ వేదికగా ఈ ఈవెంట్‌ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రారంభోత్సవ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సంగీతం, క్రీడల కలబోతగా సాగే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్షంగా నాలుగువేల మంది వీక్షించనున్నారు. ఈ వేడుకలు పలు చానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్నాయి. గురువారం ఆతిథ్య ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌ సమరం మొదలవనుంది.