Sports

కోహ్లీకు ఎసరు పెట్టనున్న ఆమ్లా

Amla on the chase to break Kohlis records

ప్రపంచకప్‌ 2019కి మరికొద్ది గంటలే సమయముంది. ఓవల్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తలపడనుంది. నేటితో ప్రారంభమయ్యే 12వ వన్డే ప్రపంచకప్‌ జులై 14న ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ముగుస్తుంది. దీంతో ఎవరెవరు ఎలా ఆడతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంగ్లాండే ఫేవరెట్‌గా ఉన్నా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లనూ తక్కువ చెయ్యలేని పరిస్థితి. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీకి చెందిన ఓ రికార్డుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ఆమ్లా చేరువలో ఉన్నాడు. ఈరోజు ఇంగ్లాండ్‌తో జరగబోయే 2019 ప్రపంచకప్‌ తొలి వన్డేలో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. అంతకుముందు కోహ్లీ 175 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు పూర్తి చేశాడు. అయితే వన్డేల్లో 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులను ఆమ్లానే వేగంగా చేరుకున్నాడు. మరో విశేషం ఏంటంటే.. దక్షిణాఫ్రికా తరఫున 8వేల పరుగులు పూర్తిచేసిన నాలుగో ఆటగాడిగానూ అతడు నిలుస్తాడు. అంతకుముందు కలీస్‌(11550), డివిలియర్స్‌ (9427), హార్ష్‌లేగిబ్స్‌(8094) ఆమ్లాకన్నా ముందున్నారు. ఒకవేల ఇవాళ 37 పరుగులు చేస్తే మాత్రం ఇంగ్లాండ్‌పై వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన రెండో దక్షిణాఫ్రికా ఆటగాడిగా మారతాడు. కలీస్‌ ఇదివరకే (1054) పరుగులు చేశాడు. అయితే ఈ గణంకాలు చూడ్డానికి తేలికగానే అనిపిస్తున్నా ప్రస్తుతం ఆమ్లా అంత ఫామ్‌లో లేడు. 2018 నుంచి అతడు తనస్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చెయ్యలేకపోతున్నాడు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. టాప్‌ఆర్డర్‌ పైనే ఆశలు పెట్టుకున్న ఆ జట్టు ఆమ్లా ఫామ్‌లోకి రాకపోతే ఇబ్బంది పడాల్సిందే. 36 ఏళ్ల ఆమ్లాకి బహుశా ఇదే ఆఖరి ప్రపంచకప్‌ కావచ్చు.