WorldWonders

చైనా వద్ద భారీగా అరుదైన ఖనిజ నిక్షేపాలు

If China closes doors to ther rare mineral repositories

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ఘోరంగా తయారు కానుంది. అమెరికాకు సరఫరా చేసే అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో కోత విధించాలంటూ చైనా పత్రిక పీపుల్స్‌ డైలీ ఒక కథనం ప్రచురించింది. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రం చేసి చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్న క్రమంలో అమెరికా ఆయుధ తయారీ రంగానికి షాక్‌ ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అమెరికా సాంకేతిక రంగ సంస్థలకు పరికరాలు, టెక్నాలజీ అందకుండా అమెరికాకు బుద్ధి చెప్పేలా చైనా వద్ద చాలా ఉపాయాలున్నాయని పేర్కొంది. గత కొన్నేళ్లుగా చైనా అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ఈ దేశంలో పర్యావరణ పరిరక్షణ వంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ మైనింగ్‌ పెరిగిపోయింది. ఫలితంగా 2014, 2017లో ప్రపంచంలో ఉత్పత్తి అయిన అరుదైన ఖనిజాల్లో చైనా నుంచి వచ్చిన వాటా 80శాతానికి పైమాటే. ఈ దేశం నుంచి ఏటా 160 మిలియన్‌ డాలర్ల విలువైన ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. వీటిల్లో చాలా ఖనిజాలను ఆయుధాల తయారీకి వినియోగిస్తారు. దీంతో వీటిపై ఆంక్షలు తొలుత రక్షణ రంగాన్ని ప్రభావితం చేయనున్నాయి. 17రకాల మూలకాలు ఉన్న గ్రూపును రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ అంటారు. అరుదైన అయస్కాంత, ఎలక్ట్రో కెమికల్‌ లక్షణాలు బట్టి వీటిని గుర్తిస్తారు. గడోలినియం, లాంథోనియం, సిరియం, ప్రోమెథియం వంటివి ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న నిల్వల్లో అత్యధికంగా 37 శాతం చైనా వద్ద ఉన్నాయి. రక్షణ రంగంలో ఇవి అత్యంత కీలకమైనవని అమెరికా జియోలాజికల్‌ సర్వే ధ్రువీకరించింది. ఇవి చాలాచోట్ల స్వల్పమొత్తాల్లో దొరుకుతాయి కానీ, చాలా తక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇవి ఎక్కువ మొత్తంలో దొరికే గనులు అత్యంత అరుదుగా ఉన్నాయి. వైద్య చికిత్సల్లో సర్జికల్‌ బ్లేడ్లు, పేస్‌ మేకర్లు, కేన్సర్‌ చికిత్స ఔషధాల్లో, టెలిస్కోప్‌ కటకాల్లో, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లలో, ఆటో ఎగ్జాస్ట్‌ వ్యవస్థల్లో ఉత్ప్రేరకాలుగా వాడతారు. నియోడియం అనే ఖనిజాన్ని ఇన్ప్రారెడ్‌ లేజర్ల తయారీలో వినియోగిస్తారు. క్షిపణుల సెన్సర్లలో వాడతారు. అమెరికా దిగ్గజ సంస్థ ఆపిల్‌ తన ఫోన్లలో వినియోగించే కెమేరాల్లో వీటిని వాడుతుంది. కార్లలో వాడే రీఛార్జబుల్‌ బ్యాటరీల్లో కూడా వీటిని వినియోగిస్తారు. ఈ మూలకాలను రీసైక్లింగ్‌ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అమెరికా ఎఫ్‌-35 విమానంలోని గైడెడ్‌ క్షిపణల తయారీలో వీటిని వినియోగిస్తారు. దీంతో పాటు ఒక్కో విమానంలో ఇటువంటి అరుదైన ఖనిజాలను 920 పౌండ్ల వరకు వాడతారు. యట్టీరియం, టెర్బియంలు లేజర్‌ గైడెడ్‌ ఆయుధాల తయారీకి వినియోగిస్తారు. 2010లో చైనా-జపాన్‌ల మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకొన్నాయి. దీంతో చైనా ఈ అరుదైన ఖనిజాలను జపాన్‌కు ఎగుమతి చేయడం ఆపేసింది. అదే సమయంలో ఈ ఖనిజాల నిల్వలను మలేసియా, బ్రెజిల్‌, ఏస్తోనియా, ఆస్ట్రేలియ, భారత్‌, దక్షిణాఫ్రికా, కెనడాల్లో కనుగొన్నారు. అమెరికా కూడా కాలిఫోర్నియాలో ఈ రకం ఖనిజాల గనులను కనుగొంది. కాకపోతే ఇక్కడ ఉత్పతి చేసిన ముడిఖనిజాన్ని ప్రాసెసింగ్‌ కోసం చైనాకే తరలిస్తుంది.