Politics

బ్రహ్మాండంగా జగన్ ప్రమాణస్వీకారం

YS Jaganmohan Reddy Takes Oath As Chief Minister Of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం – ముఖ్యాంశాలు:

– వైయస్‌ జగన్‌ అనే నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్నాను.
– 3648 కి.మీ ఈ నేల మీద నడిచినందుకు, గత 9 ఏళ్లుగా మీలో ఒకరిగా నిల్చినందుకు.. ఆకాశమంత విజయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
– వేదిక మీద ఉన్న పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారికి, పక్కన తమిళనాడులో రేపు సీఎంగా ప్రమాణం చేయాలని ఆకాంక్షిస్తూ స్టాలిన్‌ గారికి..
– ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరునా నమస్సుమాంజలి.
– 10 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3648 కి.మీ పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను.
– పేదలు, మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు చూశాను. వాటిని విన్నాను. అవన్నీ చూశాక, ఈ వేదికపై నుంచి మీ అందరికీ ఒక సీఎంగా మాట ఇస్తున్నాను.
– మీ కష్టాలు విన్నాను. బాధలు చూశాను. నేను ఉన్నాను.
– అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ, మేనిఫెస్టో కేవలం రెండు పేజీలతో ప్రజలకు ఎప్పుడు గుర్తుండే విధంగా తీసుకువచ్చాము.
– గత పాలకుల మాదిరిగా పేజీలకొద్ది మేనిఫెస్టో తీసుకురాలేదు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టలేదు. ఎన్నికల తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే విధంగా పుస్తకం తేలేదు.
– మేనిఫెస్టో అంటే, ఎన్నికైన తర్వాత ఏం చేస్తామన్నది ప్రజలకు అనుక్షణం గుర్తుండాలి, అందుకే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో ప్రకటించాను.
– మీ అందరి కళ్ల ముందు పెట్టాను. అందులో ప్రతి అంశాన్ని అమలు చేస్తాను. మేనిఫెస్టో ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీత.
– మేనిఫెస్టోలోని అంశాలు ఒక ఊపిరిగా ఈ 5 ఏళ్లు పని చేస్తాను.
– మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలలో ఇవాళ ఒకటి నేను ఇక్కడ వివరిస్తాను.
– అవ్వా తాతలకు ఇస్తున్న పెన్షన్‌ మరో రూ.250 పెంచుతూ తొలి సంతకం పెడుతున్నాను.
– ఈ జూన్‌ నుంచే అవ్వా తాతల పెన్షన్‌ పెరుగుతుంది. వారికి రూ.2250 వైయస్సార్‌ పెన్షన్‌ వస్తుంది.
– వచ్చే ఏడాది రూ.2500, ఆ తర్వాత ఏడాది రూ.2750, ఆ తర్వాత ఏడాది రూ.3 వేల పెన్షన్‌ ఇస్తాము. ఆ విధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను.
– నవరత్నాలులో చెప్పిన ప్రతి అంశం.. ప్రతి ఒక్కరు, ప్రతి పేదకు అందాలి. కులం, మతం, రాజకీయం, పార్టీలకు అతీతంగా అవి అందరికీ అందాలి.
– అందుకోసం వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రావాలి.
– ఆ ప్రక్రియలో ఆగస్టు 15 నాటికి.. అన్ని గ్రామాల్లో 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము.
– ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేస్తాము. లంచాలు లేని పరిపాలన దిశలో అడుగులు వేస్తూ.. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాము.
– సేవా దృక్పథం ఉన్న యువతను ఎంపిక చేసుకుని వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాము.
– ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా అందకపోయినా, లంచాలు చోటు చేసుకున్నా వెంటనే ఫిర్యాదు చేయడానికి ఆగస్టు 15 నాటికి సీఎం ఆఫీసులో ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాము.
– పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాము. ఆ విధంగా ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తాము.
– ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయి. ఆ విధంగా 1.60 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
– ప్రజలకు ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తే, 72 గంటల్లో మంజూరు చేస్తాము.
– ఇవాళ గ్రామాల్లో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. అందుకే వ్యవస్థలో మార్పు చేస్తున్నాము.
– ఏపీ సీఎంగా 6 కోట్ల మంది ప్రజలకు ఈ వేదిక నుంచి మరో హామీ ఇస్తున్నాను.
– అవినీతి, వివక్ష, లంచాలకు తావు లేకుండా పాలనలో ప్రక్షాళన చేస్తాను. పై నుంచి కింది స్థాయి వరకు అన్ని మార్పులు చేస్తాను.
– ఎక్కడ, ఏయే పనుల్లో, కాంట్రాక్ట్‌ పనుల్లో అవినీతి జరిగిందో.. వాటన్నింటిని రద్దు చేస్తాను.
– ఆ తర్వాత నిబంధనలు మారుస్తూ.. ఎక్కువ మంది బిడ్‌ వేసేలా.. రివర్స్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ అమలు చేస్తాము. వాటికి సంబంధించి అన్ని వివరాలను మీ ముందు పెడతాను.
– రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎక్కువ మంది బిడ్‌ వేసేలా చేస్తూ.. ఆ విధంగా చేయడం వల్ల ఎంత మిగిలింది? ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది? అన్నది పూర్తిగా ప్రజల ముందుంచుతాను.
– ఇవాళ రాష్ట్రంలో అవినీతి విశృంఖలంగా పెరిగింది.
ఉదా: కరెంటు కొనుగోలు. సోలార్‌ పవర్, విండ్‌ పవర్‌ను ఇతర రాష్ట్రాలలో యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.65, రూ.3 కు కొంటుంటే, ఈ ప్రభుత్వం విండ్‌ పవర్‌ యూనిట్‌కు రూ.4.84 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇంకా పీక్‌ అవర్‌లో యూనిట్‌ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
– వాటన్నింటినీ మీ ముందు పెట్టి, ఆ ఛార్జీలను తగ్గిస్తాను.
– వ్యవస్థలో పారదర్శకత తెస్తాము. ప్రక్షాళన చేస్తాము. కాంట్రాక్ట్‌ విధానంలో పూర్తి మార్పు చేస్తాము.
– ప్రత్యేకంగా జ్యూడీషియన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తాము. ప్రతి టెండర్‌ను ఆ కమిషన్‌ ముందుంచుతాము. కమిషన్‌ అనుమతి ఇచ్చాకే కాంట్రాక్ట్‌ల కోసం టెండర్లు పిలుస్తాము.
– ఇవాళ ఇక్కడ మీడియా పక్షపాత ధోరణితో పని చేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వాళ్లకు చంద్రబాబు మాత్రమే సీఎంగా కనిపిస్తారు.
– చంద్రబాబు ఏం చేసినా మంచే కనిపిస్తుంది. ఇతరులు సీఎంగా ఉంటే, ఎలా
దింపాలని చూస్తారు. వారికి ఇవాళ ఒకటే చెబుతున్నారు.
– టెండర్ల ప్రక్రియను, వాటిలో మార్పులను వారికి కూడా చూపుతాము. అయినా వాటిని వక్రీకరిస్తే, పరువు నష్టం దావా వేస్తాము.
– 6 నెలల నుంచి ఏడాది సమయం ఇవ్వండి. వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని మాట ఇస్తున్నాను.
– పై నుంచి కింది స్థాయి వరకు ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేస్తాను.
– ప్రజలు దేనికీ దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ అందిస్తాము.
– కులం, మతం, రాజకీయం, ప్రాంతం, పార్టీ, వర్గం.. ఏదీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ అందిస్తానని హామీ ఇస్తున్నాను.