WorldWonders

పంపు వద్ద స్నానం…ప్రజాసేవకే అంకితం

The inspiring life story of humble Central Cabinet Minister Pratap Chandra Sarangi

మండల స్థాయి ప్రజా ప్రతినిధులే ఖరీదైన కారుల్లో తిరిగే ఈ రోజుల్లో.. కేంద్ర మంత్రి సైకిల్‌ మీద తిరుగుతున్నారంటే నమ్మగలరా! ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు పెద్ద పెద్ద భవంతుల్లో నివసించే ప్రస్తుత కాలంలో..ఆయన నివాసం పైకప్పు కూడా సరిగా లేని పూడి గుడిసె అని చెబితే ఆశ్యర్యంగా ఉందా! మామూలుగా ప్రజా ప్రతినిధులంటే ఎంత వైభోగం, మరెంత వైభవం.. వాహన శ్రేణి, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ, చిటికేసి పిలిస్తే ముందుకు వచ్చే వ్యక్తిగత సహాయకులు, ఇంటి నిండా పనివాళ్లు..కానీ ఈయనకు వద్ద అవేవీ కనిపించవు. ఉన్న ఒక్కగానొక్క సైకిల్‌ ఈయనకు ఐరావతం. ఆయన చుట్టూ ఉండే పిల్లలు ఈయనకు జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కంటే ఎక్కువ. వెదురు కర్రలతో నిర్మించుకున్న ఇల్లే ఇంద్రభవనం. అందులో ఉండే ఒక్కగానొక్క లాంతరు ఎల్‌ఈడీ లైట్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఇక ఈయన స్నానపానాలు చేసేది చేతి పంపు వద్ద.. సంధ్యా సమయం అయితే నదుల్లో..ఇదీ ఆయన జీవన శైలి. ప్రధాని మోదీ సర్కారులో స్థానం సంపాదించి అతి సామాన్య జీవితం గడుపుతున్న ప్రతాప్‌ చంద్ర సారంగి గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు. ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన సారంగిని అందరూ ఒడిశా మోదీ అని పిలుస్తుంటారు. స్వతహాగా సామాజిక కార్యకర్త అయిన సారంగి భాజపాలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో బాలాసోర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి బిజు జనతా దళ్‌ అభ్యర్థి రబీంద్ర కుమార్‌ జేనపై 12,956 ఓట్ల తేడాతో గెలుపొందారు. నిరాడంబరత, అత్యంత సాధారణ జీవన శైలితో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించిన సారంగి..సూక్ష్మ, మధ్య పరిశ్రమల శాఖతో పాటు పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సారంగి అంటే ప్రత్యేకాభిమానం. ఒడిశాకి ఎప్పుడు వచ్చినా ఆయనని కలవకుండా వెళ్లరు. సారంగి బ్రహ్రచారి. ఈయన తల్లి అనారోగ్యం కారణంగా గతేడాది మరణించారు. ప్రభుత్వం ఇచ్చే వేతనం, ఇతర అభివృద్ధి నిధులన్నీ గిరిజన ప్రాంతాల్లోని మారుమూల పల్లెల రోడ్ల నిర్మాణానికి, నిరుపేదల పిల్లల చదువులకు వినియోగిస్తారు. కొంత భాగం స్వచ్ఛంద సంస్థలకు కేటాయిస్తారు. ఆయన నివసించే ప్రదేశంలో ఎవరేది పెట్టినా తింటారు. ఇంటి ముందు ఉన్న నవారు మంచంలోనే నిద్ర పోతారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడం వంటి అలవాట్లు లేవు. చెట్టే హోటల్‌ గది. నేల తల్లే పట్టు పాన్పు. నిజాయతీగా ఉండే వాళ్లు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారనడానికి నిలువెత్తు నిదర్శనం సారంగి. ఎప్పుడు చూసినా తెల్లటి పైజామా, ప్యాంటు, భుజానికి ఓ సంచీ, కాళ్లకు తోలు చెప్పులు, గుబురు గడ్డంతో కనిపిస్తారు. సైకిల్‌పై తిరుగుతూ ప్రజలతో మమేకం కావడం, పిల్లలతో ఆడుకోవడం ఈయన వ్యాపకం. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేతిలో ఎంతో కొంత డబ్బు ఉండాలి. ఇక ఎంపీగా పోటీ చేయాలన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అధికారికంగా కాకపోయినా అనధికారికంగానైనా రూ. కోట్లు ఖర్చు పెట్టాలి. కార్యకర్తలకు సౌకర్యాలు, ప్రచార వాహనాలు, ఇలా ఎన్నో ఖర్చులు ఉండనే ఉంటాయి. కానీ ఈయన వీటి జోలికి పోలేదు. తాను నమ్మిన జనాన్ని నిజాయతీగా ఓట్లేయమని అడిగారు. ప్రచారానికి ఏసీ బస్సులు, అన్ని సౌకర్యాలున్న వాహనాలు ఉపయోగించలేదు. కొంత దూరం సైకిల్‌ మీద తిరిగి ప్రచారం చేశారు. దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఆటోలో వెళ్లి ప్రచారం చేశారు. ఈ నిరాడంబరతనే బాలాసోర్‌ ప్రజలు మెచ్చారు. గతంలో ఓడిపోయినప్పటికీ ఈసారి మాత్రం సారంగికే పట్టం కట్టారు. ఏదేమయినప్పటికీ మంత్రులంటే విపరీతమైన హంగులతో, విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈరోజుల్లో ఇలాంటి కేంద్ర మంత్రి ఉండటం నిజంగా మెచ్చుకోదగిన అంశమే.