Kids

ఆ బడిలో మార్కులు పుస్తకాలు ఉండవు

The story of a school with no books or grades

మార్కులు… తరగతులు… పుస్తకాలు.. లేని వింత బడి అది! మొక్కుబడిగా ఏ పనీ జరగదా బడిలో… కొబయాషీ అనే మాస్టారు పాత రైలు బోగీలో ప్రారంభించిన రైలుబడి గురించి ఆ బడిలో చదువుకున్న టొటొచాన్‌ అనే అమ్మాయి రాసిన పుస్తకమే ఇది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి బడిలోనూ ఉండాల్సిన ఈ పుస్తకం గురించి… ఆ చిన్నారి తన ఎదురుగా ఉన్న హెడ్‌మాస్టారితో మాట్లాడుతూనే ఉంది. గంట… రెండు గంటలు… మూడు గంటలు.. ఐదు గంటలు!!! ఉదయం మొదలుపెట్టిన మాటల ప్రవాహానికి మధ్యాహ్నం భోజన సమయానికి కూడా అడ్డుకట్టపడలేదు. ఆ పిల్ల తల్లికి మాత్రం మనసులో ఒకటే ఆందోళన. ఈసారి కూడా ఏమవుతుందో అని. మాట్లాడి.. మాట్లాడి అలసిపోయిన ఆ పిల్ల ఐదుగంటల తర్వాత ఇక మాట్లాడ్డానికి నా దగ్గరేం లేవుగా అంది హెడ్‌మాస్టారితో అమాయకంగా. ఒక చిన్నారి మనసులో ఇన్ని ఊసులు ఉంటాయా! అని ఆశ్చర్యంతో ఉన్న ఆ మాస్టారు ముందు నుంచీ ఉన్న అదే చిరునవ్వుని ఏమాత్రం చెదిరిపోనీయకుండా ‘అవునా.. చిట్టితల్లీ. యూ..ఆర్‌ సెలెక్టెడ్‌’ అన్నాడు సంతోషంగా. తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. నిజానికదో స్కూల్‌ ఇంటర్వ్యూ. ఏ ప్రశ్నలు అడుగుతారో ఏమో.. తక్కిన స్కూళ్ల మాదిరిగానే ఇక్కడా తన కూతురు టొటొచాన్‌ని బయటకు పంపించేస్తారేమో అని భయపడిన ఆ తల్లికి ఆ స్కూల్‌ హెడ్‌మాస్టారు ససాకో కొబయాషి చెప్పిన మాట తీయగా, హాయిగా వినిపించింది. అంతేకాదు ఆయన తీరు కూడా చాలా చిత్రంగా అనిపించింది ఆమెకు. ఆయనే కాదు… ఆయన స్కూల్‌ కూడా. ఆమాటకొస్తే అదసలు స్కూలే కాదు. ఓ పాతరైలు బోగీ. పేరు టోమో. పరిసరాలు చెట్లతో పచ్చగా ఉన్నాయి. హమ్మయ్య అనుకుంది తల్లి. ఇక టొటొచాన్‌ సంగతి చెప్పనక్కర్లేదు. గతంలో తను చదివిన బడుల్లో అయితే బయటకు చూడకూడదు. పిట్టలతో మాట్లాడకూడదు. కిటికీలోంచి చూస్తూ ప్పీప్పీప్పీ.. డుండుండుం సన్నాయి వాళ్లతో మాట్లాడకూడదు లాంటి షరతులే ఉండేవి. ఇక్కడ అలాంటివి ఏం లేవు. ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. అదో చిత్రమైన బడి. అందుకే టొటొచాన్‌కి తెగనచ్చింది. ఒక్క టొటొచాన్‌కి మాత్రమే కాదు… ఆ బడిలో చదివిన ఏ పిల్లాడికైనా, పిల్లకయినా సరే.. స్కూల్‌ సెలవు అనే మాటే నచ్చదు. అంత ఇష్టం వాళ్లకి ఆ బడంటే. అలాంటి అందమైన బడి… చదివితే అలాంటి బడిలోనే చదవాలి అని పిల్లలు అందరూ అనుకునే ఆ కలలబడి రెండో ప్రపంచం యుద్ధం కారణంగా మూతబడి ఓ విషాద జ్ఞాపకంగానే మిగిలిపోయింది. కానీ.. చదువంటే మార్కులు మాత్రమే. చదువంటే నాలుగ్గోడల మధ్య చెప్పే పుస్తక పఠనం మాత్రమే అనే అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెరిపేసిన గొప్ప బడి అది. ఆ బడిలో చదువుకున్న టొటొచాన్‌ పెద్దయ్యాక తన అనుభవాలని రాసిన పుస్తకమే ఈ రైలుబడి. నింగికీ నేలకీ దూరంగా తరగతి గదిలో ఇరుక్కుని కూర్చుని పదికి పది మార్కులు తెచ్చుకోవడమే చదువు.. అనుకునే ఈ తరం తల్లిదండ్రులు, పిల్లలకు ఈ పుస్తకం ఓ గొప్ప కనువిప్పు. ఆడుతూపాడుతూ హాయిగా చదువుకోవడం ఎలానో కొబయాషి మాస్టారు చెబుతుంటే మనం కూడా బాల్యంలోకి వెళ్లిపోయి అలా చదువుకుంటే బాగుండును అని మనలో జ్ఞాపకాల వెన్నెల కురిపిస్తుందీ పుస్తకం. నువ్వు నిజంగా మంచి పిల్లవు తల్లీ అని మాస్టారు పదేపదే అనేమాట ఓ పెంకి, అల్లరి పిల్లని క్రమశిక్షణ కలిగిన అమ్మాయిగా ఎలా మలిచిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. అంతేకాదు పిల్లల్లో గూడు కట్టిన అనేక భయాలని ఈ పుస్తకం ఇట్టే తొలగిస్తుంది. రెండో ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాల దాడికి గురై సర్వస్వాన్నీ కోల్పోయిన నగరం నాగసాకి. అక్కడే పుట్టింది టెట్సుకో కురొయనాగి. బాల్యంలో ఆమె ముద్దుపేరు టొటొచాన్‌. ఆమే ఈ పుస్తక రచయిత్రి. పెంకి పిల్లగా … అల్లరి అమ్మాయిగా పేరుతెచ్చుకున్న టొటొచాన్‌ని ఏ బడిలో చేర్పించినా ఆ పిల్ల చేసే అల్లరిని తట్టుకోలేక టీచర్లు మీ అమ్మాయికి చదువు చెప్పడం మా వల్ల కాదంటూ ఇంటికి పంపేసేవారు. టొటొ వాళ్ల అమ్మ పొరపాటున కూడా ఆ పిల్లని ఏం అనేది కాదు. పిల్ల మనస్తత్వానికి తగిన బడికోసం ఓపిగ్గా అన్వేషించేది. ఆ క్రమంలో ఆమెకు దొరికిన అద్భుతమైన పాఠశాలే టొమో రైలుబడి. జపాన్‌లో ఉందీ పాఠశాల. హెడ్‌మాస్టారు కొబయాషి పిల్లల్లోని ఉన్నత వ్యక్తిత్వాలని బయటకు తీసుకొచ్చే విధంగా తన ఆలోచనలని అమలు చేస్తున్న సమయంలో టొటొచాన్‌ ఆ బడిలో అడుగుపెట్టింది. ఎన్నో నేర్చుకుంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో టొమో బడిపై బాంబులు పడి ఆ స్కూల్‌ ధ్వంసమైంది. కానీ అంతవరకూ ఆ బడిలో చదువుకున్న విద్యార్థులందరూ పెద్దయ్యాక ఉన్నత స్థానాలకి ఎదిగారు. టెట్సుకో అయితే జపాన్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ వ్యాఖ్యాతగా మారింది. టీవీ వ్యాఖ్యాతగా, ఐరాస గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా గుర్తింపు సాధించిన టెట్సుకోకురొయనాగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేది. తనలోని ఈ చైతన్యానికి కారణం.. ఆ బడే అని నమ్మిన టెట్సుకో రైలుబడి అనుభవాలని టొటొచాన్‌- ది లిటిల్‌ గర్ల్‌ ఎట్‌ ద విండో పుస్తకంగా రాసింది. జపాన్‌ చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ఇదే. తొలి ప్రచురణలోనే లక్షలాది పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఇంగ్లిష్‌లోకి అక్కడ నుంచి 30 దేశాల్లో వందలాది భాషల్లోకి అనువాదమైన పుస్తకం టొటొచాన్‌. ఇది ప్రతి స్కూల్లోనూ, ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన పుస్తకం అంటే అతిశయోక్తి కాదు.