NRI-NRT

న్యూజెర్సీలో భాజపా సంబరాలు

OFBJP New Jersey Team Victory Celebrations

సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి గెలుపొందడంపై ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో న్యూజెర్సీలో ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్‌లో జరిగిన ఈ వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా వచ్చారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లాలని అందరూ కోరుకున్నారు. గత 5సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అరవై ఏళ్లలో ఎప్పుడు జరగలేదని వివరించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో అభివృద్ధి ఎజెండాగా అవినీతి రహిత పాలనను అందించాలని కోరారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రెసిడెంట్ కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ కార్యకర్తలు 1.4 మిలియన్ల ఫోన్ కాల్స్‌ను భారతీయులకు చేసి బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేశామని తెలిపారు. అలా చేసిన 108 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 96 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నోకార్యక్రమాలు చేశామన్నారు. అమెరికాలోని 30 నగరాల్లో కారు ర్యాలీలు, చౌకీదార్ మార్చ్‌లు, ఛాయ్ పే చర్చ, కాల్ ఏ థన్ (ఫోన్ కాల్స్ క్యాంపెయినింగ్‌) సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. తెలంగాణలో నలుగురు ఎంపీలు గెలవడం, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడంతో ఈ సంబరాలలో తెలుగు వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలో కూడా బీజేపీ బలోపేతం అవ్వడానికి ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పని చేస్తుందని విలాస్ రెడ్డి జంబుల అన్నారు.