WorldWonders

మేకప్ వేసుకో…ఎక్కువ తీసుకో

Russian firm who says women with skirts in make up will be paid more in bonus is slammed by netizens

స్కర్ట్‌లు ధరించి, మేకప్ వేసుకునే మహిళా ఉద్యోగులకు అదనపు జీతం ఇస్తామంటూ ఆఫర్ చేసిన ఓ రష్యా కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పని స్థలాల్లో ‘వెలుగులు’ నింపేందుకు నెలరోజుల పాటు ‘ఫెమినిటీ మారథాన్’ నిర్వహిస్తున్నామనీ… ఇందులో భాగంగా ఉద్యోగినులు స్కర్టులు ధరించిరావాలని ఆ కంపెనీ కోరింది. మోకాళ్ల పైన ఐదు అంగుళాలకు మించకుండా స్కర్టు ధరించి, మేకప్ వేసుకుని విధులకు వచ్చిన వారికి జీతంలో 100 రూబిళ్లు (భారత కరెన్సీలో ఇది రూ.107) ఇస్తామని ప్రకటించింది. అల్యూమినియం తయారు చేసే సదరు కంపెనీ పేరు టాట్‌ప్రూఫ్. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌కి అల్యూమియం సరఫరా చేసింది కూడా ఈ కంపెనీయే. అయితే తాజాగా ఈ కంపెనీ చేసిన ప్రకటనపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. వెలుగుల పేరుతో మనం ‘‘చీకటి యుగంలోకి’’ కొట్టుకుపోతున్నాం అని ఓ నెటిజన్ హెచ్చరించగా… యాజమాన్యమే మేకప్ వేసుకుని రావాలని మరొకరు ఘాటుగా స్పందించారు. ‘‘మధ్య యుగం నాటి మాట ఇది..’’ అని జలీనా మర్షెన్కులోవా నిరసన వ్యక్తం చేశారు. ట్విటర్ వినియోగదారుడొకరు మరో అడుగు ముందుకెళ్లి ఈ కంపెనీ సీఈవో సెర్గెయ్ రచ్కోవ్ ఓ ‘డైనోసార్’ అనీ.. ఈ ఏడాది మొత్తం మీద ఇదే షాకింగ్ న్యూస్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా బోనస్ ఆఫర్ అందుకునేందుకు ఉద్యోగినులు తమ ఫోటోలను సంబంధిత నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. జూన్ నెల ఆఖరు వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని టాట్‌ప్రూఫ్ వెల్లడించింది