Devotional

రంజాన్ ప్రత్యేకం-ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక మసీదులు

Here are the world famous mosques list - Ramadan special-రంజాన్ ప్రత్యేకం-ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక మసీదులు

ప్రసిద్ధ మసీదులెన్నో
పవిత్రతకు, సౌభ్రాతృత్వానికి రంజాన్ మాసం చిహ్నం. ఈ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా మసీదులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ముస్లింల ప్రార్థనలతో మసీదు ప్రాంగణాలు ప్రతిధ్వనిస్తాయి. అలాగే ప్రతీ ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలనుకుంటాడు. అయితే మక్కాతో పాటు సందర్శించదగ్గ మసీదులు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ప్రత్యేకతలు..
**అతిపెద్ద మసీదు
ప్రపంచంలోని అతి పురాతనమైన, అతిపెద్ద మసీదు.. మక్కాలోని అల్ మస్జిద్ అల్ హెరమ్. దీన్ని గ్రాండ్ మాస్క్ అంటారు. మక్కా యాత్రికులు ఈ మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సుమారు 292 అడుగుల ఎత్తు ఉంటది. ఈ మసీదులో ఏక కాలంలో సుమారు 40 లక్షల మంది ప్రార్థన చేసుకోవచ్చు.
***తెలంగాణ మక్కా మసీదు
తెలంగాణలో ప్రాచీన మసీదులు ఎన్నో ఉన్నప్పటికీ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్‌లోని మక్కా మసీదు గురించి. ఇది భారతదేశంలోని ప్రాచీన, పెద్ద మసీదుల్లో ఒకటి. క్రీ.శ.1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా భేగ్, రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో ఈ మసీదు నిర్మాణం ప్రారంభించారు. 1694లో మొఘల్ చక్రవర్తి ఔరగంజేబు ఈ మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
**మొరాకోలో..
ఆధునిక కాలపు మసీదుల్లో మొరాకోలోని కాసబ్లాంకా పట్టణంలోని హసన్ 2 మసీదు ఒకటి. కాసబ్లాంకా హజ్‌గా ప్రసిద్ధి పొందిన ఈ మసీదు నిర్మాణం 1993లో పూర్తయ్యింది. దీని ఎత్తు 690 అడుగులు కాగా విస్తీర్ణం 90 వేల చదరపు మీటర్లు. ఇక్కడ ఒకేసారి లక్షమంది నమాజ్ చేసుకోవచ్చు.
**ఢిల్లీ జామా మసీదు
ఆసియాలోని ప్రాచీనమైన మసీదుల్లో ఢిల్లీలోని జామా మసీదు ఒక్కటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని కట్టించాడు. ఈ మసీదు నిర్మాణం క్రీ.శ.1644 నుంచి 1656 వరకు సాగింది. 135 అడుగుల ఎత్తు ఉంటది. ఈ మసీదులో ఏకకాలంలో 25 వేల మంది వరకు ప్రార్థనలు చేసుకోవచ్చు.
**జెరూసలెంలో..
ప్రాచీన మసీదుల జాబితాలో జెరూసలెంలో క్రీస్తు శకం 705లో నిర్మించిన అల్ అక్సా మసీదు ఒకటి. ఈ మసీదు ఎత్తు 121 అడుగులు కాగా ఇందులో ఒకేసారి రెండున్నర లక్షల మంది ప్రార్థన చేసుకోవచ్చు.
**మస్కట్‌లో..
ఇటీవలి కాలంలో నిర్మితమైన అతిపెద్ద మసీదుల్లో సల్తాన్ ఖబూస్ మసీదు ఒకటి. ఒమన్ సుల్తాన్ ఖబుస్ చేత 1994 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ మసీదు 2001 మేలో పూర్తయ్యింది. దీని ఎత్తు 295 అడుగులు. విస్తీర్ణం దాదాపు 4 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ఏకకాలంలో 20 వేల మంది వరకు ప్రార్థనలు చేసుకోవచ్చు.
**అబుదాబిలో..
అతిపెద్ద ఆధునిక మసీదుల్లో అబుదాబిలోని షేక్ జాయేద్ మసీదు కూడా ఒకటి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ ఆల్ నాహ్యాన్ 1996 – 2007 మధ్య కాలంలో నిర్మించిన ఈ మసీదు ఎత్తు 279 అడుగులు. విస్తీర్ణం 1.20 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ఏకకాలంలో 40 వేల మంది ప్రార్థన చేయొచ్చు.