DailyDose

సోనియా అల్లుడికి ఊరట-తాజావార్తలు–06/03

June 03 2019 - Daily Breaking News In Telugu - Robert Wadra Comes Out Clean

* సీబీఐ ప్రత్యేక కోర్టులో కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. అమెరికా, నెదర్లాండ్స్‌లలో పర్యటించేందుకు కోర్టు అనుమతిచ్చింది. వైద్య సేవల నిమిత్తం ఆరు వారాలపాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. అయితే లండన్‌ వెళ్లేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో లండన్ పర్యటనకు సంబంధించి తన పిటిషన్‌ను వాద్రా విత్ డ్రా చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవధిలో లుక్ ఔట్ నోటీసులు జారీ అయితే.. తమ తాజా ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తామని కోర్టు తెలిపింది.
* తమిళనాడు దివంగిత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని డీఎంకే పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్.. కరుణానిధి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులుఅభిమానులుకార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తర్వాత మెరినా బీచ్‌లోని కరుణానిధి సమాధి దగ్గర స్టాలిన్ఇతర డీఎంకే నేతలుకార్యకర్తలు కరుణానిధికి నివాళులర్పించారు.
*సినీ నటుడు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మురళీమోహన్‌ను.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కలిశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీమోహన్‌కు ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌తో కలిసి మురళీమోహన్‌ నివాసానికి వెళ్లారు. ఆయన్ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురళీమోహన్‌కు ఫోన్‌చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
*తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఇప్పటి వరకు 26,259 ఉద్యోగాలు భర్తీ చేశామని కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలు, పరీక్షల నిర్ణయాల్లో పారదర్శకతను పాటిస్తూ దేశంలోని ఇతర పీఎస్సీలకు ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు.
*అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని ఈసారి ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో నిర్వహిస్తున్నారు. ఈనెల 21న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి.
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 4న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం హైదరాబాద్‌ నుండి బయలుదేరి రాంపూర్‌ చేరుకుంటారు. అక్కడ పంప్‌ హౌస్‌ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులను పర్యవేక్షిస్తారు. అక్కడే అధికారులతో సమావేశమవుతారు.
*వచ్చే నెలాఖరుకల్లా భద్రాద్రి విద్యుత్కేంద్రంలోని తొలి యూనిట్‌లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభిస్తామని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. *
* నిధుల మళ్లింపు వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో రెండోరోజూ సీబీఐ సోదాలు నిర్వహించింది.
* రైళ్లలోఏసీ ప్రయాణం చేయాలనుకునేవారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోందని, ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏసీ బోగీలను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
* రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం (ఏపీవోఏ) గౌరవాధ్యక్షుడిగా వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌కే పురుషోత్తం తెలిపారు.
*కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శ్రీశైలం, సున్నిపెంట, పాణ్యం, నందికొట్కూరు, పెద్దకడబూరు తదితర ప్రాంతాల్లో గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. పాణ్యంలోని శాంతిరాం వైద్యశాల సమీపంలో జాతీయ రహదారిపై గాలులకు రెండు కంటైనర్‌ లారీలు బోల్తా పడ్డాయి. మహానంది మండలంలోని గోపవరం, బుక్కాపురంలో చెట్లపై పిడుగులు పడ్డాయి.
*గుంటూరులో సోమవారం నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.07 కోట్లు విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విందు, నిర్వహణ, అతిథులకు ఏర్పాట్ల కోసం సంబంధిత నిధులను విడుదల చేస్తున్నట్లు అందులో పేర్కొంది.