Movies

కమల్…ద చిట్టి

Kamal had the first chance to act in Robo in 1998

రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘రోబో’. చిట్టి రోబోగా రజనీ నటన ప్రేక్షకులను కట్టి పడేసింది. 2010లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అయితే, తొలుత ఇందులో కథానాయకుడిగా కమల్‌హాసన్‌ను అనుకున్నారు. కథానాయికగా ప్రీతి జింతాను కూడా తీసుకున్నారు. 1998లోనే ఇందుకు సంబంధించిన ఫొటో షూట్‌ చేశారు. అయితే, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు రద్దయింది. శంకర్‌కు ఉన్న విజన్‌ ప్రకారం అప్పటికి ఆ స్థాయి టెక్నాలజీ అందుబాటులో లేదు. పైగా కమల్‌హాసన్‌ కూడా వేరే చిత్రాల్లో బిజీగా ఉండటంతో సినిమాకు ముందుకు సాగలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ శంకర్‌ ‘రోబో’ను తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆమీర్‌ఖాన్‌ను కలవగా అప్పటికే ఒప్పుకొన్న చిత్రాల కారణంగా ఆయన ఈ సినిమా చేసేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత బాల్‌ షారుఖ్‌ కోర్టులోకి వెళ్లింది. కథానాయికగా ప్రియాంక చోప్రాను కూడా అనుకున్నారు. అయితే, శంకర్‌ సినిమా ఆలస్యమవుతుందన్న కారణంతో షారుఖ్‌ కూడా ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో శంకర్‌ రజనీకాంత్‌ను కలిశారు. ఆయనకూ కథ నచ్చడంతో ‘రోబో’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.