Sports

సౌతాఫ్రికాతో ఇండియా ఢీ నేడే

India-Southafrica ICC CWC 2019 Live scores details and pitch report

భారీ అంచనాలు.. అంతకు మించిన ఆకాంక్షల మధ్య భారత్‌ ప్రపంచకప్‌లో తొలి పరీక్షకు సిద్ధమైంది. తన ఆరంభ పోరులో బుధవారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐపీఎల్‌ తర్వాత 20 రోజులు విశ్రాంతి తీసుకున్న జట్టు ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. సన్నాహక మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా లోతైన బ్యాటింగ్‌.. పదునైన బౌలింగ్‌పై తిరుగులేని నమ్మకంతో ఉంది. రోహిత్‌శర్మ సామర్థ్యం.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సత్తా.. ధోని చాణక్యం టీమ్‌ఇండియాకు పెట్టని కోటలు. ఈ ముగ్గురి చుట్టూ అల్లుకున్న ఈ జట్టు కథకు శుభారంభం అత్యంత కీలకం. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాది చావోరేవో పరిస్థితి. మూడో మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లడం ఖాయం! కొంత బలహీనపడ్డట్లు కనిపిస్తున్నా ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్‌ రెండు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓపెనింగ్‌లో రోహిత్‌, ధావన్‌.. వన్‌డౌన్‌లో విరాట్‌.. నాలుగో నంబరులో రాహుల్‌.. వికెట్‌ కీపర్‌గా ధోని.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య స్థానాలకు ఢోకా లేదు. పేసర్లు ముగ్గురా? ఇద్దరా? అన్న దానిపైనే తుదిజట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలో దిగితే బుమ్రా, షమి, భువనేశ్వర్‌ తుదిజట్టులో ఉంటారు. అప్పుడు హార్దిక్‌తో కలిపి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో టీమ్‌ఇండియా బరిలో దిగుతుంది. స్పిన్‌ కోటాలో కుల్‌దీప్‌యాదవ్‌ లేదా చాహల్‌లలో ఒకరికి అవకాశం లభించనుండగా మిగిలిన ఒక స్థానం కోసం జడేజా, కేదార్‌ జాదవ్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. తుదిజట్టులో జడేజాకు చోటు దక్కే అవకాశాలే అధికం. ఒకవేళ ఇద్దరు ప్రధాన పేసర్లతో ఆడితే భువనేశ్వర్‌ స్థానంలో జాదవ్‌కు అవకాశం లభిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు వికెట్‌ పచ్చికతో కళకళలాడింది. ఆ తర్వాత పచ్చికను పూర్తిగా తొలగించారు. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టొచ్చు. వర్షం పడినా.. వాతావరణం చల్లగా ఉన్నా పేసర్లు ప్రభావం చూపొచ్చు. బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడే అవకాశముంది. ప్రపంచ కప్‌లో రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు గెలిచింది. ఒక దాంట్లో భారత్‌ నెగ్గింది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య వన్డేలు. భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలవగా.. దక్షిణాఫ్రికా 46 విజయాలు సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.