DailyDose

బ్యాలెట్ బాక్స్‌కు చెదలు-రాజకీయ-06/04

June 04 2019 - Daily Political News - Ballot box eaten by bugs

* రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో కూడా ఉదయం 8 గంటలకే కౌంటింగ్ మొదలైంది. అయితే మండలానికి చెందిన అంబట్ పల్లి గ్రామంలోని కౌంటింగ్ నిమిత్తం బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయగా అందులోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టాయి.ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీడీవో డీపీవో వెంటనే జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆ బ్యాలెట్ బాక్స్ ను కౌంటింగ్ చేయకుండా ఆపేశారు.ఆ బాక్స్ లో మొత్తం 395 ఓట్లు ఉన్నవి.
*20 నుంచి రాజ్యసభ సమావేశాలు
రాజ్యసభ సమావేశాలు ఈనెల 20 నుంచి జులై 26 వరకు జరుగుతాయని ఎగువసభ సచివాలయం సోమవారం తెలిపింది. కాగా సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 17న ప్రారంభమవుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలు తొలి రెండు రోజుల పాటు ప్రమాణస్వీకారం చేస్తారు. స్పీకర్‌ ఎన్నిక 19న జరుగుతుంది. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌లో ప్రసంగిస్తారు. ఈసారి పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.
* మేడిగడ్డ పనులను పరిశీలించిన కేసీఆర్‌
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్‌ చేరుకున్న ఆయన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించారు. పనుల పురోగతిపై నవయుగ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావుతో సీఎం మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్‌ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. పెండింగ్‌ పనుల పూర్తికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యారేజి పనులను దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.
*ఇది శాశ్వతంగా విడిపోవడం కాదు
లోక్ సభ ఎన్నికల నిమిత్తం ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటైన మహాకూతమికి గుడ్ బై చెప్పినట్టు బీస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. రానున్న ఉప ఎన్నిక‌ల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. స‌మాజ్‌వాదీ పార్టీ త‌మ సొంత ఓటు బ్యాంకును కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రికి వారు ఒంట‌రిగా పోటీచేయ‌డ‌మే మంచిదని, సోమవారం జ‌రిగిన ప‌దాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నామని వెల్లడించారు.
*బీహార్ లో భాజపాకు షాక్
బీహార్ లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్‌ కుమార్‌ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది. నితీష్‌ కుమార్‌ను బీజేపీ అవమానిస్తున్న క్రమంలో బీజేపీయేతర శక్తుల పునరేకీకరణకు ఇదే సరైన సమయమని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘ్‌వంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి పార్టీకి ఒకరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయంతో నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోదని నితీష్‌ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్‌లో 17 స్ధానాల్లో పోటీ చేసిన జేడీయూ 16 స్ధానాల్లో గెలుపొందడంతో కేంద్ర క్యాబినెట్‌లో ఎక్కువ మందికి చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా ఆ మేరకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నితీష్‌ కంగుతున్నారు. తాజాగా మంత్రివర్గం విస్తరించిన నితీశ్ కుమార్ కూడా బీజేపీకి మొండిచేయి చూపించారు.
*కన్నడ నాట మలుపులు
కన్నడనాట కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ రాజకీయాలు రోజుకో మలుపు తిరగుతున్నాయి. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు హెచ్.విశ్వనాథ్. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు.
పార్టీలో ఇటీవల తనకు ప్రాధాన్యం తగ్గిందని, కీలక నిర్ణయాల్లో తనతో సంప్రదింపులు జరపట్లేదని విశ్వనాథ్ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కూటమి సమన్వయ కర్తగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య పనితీరుపై ఇటీవలి కాలంలో బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు విశ్వనాథ్.కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల వల్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదముందని అంచనా వేసిన కుమారస్వామి.. మంత్రివర్గాన్ని విస్తరించాలకున్నారు. ఈ దిశగా కాంగ్రెస్-జేడీఎస్ మధ్య వరుస భేటీలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విస్తరణపైనా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. శాఖల కేటాయింపులు న్యాయంగా జరగాలని గళమెత్తుతున్నారు.
*మా స్నేహబంధం కొనసాగుతూనే ఉంటుంది -మాయావతి
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ తనకు ఎంతో గౌరవం ఇచ్చారని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ మధ్య ఉన్న విబేధాలన్నింటిని మరిచిపోయామని ఆమె తెలిపారు. తమ మధ్య బంధం రాజకీయాల కోసం కాదు.. ఈ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని మాయావతి తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యాదవ కమ్యూనిటీ సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇవ్వలేదని.. ఈ క్రమంలో బలమైన నాయకులు కూడా ఓటమి పాలయ్యారని ఆమె పేర్కొన్నారు. మహాకూటమి బ్రేకప్ శాశ్వతం కాదు.. తాత్కాలికమేనని మాయావతి స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ భవిష్యత్‌లో మంచి విజయాలు సాధిస్తే అతనితో కలిసి పని చేస్తాం. ఒక వేళ అతను విజయం సాధించలేకపోతే ఒంటరిగానే ముందుకెళ్తాం. మొత్తానికి త్వరలో యూపీలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని మాయావతి స్పష్టం చేశారు.
* ఒంటరిగానే పోటీ చేస్తాం – అఖిలేష్ యాదవ్
బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. తమ బంధం తెగదెంపులు అయితే.. దానిపై లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ – బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని మాయావతి పేర్కొన్న విషయం విదితమే. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్లు పలువురు ఘోర ఓటమి చవి చూశారు.
*రైతుబంధు పైసలొస్తున్నాయ్‌
తొలకరి జల్లులు పలకరిస్తున్న వేళ ఏరువాక కోసం అన్నదాతకు భరోసానిచ్చేలా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద రూ. 6,900 కోట్లు విడుదల చేసింది. వీటిని మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఎకరానికి రూ.5,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. గతేడాది రూ. 4,000 ఇవ్వగా ఈ ఏడాది నుంచి రూ. 5,000కు పెంచారు.
*పోలవరానికి అగ్రప్రాధాన్యం
తమ ప్రభుత్వం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించబోదని, సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచేసిన ప్రాజెక్టుల విషయంలో రివర్స్‌ టెండర్లు పిలుస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అగ్రప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు.
*భాజపా తలుపులు తెరిచే ఉంచాం
భారతదేశం మంచి కోరేవారు మాతో కలిసి వస్తామంటే.. పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. అలాంటి వారి కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంచుతామని చెప్పారు. ‘కమల విజయ కృతజ్ఞత భేరి’ సభను సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాంమాధవ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ కాంగ్రెస్‌ను నడపటం తన వల్ల కాదంటున్నారన్నారు. భాజపా గెలుపును అవినీతి, వారసత్వ రాజకీయాలు, అహంకార విధానాలపై ప్రజల విజయంగా భావించాలన్నారు.
*జడ్పీల కైవసానికి తెరాస కసరత్తు
తెలంగాణలోని 32 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కసరత్తు ప్రారంభించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సోమవారం మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. పార్లమెంటు ఎన్నికల అనుభవం దృష్ట్యా జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఎంపీపీల ఎన్నికల విషయమై ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో 32 జిల్లాలకు మంత్రులు, ముఖ్యనేతలను ఇన్‌ఛార్జీలను నియమించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగాఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్నిచోట్లా గెలిచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ నేతలకు నిర్దేశించారు.
*డబ్బులు లేకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి: జగ్గారెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల కోటాలో వరంగల్‌, రంగారెడ్డి, నల్గొండ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు లేకనే కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓడిపోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస దగ్గర డబ్బులు ఉన్నందుకే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారన్నారు.సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా ఎన్నికల్లో పోరాడి కాంగ్రెస్‌ ఆర్థికంగా బలహీనపడిందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌ కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు.
*స్థానిక ఎన్నికల్లో విప్‌ జారీ చేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం సభ్యులకు విప్‌ జారీచేయాలని పార్టీ నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన అధ్యక్షతన రాష్ట్రస్థాయి పార్టీ నేతల సమావేశం జరిగింది.
*మండలిలో తెరాసకు మరింత ఆధిక్యం
తెలంగాణ రాష్ట్రసమితికి శాసనమండలిలో మరింత ఆధిక్యం లభించింది. రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో ఆ పార్టీ బలం 32కి చేరింది. మరో మూడు స్థానాలను సాధించాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. శాసనసభ్యుల కోటా కింద గెలిచిన యాదవరెడ్డి, గవర్నర్‌ కోటాలో నియమితులైన రాములునాయక్‌, నిజామాబాద్‌ శాసనసభ్యుల కోటా సభ్యుడైన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారని తెరాస ఫిర్యాదు చేయడంతో శాసనమండలి ఛైర్మన్‌ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ముగ్గురూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
*కాంగ్రెస్‌కు అంతలోనే నిరాశ
పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌కు శాసనమండలి ఎన్నికల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్‌ ఒక ఎమ్మెల్సీ స్థానమైనా దక్కించుకోవాలని చూసింది. మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కనీసం నల్గొండలో విజయం ఖాయమనుకున్నా ఫలితం దక్కలేదు.
*ఎన్నికల సంస్కరణల కోసం పోరాడతా
ఎన్నికల్లో పోటీ చేయనని ఏడాదిగా చెబుతూనే ఉన్నానని, ఆ మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకొన్నానని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజిక సేవ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నానని వెల్లడించారు. అనంతపురంలో సోమవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఎన్నికల విధానంలో మార్పు తెచ్చేలా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి పెంచుతామన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సహకారం తీసుకుంటామని చెప్పారు. జస్టిస్‌ చలమేశ్వర్‌, మరికొందరు పెద్దలను స్వయంగా కలిసి ఎన్నికల విధానంలో మార్పు తేవాలని కోరతామన్నారు.
*పొత్తులపై ఆధారపడకండి: మాయావతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)- సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య కుదిరిన పొత్తుకు ఇక్కట్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్ల కోసం కూటమిపై ఆధారపడవద్దని, సొంతంగానే పార్టీని బలోపేతం చేసుకోవాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కార్యకర్తలకు సూచించారు.
*ఎన్నికల సంస్కరణల కోసం పోరాడతా
ఎన్నికల్లో పోటీ చేయనని ఏడాదిగా చెబుతూనే ఉన్నానని, ఆ మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకొన్నానని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజిక సేవ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నానని వెల్లడించారు. అనంతపురంలో సోమవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఎన్నికల విధానంలో మార్పు తెచ్చేలా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి పెంచుతామన్నారు.
*ఈవీఎంలు వద్దే వద్దు
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేశారు. ఇకపై ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లే వాడేలా ప్రతిపక్షాలన్నీ కలసిరావాలని అభ్యర్థించారు. ఇటీవల ఈవీఎంలను ప్రోగ్రామింగ్‌ చేశారా, లేదా? అనేది తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండు చేశారు. తద్వారా ఎన్నికల ఫలితాలు ఇలా రావడానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయన్నారు. అమెరికాలో ఈవీఎంలను నిషేధించారని ఆమె గుర్తు చేశారు.
*నవ్యాంధ్రలో భాజపాకు ఆదరణ
ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు లాల్‌పురం రోడ్డులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం తెదేపా, జనసేనలకు చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో ఏపీలో తెదేపాతో పొత్తు పెట్టుకున్నందునే రాష్ట్ర ప్రజలు తమను తిరస్కరించారన్నారు.