NRI-NRT

తానాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి?

Kishan Reddy To Attend TANA 2019 Conference In Washington DC

వచ్చే జులై 4వ తేదీ నుండి మూడు రోజుల పాటు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న తానా 22వ మహాసభల నిర్వహణకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉండటంతో దాదాపు మూడు వందల మంది వివిధ కమిటీల సభ్యులు రాత్రింబవళ్ళు తానా మహాసభల ఏర్పాట్లలో నిమగ్నమయి ఉన్నారు. తానా మహాసభలకు ముఖ్యఅతిధిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుని తీసుకురావాలని తానా కార్యవర్గం సిద్ధమైంది. అయితే దౌత్యపరమైన ఇబ్బందుల మూలంగా వెంకయ్యనాయుడు అమెరికాకు రావటం లేదని సమాచారం. దీంతో తెలుగువారైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ముఖ్యఅతిధిగా తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భాజపా అంతర్జాతీయ విభాగంలో తానా మహాసభల కన్వీనర్ డా.మూల్పురి వెంకట్రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయ భాజపా నేతల సహకారంతో కిషన్ రెడ్డిని తానా సభలకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క చంద్రబాబు ఓటమి ప్రభావం తానాపై తీవ్రంగా పడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆధ్వర్యంలో తానా మహాసభలు వైభవంగా నిర్వహించాలని తానా నిర్వాహకులు తొలుత భావించారు. తానాలో ఉన్న చంద్రబాబు అభిమానులు ఇప్పుడిప్పుడే ఊహించని షాక్ నుండి బయటకు వచ్చి తానా సభలను దిగ్విజయం చేయటంపై దృష్టిపెట్టారు. మరొకపక్క వేమన సతీష్ గత రెండు వారాల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మకాం వేసి ఇటీవలే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ మంత్రులకు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు స్వయంగా ఆహ్వానాలు అందించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తెదేపా ఎంపీ గరికపాటి మోహనరావు, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పలువురు వైకాపా ఎమ్మెల్యేలు తానా సభలకు హాజరవుతున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన ముగించుకుని తానా అధ్యక్షుడు వేమన సతీష్ ఈ రోజు అమెరికా చేరుకోవడంతో తానా సభల ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.