Agriculture

వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Are you about to buy fertile land? Here are the precautions to be taken.

భూమి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన జీవనాధారం అన్నపూర్ణగా పేరొందిన మన రాష్ట్రంలో రైతులు, వ్యవసాయదారులే కాకుండా అందరూ భూ సమస్యలతో సతమతమవుతున్నారు. వీటికి ముఖ్యకారణం భూముల రకాలు, వాటిని కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం. భూమి పై ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 శాతం మంది గ్రామీణప్రజానికం ఆధారపడి జీవిస్తున్నారు. ఈ భూమి సాగు చేయడంలో కౌలుకు తీసుకోవడం, కొనుగోలు చేయడంలో ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. భూములకు సంబంధించి 76 రకాల సమస్యలు ఉంటాయని అంచనా. ఈ సమస్యలకు ముఖ్యకారణం కొనుగోలు చేసే భూములు ఏ రకమైన భూ ములో తెలుసుకోకపోవడం. భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు ఉంటాయి.. ఏ రకమై న భూములు కొనుగోలు చేయాలి.. ఏ రకమైన భూములు కొనుగోలు చేయకూడదు.. ప్రభుత్వ భూమికి, ప్రైవేట్ భూమికి తేడా ఏమిటి? వంటి అనేక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
***ప్రతి భూ యజమాని గుర్తుంచుకోవాల్సిన 3 అంశాలు..
1. స్వాధీనంలో ఉన్న భూమి
2. చేతిలో పట్టా
3. రెవెన్యూ రికార్డులలో పేరు
ఇవి మూడు ఉన్నప్పుడే భూమిపై పూర్తి భద్రత ఉంటుంది. భూమి కొనేముందు ప్రాథమికంగా కొన్ని అంశాలు తెలుసుకుని కొనుగోలు చేయాలి.
****భూములు – రకాలు..
a) ప్రభుత్వ భూములు
b) పొరంబోకు భూములు
c) బంచరాయి
d) గైరాన్
పొరంబోకు భూములు :
భూములు సర్వే చేసే నాటికి సేద్యానికి ఉపయోగపడకుండా ఉండి ఉంటే అలాంటి భూములను పొరంబోకు భూములు అంటారు. ఇది ప్రభుత్వ భూమే.
***బంజరు భూమి (బంచరాయి)
రెవెన్యూ గ్రామ శివారులో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం నిర్ధేశించిన భూమి. గ్రామ అవసరాల కోసం మొత్తం భూమిలో కొంత శాతాన్ని బంజరు భూమిగా ఉంచాలనే నిర్ణయం గతంలో ఉండేది. కొండలు, గుట్టలు, ఖనిజ సంపద ఉన్న భూములను కూడా బంజరు భూములుగా వర్గీకరించి ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటుంది.
***గైరాన్-సామాజిక పోరంబోకు..
*ప్రైవేట్ భూములు – జిరాయితీభూములు, తర తరాలుగా పట్టా అని రాసిఉన్న భూములు, ప్రజలు అనుభవిస్తున్న భూములు (భూమి రికార్డుల్లో వారి పేరు ఉంటుంది).
*నాం భూములు – రాజుల కాలంలో ఏదైనా సర్వీసు చేసినందుకు ఇనాం కింద ఇచ్చిన భూములు, 1950 తర్వాత వచ్చిన ఇనాం రద్దు చట్టాలతో పట్టా భూముల కిందనే చూడవచ్చు.
*శాశ్వత రికార్డులు -సేత్వార్ (డైగ్లాట్), ఖాస్రా పహాణీ, టిప్పన్.
***సేత్వార్ (డైగ్లాట్)
రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి నిర్వహించిన భూమి సర్వే సెటిల్‌మెంట్ కార్యకలాపాలు పూర్తి చేసి ప్రతి గ్రామంలో భూముల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో అన్ని రకాల భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారు, ఇనాం భూములా, మాగాణియా, మెట్టా, వాటి వర్గీకరణ, శిస్తు, మొదలగు వివరాలుంటాయి. ఈ రిజిస్ర్టారు మిగతా గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూల స్తంభంలాంటింది.
**ఖాస్రా పహాణీ
ఉమ్మడి కుటుంబాల్లో ఒకే వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ, తొలిసారిగా రైతు వారీగా భూమి పట్టా హక్కు కల్పించిన పహాణీ. దీనిని 1953-54లో ప్రవేశపెట్టగా, 1954-55 సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది.
**టిప్పన్ (ఎఫ్‌ఎమ్‌బీ)
భూమి కొలతలకు ఉపయోగించే ఫీల్డ్ మెసర్‌మెంట్ బుక్ ఇది. సర్వే సెటిల్‌మెంట్ రికార్డులు తయారు చేసేటప్పుడు ప్రతి సర్వే నంబర్‌కు ఒక టిప్పన్ తయారు చేశారు. ప్రభుత్వ భూములకు టిప్పన్ (ఎఫ్‌ఎమ్‌బీ) ఉండదు. క్షేత్ర సరిహద్దు రేఖలు, ఆధార రేఖ, అంతరలంబాల కొలతలు తెలిపే పుస్తకం (ఎఫ్‌ఎమ్‌బీ), క్షేత్రస్థాయి కొలతల స్కెచ్.
**భూముల హక్కుల పరీక్ష
మనిషి అనారోగ్యం భారిన పడ్డప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకున్న మాదిరిగానే భూమికి పరీక్షలు ఉంటాయి. భూమి ఉన్న ప్రతి వ్యక్తి భూమి హక్కుల పరీక్ష చేయించుకోవాలి. దీనికి అయ్యే ఖర్చు పెద్దగా ఉండదు. రూ.500 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. మొదటగా భూమి చిరునామా తెలుసుకోవాలి. గ్రామం పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం తెలుసుకోవాలి. సర్వే నంబర్‌కు సంబంధించి ఖాస్రా పహాణీ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, 1-బీ నమూనా, 13 సంవత్సరాల పహాణీలు (అడంగల్), ప్రస్తుత పహాణీలు తీసుకోవాలి. దీంతో అట్టి భూమికి సంబంధించి ఎలాంటి సమస్య ఉందో తెలిసిపోతుంది. ఒకవేళ సమస్య ఉంటే ఏ స్థాయి అధికారిణి సంప్రదిస్తే పరిష్కారమవుతుందో తెలిసిపోతుంది. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ భూములకు సంబంధించి రికార్డుల గురించి తెలుసుకుంటే ఇబ్బందులు దరిచేరవు.