ScienceAndTech

రష్యాతో జతకట్టిన హూవావే-5జీపై పరిశోధనలు

Huawei Joins Hands With Russia On 5G Tech Developments-రష్యాతో జతకట్టిన హూవావే-5జీపై పరిశోధనలు

అమెరికాతో పీకల్లోతు వివాదాల్లో మునిగిన హువావే ఇప్పుడు రష్యాతో జట్టుకట్టేందుకు సిద్ధమైంది. రష్యాకు చెందిన ఎంటీఎస్‌తో కలిసి 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేయడంపై సంతకం చేసింది. వచ్చే ఏడాది నాటికి ఈ కంపెనీలు రష్యాలో 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేస్తాయి. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ రష్యాలో మూడు రోజుల పర్యటన ప్రారంభ రోజే ఈ ఒప్పందం జరగడం విశేషం. దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టును 2019 లేదా 2020లో కానీ ప్రారంభిస్తారని ఎంటీఎస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే అమెరికా మిత్రదేశాలు జాతీయ భద్రత పేరుతో చైనాకు చెందిన హువావేను 5జీ రంగంలోకి రాకుండా అడ్డుకున్నాయి. చైనా సైన్యంతో తనకు ఎటువంటి సంబంధం లేదని హువావే పలుమార్లు ప్రకటించిన పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ హువావే 5జీ పరికరాలను నిషేధించాయి. ఇక అమెరికా ఇటీవల హువావేకు టెక్నాలజీ అందజేతపై ఆంక్షలు విధించిన సంస్థల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో రష్యాతో కొత్త డీల్‌తో హువావేకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించనుంది. అయితే అమెరికా కంపెనీలు తయారు చేసే చిప్స్‌ హువావేకు అందని పరిస్థితి నెలకొంది. మరోపక్క గూగుల్‌ వంటి కంపెనీలు కూడా హువావేకు సహకరించేందుకు అంగీకరించలేదు. టెలికం రంగంలో మార్పులు వేగంగా చోటు చేసుకొంటున్నాయి. 4జీ వరకు అమెరికాకు చెందిన టెలికం సంస్థలు ఈ రంగాన్ని దాదాపు ఏలాయి. భారీగా సంపాదించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ భారీగా ఆర్థిక అవకాశాలను కల్పించనుంది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, టెలీమెడిసిన్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి వాటిని మరో మెట్టు ఎక్కిస్తుంది. మిసిసిపీ సెనెటర్‌ రోజర్‌ వైకర్‌ కొన్నేళ్ల కిందటే మాట్లాడుతూ ‘‘5జీ టెక్నాలజీలో జాప్యం ప్రజలను వెనకబాటుతనంలోకి నెడుతుంది, దీంతోపాటు ఆర్థిక, సాంఘిక లాభాలను హరించివేస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు. 5జీ టెక్నాలజీ యుద్ధరంగాన్ని కూడా మరో మెట్టు పైకి తీసుకెళుతుంది. హ్యాకింగ్‌, భవిష్యత్తులో ఆయుధాలకు 5జీ కీలకమైన నెట్‌వర్క్‌. ఇప్పడు 4జీలో 6 నిమిషాల్లో డౌన్‌లోడ్‌ అయ్యేవి 5జీలో అర సెకన్‌లో అవుతుంది. వీడియోలు బఫర్‌ అవ్వవు, 5జీలో కాల్‌ డ్రాప్‌లు ఉండవు. 4జీ టెక్నాలజీలో దాదాపు పదేళ్ల నుంచి ముందున్న అమెరికా 5జీలో మాత్రం వెనుకబడింది. ఒక వేళ అమెరికా 5జీ టెక్నాలజీలో ముందుంటే 30 లక్షల ఉద్యోగాలను సంపాదించడంతో పాటు జీడీపీకి 500 బిలియన్ల ఊతం లభిస్తుంది. అంతేకాదు ఆన్‌లైన్‌లో ప్రజలు ఏం చేస్తున్నారో కూడా ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు టెలికం పరికరాలను ఉత్పతి చేయడంతో మేటి సంస్థగా ఉన్న చైనాకు చెందిన హువావే 5జీ టెక్నాలజీలో ముందుంది. దీంతో చైనాకు ఈ రంగంపై పట్టు వస్తే అమెరికా పై నిఘాపెట్టే అవకాశం లభిస్తుంది. అందుకే ఇటీవల ట్రంప్‌ హువావే పరికరాలు వినియోగంపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు తాజాగా హవావే అమెరికా బద్ధ విరోధి అయిన రష్యాకు 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. సైబర్‌వార్‌ఫేర్‌లో రష్యాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే రక్షణ పరంగా చైనా, రష్యాల బంధాన్ని ఐరన్‌ బ్రదర్స్‌గా విశ్లేషకులు పోలుస్తారు. అమెరికాకు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో ఈ రెండు దేశాలు ఏకమయ్యాయి. ఇప్పుడు 5జీ రంగంలో ఈ రెండు జట్టుకట్టడం అమెరికాకు కచ్చితంగా ఒక షాకే.