Movies

కలలో జీవించడం ఇష్టం

Rakul Preet Likes To Live In Dreams Devoid Of Hits Or Flops

పని విషయంలో నా ఆలోచనలే వేరు అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఏడాదికి నాలుగైదు సినిమాలు అలవోకగా చేసే కథానాయికల్లో రకుల్‌ ఒకరు. ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీలోనూ అవకాశాలు అందుకొంటూ బిజీగా ఉందామె. ఆమె ఇటీవల హిందీలో అజయ్‌దేవగణ్‌ సరసన నటించిన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రం విజయం సాధించింది. ఎక్కువ పని చేయాలనే ఉద్దేశంతో, చేస్తున్న పనిని వదిలిపెట్టడం నాకు నచ్చదని చెబుతోందామె. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన రకుల్‌లో కనిపిస్తుంటుంది. ‘‘ఎక్కువ పని చేస్తున్నప్పుడే, మరింత పనిని పొందుతామని నా నమ్మకం. మొదట్నుంచీ అదే నియమాన్ని పాటించడంతోనే ఇంత దూరం ప్రయాణించా. ఫలితాన్ని పక్కన పెట్టి పని చేయడం ఓ అలవాటుగా మారింది. నా సినిమా విజయవంతమైందా, పరాజయాన్ని చవిచూసిందా అనే విషయం కంటే నేను కన్న కలల్లో జీవిస్తున్నాను కదా అనేదే ఎక్కువ సంతృప్తినిస్తుంది. అది చాలు కదా ఈ జీవితానికి! ఇష్టమైన రంగంలో, తాము కోరుకున్నట్టుగా బతకడంలో ఉన్న ఆనందమే వేర’’ని చెప్పింది రకుల్‌. ఆమె ‘మన్మథుడు2’లో నటిస్తోంది. త్వరలోనే ‘ఎన్‌.జి.కె’తో సందడి చేయబోతోంది.