Editorials

చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటున్న కేశినేని-TNI ప్రత్యేకం

The story of feud between Chandrababu and Kesineni Nani-చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటున్న కేశినేని-TNI ప్రత్యేకం

విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం ఆవసాన దశలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇంకొన్ని కలకలాలు సృష్టిస్తున్నారు. ముక్కుసూటిగా నిక్కచ్చిగా వ్యవహరించే కేశినేని నాని మొదటి నుండి ఫైర్‌బ్రాండ్‌గానే ఉంటూ వచ్చారు. మొదట ప్రజారాజ్యంలో చేరిన కేశినేని నాని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. అనంతరం తెదేపాలో చేరిన కేశినేని నాని విజయవాడ ఎంపీ సీటును పట్టుబట్టి సంపాదించుకున్నారు. మొదటిసారి 2014లో భారీ మెజార్టీతో కేశినేని నాని విజయవాడ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకోవడానికి ప్రయత్నించారు. చంద్రబాబుకు ఇటువంటి వ్యవహారాలు అసలే నచ్చవు. కేశినేని నానిని రాజకీయంగా ఎదగకుండా పావులు కదిపారు. అయినా కేశినేని నాని దూకుడు ఏమాత్రం తగ్గలేదు. దాంతో చంద్రబాబు కేశినేని నాని ఆర్థిక మూలాలపై దృష్టిపెట్టారు. నాని ఆయువుపట్టుపై దెబ్బ కొట్టారు. ఆయన రాష్ట్రంలో నంబర్ వన్ రవాణా సంస్థగా వెలుగొందుతున్న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసే విధంగా చంద్రబాబు చర్యలు చేపట్టారు. కేవలం ఈ ట్రావెల్స్ మీద దాడులు జరపటానికి బాలసుబ్రమణ్యం అనే ఐపీఎస్ అధికారిని రవాణా శాఖ కమీషనరుగా నియమించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు బాలసుబ్రహ్మణ్యంను బదిలీ చేయలేదు. ఒక సందర్భంలో బాలసుబ్రమణ్యాన్ని నిలదీసిన నెపం కారణంగా నానితో ఆయనకు చంద్రబాబు క్షమాపణలు కూడా చెప్పించారు. పార్టీలో నాని మాట చెల్లుబాటు కాకుండా చేశారు. మంత్రి దేవినేని ఉమాకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయిన కేశినేని శ్రీనివాస్ (నాని)తన సన్నిహితుల వద్ద చంద్రబాబు తనపై చేస్తున్న దాడులను గురించి ప్రస్తావిస్తూ వాపోయేవారు. వీటన్నిటిని దిగమింగి ప్రజల్లో కలవడం మొదలుపెట్టారు. టాటా ట్రస్టు అధినేత రతన్ టాటాకు కేశినేని నానీ ఆత్మీయులుగా మారారు. టాటా ట్రస్టు ద్వారా నియోజకవర్గంలోని అన్ని పెద్ద గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమల్లు చేపట్టారు. చాలా మంది యువతకు ఉపాది చూపెట్టారు. ప్రజలకు సన్నిహితులయ్యారు. విజయవాడ ఎంపీ స్థానానికి గడిచిన ఎన్నికల్లో కేశినేని నాని తప్ప మరోకపేరు తెరపైకి రాని విధంగా కేశినేని నాని తెదేపాలో తన స్థానాన్ని పటిష్ఠపరుచుకున్నారు. మెజార్టీ తక్కువ వచ్చినా విజయం సాధించారు.

*** ప్రతీకారం ప్రారంభించారు.
కేశినేని నాని ఎంపీగా ఎన్నికైన అనంతరం భాజపాలో చేరుతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. తెదేపాలో తానంటే గిట్టనివారే ఈ ప్రచారం చేస్తున్నారని నాని అంటున్నారు. తెదేపా తరపున గెలిచిందే ముగ్గురు ఎంపీలు. ఇతర ఎంపీలకు పార్లమెంటులో ముఖ్యమైన పదవి ఇచ్చి ఇంకెవరూ లేకపోవడంతో మిగిలిన పదవిని తనకివ్వడం పట్ల కేశినేని చెలరేగిపోయారు. ఇది కేశినేనిలో ఉన్న అహాన్ని దెబ్బతీసింది. అసంతృప్తిని బయటకు తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌లో ప్రకటనల ద్వారా చంద్రబాబు వ్యవహార శైలి ఇప్పటికి మారడం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి పిలిచి బుజ్జగించినా కేశినేని వైఖరిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి చంద్రబాబు ముందే కేశినేని కుండబద్దలు కొట్టేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెదేపా మరింతగా మునిగిపోతుంది అంటూ స్పష్టంగా బాబుకు చెప్పేశారు. కేశినేని నాని భాజపాలోకి వస్తారేమోనని ఆ పార్టీ నాయకత్వం కూడా ఎదురు చూస్తోంది. నానికి సన్నిహితమైన కేంద్ర మంత్రి గడ్కరిని కలవడం తెదేపా విజయవాడ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు నాని గైర్హాజరు కావడం తదితర చర్యలతో కలకలం సృష్టిస్తున్న కేశినేని నాని భవిష్యత్తులో ఎటువంటి ప్రకటనలు చేస్తారోనని రాజకీయ పరిశీలకులు, రాజధాని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అర్థాంతరంగా తన వారం రోజుల విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.