Business

బిట్‌కాయిన్ మోసం కేసులో మీనవల్లి వెంకట్‌పై కేసు

Longfin Chairman Venkat Meenavalli Arrested In Crypto Fraud Case

వేల కోట్ల డాలర్ల అకౌంటింగ్‌ మోసం కేసులో ఫిన్‌టెక్‌ కంపెనీ లాంగ్‌ఫిన్‌ కార్ప్‌ మాజీ సీఈఓ వెంకట మీనవల్లిపై యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (సెక్‌) కేసు నమోదు చేసింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన లాంగ్‌ఫిన్‌ కార్ప్‌ 2017, 2018 సంవత్సరాల్లో కృత్రిమ కమోడిటీస్‌ ట్రేడింగ్‌, బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత సొల్యూషన్స్‌ సహా క్రిప్టోకరెన్సీ లావాదేవీలను ఉద్దేశపూర్వకంగా చేపట్టిందని, ఈ కేసులో సంస్థ సీఈఓ వెంకట మీనవల్లి సహా మరొకొందరు ఇందుకు బాధ్యులని యూఎస్‌ అటార్నీ క్రెగ్‌ కార్పెనిటో తెలిపారు. ఈ తరహా అక్రమ లావాదేవీల పథకాలతో ఇన్వెస్టర్లు మోసం చేయటమే కాకుండా మోస పూరితంగా 6.6 కోట్ల డాలర్ల నకిలీ ఆదాయాన్ని సృష్టించారని గుర్తిం చినట్లు పేర్కొన్నారు. ఈ తరహా చర్యలతో 2017లో కంపెనీ షేరు ఏకంగా 2000 శాతం పెరిగింది. అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అయిన నాస్‌డాక్‌లో లాంగ్‌ఫిన్‌ కార్ప్‌ లిస్ట్‌ అయి కార్యకలాపాలను సాగిస్తోంది. ఒకవేళ వీరిపై ఈ ఆరోపణలు రుజువైతే 50 లక్షల డాలర్ల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నాస్‌డాక్‌ చర్యలకు ఉపక్రమించగా తాజాగా సెక్‌ కూడా కఠిన చర్యలను తీసుకునేందుకు సిద్ధమవుతోంది.