Sports

ఆ చిన్నారి కౌగిలింతే గొప్ప విజయం

Nicolas mahut gets pacified by his son

టెన్నిస్‌ ఆటగాళ్లకు గ్రాండ్‌స్లామ్‌ ఓ కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఏడాదంతా కష్టపడుతుంటారు. అంతటి గొప్ప టోర్నీలో ఏ ఒక్క రౌండ్‌లో ఓడిపోయినా క్రీడాకారుల బాధ వర్ణనాతీతం. తాజాగా జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు, గతేడాది డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్ విజేత నికోలస్‌ మహుత్‌ ఈ సారి మూడో రౌండ్‌లోనే టోర్నీ నుంచి వెనుదిరిగాడు. గత శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అర్జెంటినా ఆటగాడు లియోనార్డో మేయర్‌తో తలపడిన 37ఏళ్ల నికోలస్‌.. నాలుగు సెట్లు ఓడిపోయాడు. ఈ ఓటమితో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాల్సి రావడంతో నికోలస్‌ కోర్టులోనే భావోద్వేగానికి గురయ్యాడు. బెంచ్‌పై కూర్చుని కన్నీరుపెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు నికోలస్‌ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. తండ్రి భావోద్వేగాన్ని చూసిన నికోలస్‌ ఏడేళ్ల కుమారుడు నతనెల్‌ గ్యాలరీ నుంచి పరిగెత్తుకుంటూ కోర్టులోకి వచ్చి అతడిని హత్తుకుని ఓదార్చాడు. ఈ సన్నివేశం అక్కడి ఎంతోమంది హృదయాలను ద్రవింపచేసింది. నికోలస్‌పై గెలిచిన మేయర్‌ కూడా ఒకింత ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నాడు. ఈ తండ్రీ కొడుకుల బంధాన్ని చూసి గ్యాలరీ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన వారంతా లేచి నిల్చుని కరతాళధ్వనులతో నికోలస్‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.