DailyDose

తుడాకు ఎమ్మెల్యే చెవిరెడ్డి-రాజకీయ-06/07

Chevireddy Bhaskara Reddy Becomes TUDA Chairman - June 08 2019 - Daily Political News

*తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ(తుడా) ఛైర్మెన్ గా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం జగన్.. చెవిరెడ్డి నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా చెవిరెడ్డి తుడా ఛైర్మెన్ గా పనిచేశారు. ఆ తరువాత జగన్ వెంట నడిచి 2014 లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
* జడ్పీల్లో తెరాస ప్రభంజనం
తెలంగాణలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. జడ్పీ ఛైర్మన్ల ఎంపికలోనూ తెరాస హవా కొనసాగింది. 32 జిల్లాల్లోనూ తెరాస విజయ ఢంకా మోగించింది. నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన అధికార పార్టీ అభ్యర్థులు జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల్లోనూ సత్తా చాటారు. రాష్ట్రంలోని అన్ని జడ్పీలనూ తెరాస కైవసం చేసుకుంది. 20 జడ్పీ పీఠాల్లో మహిళలే చోటు దక్కించుకున్నారు. అన్ని జిల్లాల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవుల్ని తెరాస సొంతం చేసుకోవడంతో కార్యకర్తల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి.
* సచివాలయంలో జగన్‌కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు, వేదపండితుల ఆశీర్వచనం అనంతరం కీలక దస్త్రాలపై సీఎం సంతకం చేశారు. ఆశా వర్కర్ల వేతనం రూ.10వేలకు పెంపు దస్త్రంపై మొదటి సంతకం, అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి ఏపీ నుంచి అంగీకారపత్రంపై రెండో సంతకం, జర్నలిస్టుల సమగ్ర బీమా దస్త్రంపై మూడో సంతకం చేశారు. ఇవాళ్టి నుంచి సచివాలయం కేంద్రంగా సీఎం జగన్‌ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
* ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ దీక్ష
ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు నిరాహార దీక్షకు దిగారు. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ఇంచార్జి ఆర్సీ కుంతియా దీక్షను ప్రారంభించగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్‌, శ్రీధర్‌ బాబు, జీవన్‌రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్‌ తదితర పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా అశేష కాంగ్రెస్‌ శ్రేణుల ఇందిరాపార్కుకు తరలి వచ్చాయి. ఈ క్రమంలో గత కాంగ్రెస్‌తో పాటు మహాకూటమిలో భాగమైన పలువురు టీటీడీపీ నేతలు కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. టీజేఎస్‌ కన్వీనర్‌ కోదండరాం కూడా తన మద్దతు తెలిపారు.
* మన పాలన ఆదర్శంగా ఉండాలి: జగన్‌
మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తొలి సారిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన సీఎం పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘‘అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి ధృడ సంకల్పంతో ఉన్నాం. అనేక సవాళ్లను సైతం ఎదుర్కొని మంచి పనితీరు ప్రదర్శించే ప్రతిభ అధికారులకు ఉంది. అధికారులు తమకున్న పూర్తి అవగాహనతో సహకరించాలి.
* అన్ని వేళలా అందుబాటులో ఉంటా: రాహుల్‌
కేరళలోని ప్రతి వర్గం కోసం పనిచేస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. వయసు, ప్రాంతం, సిద్ధాంతాలు నిమిత్తం లేకుండా తనని వయనాడ్ ప్రజలు ఎప్పుడైనా కలవొచ్చని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. జాతీయ స్థాయిలో వివిధ వర్గాలపై చెలరేగుతున్న విద్వేషాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఓ వైపు ప్రజల సమస్యలపై గళం వినిపిస్తుంటే.. మోదీ మాత్రం విద్వేషాన్ని చిమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో ప్రజల మధ్య విభజనకు కారణమవుతున్నారన్నారు.
* జనసేనకు రావెల రాజీనామా
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రోజే జనసేన అధినేతకు ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు.
*రాజీనామా చేయించి.. ఎన్నికలకు వెళ్లాలి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా ప్రజల్లో బలం ఉంటే తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలు జరపాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి రామచంద్ర కుంతియా డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఎప్పటికైనా ఓటమి తప్పదనే భయం కేసీఆర్‌లో ఉందని.. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మటుమాయం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా సీఎల్పీని తెరాసఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ, టీపీసీసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో నియంతృత్వ విధానాలపై జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తామని కుంతియా చెప్పారు.
*32 జడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్‌లలోనూ సంపూర్ణ విజయం సాధించాలని, భారీ మెజారిటీతో అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. జడ్పీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలని, బలం ఉందనే ఉద్దేశంతో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపరాదని శుక్రవారం ఆయన సూచించారు. ఇప్పటికే 30 తెరాస జిల్లాపరిషత్‌ అధ్యక్ష స్థానాలకు అభ్యర్థులను సీఎం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై మంత్రులకు సమాచారం ఇచ్చారు. శనివారం పాలకమండలి సమావేశానికి వెళ్లేముందు ఆ పేర్లను వెల్లడించాలని సూచించారు.
*ఎంపీపీ పదవి ఇవ్వాలని ట్యాంక్‌ ఎక్కి నిరసన
తనకు ఎంపీపీ పదవి ఇస్తానని నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట తెరాస ఎంపీటీసీ సభ్యుడు సనప సోమేశ్‌ వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. సోమేశ్‌తోపాటు అతని భార్య, మండలంలోని 8 పంచాయతీల సర్పంచులు ట్యాంక్‌పైకి ఎక్కారు. హైదరాబాద్‌ శిబిరం నుంచి తెరాస ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం బయ్యారం మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్నారు.
*రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కొందరికి
అందరికీ న్యాయం చేస్తామంటూ భరోసా కల్పిస్తూనే పార్టీ కోసం కూడా పని చేయాలని వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్తవ్యబోధ చేశారు. ప్రభుత్వ పాలన ఎలా ఉండనుంది? పాలనలో పార్టీపరంగా ఎలాంటి సహకారమందించాల్సి ఉంటుందనే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో శుక్రవారం వైకాపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
*పొరుగు దేశాలకు ప్రాధాన్యం
భారతదేశం తన ఇరుగు పొరుగు దేశాల అభివృద్ధిని, సుస్థిరతను కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ‘పొరుగు దేశాలకు అగ్రతాంబూలం’ అనే సూత్రానికి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. మాల్దీవులు, శ్రీలంకల్లో శనివారం నుంచి తాను చేపట్టబోయే పర్యటన ఇందుకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను తన పర్యటన మరింత బలోపేతం చేస్తుందని శుక్రవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే.
*సచివాలయం నిర్మాణంపై సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వీహెచ్‌
పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మించాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. బైసన్‌పోలో మైదానంతోపాటు, ఎల్బీ స్టేడియాన్ని కూడా పూర్తిగా క్రీడల కోసమే వినియోగించాలని, అందులో ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలను నిషేధించాలని సీఎంను కోరారు.
*తెలంగాణలో ప్రతిపక్షం ఉండకూడదా?
‘‘తెలంగాణలో ప్రతిపక్షం ఉండకూడదా, ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్నట్లుగానే, దిల్లీలో తెరాస ఎంపీలు అక్కడి అధికార పార్టీ భాజపాలో చేరితే ఏం చేస్తారు, అప్పుడు వారి చేరికను తెరాస ప్రోత్సహిస్తుందా?’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను తెరాస అపహాస్యం చేస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. అంటే ప్రతిపక్షంలో ఉంటే పనులు జరగవని చెప్పినట్టేనన్నారు.
*రాజ్‌నాథ్‌ నివాసంలో కీలక మంత్రుల భేటీ
కొత్త లోక్‌సభ తొలి సమావేశాల విషయమై చర్చించేందుకు… హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కీలక మంత్రులంతా శుక్రవారమిక్కడ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఈనెల 17 నుంచి 26 వరకు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో… కొత్త సభ్యులకు సభా సంప్రదాయాలపైనా, స్థాయీ సంఘాలపైనా అవగాహన కల్పించడం; సభ్యులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లడం వంటి అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి.
*కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదు
కాంగ్రెస్‌ పార్టీ సొంత శాసనసభ్యుల విశ్వాసాన్ని కోల్పోయిందని తెరాస ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాఠోడ్‌, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు రామచందర్‌రావులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై అపారనమ్మకంతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం తమ పార్టీలో పనిచేయడానికి వారంతా ముందుకొస్తున్నారని చెప్పారు.
*ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం ఉండాలి: మమత
ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండు చేశారు. సుప్రీంకోర్టులన్యాయమూర్తుల నియామకానికి కొలీజియం ఉందని, ఆ తరహా వ్యవస్థనే ఎన్నికల కమిషనర్లకు వర్తింపజేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నియమించే ముగ్గురు కమిషనర్ల చేతిలో మొత్తం ఎన్నికల ప్రక్రియను ఉంచడం తగదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశాలకు హాజరుకావడం ‘నిష్ఫలం’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే తాను 15న జరగనున్న ఈ సంస్థ సమావేశానికి హాజరుకావడం లేదంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
*ఎన్డీయేలోనే కొనసాగుతాం: జేడీయూ
కేంద్ర మంత్రివర్గంలో చేరనంత మాత్రాన ఎన్డీయేతో మాకు విభేదాలున్నట్టు కాదని, బిహార్‌లో అధికార కూటమి కలిసికట్టుగానే ఉందని జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌చంద్ర ప్రసాద్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గ ఏర్పాటు తర్వాత ఎన్డీయేలో విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎన్డీయేతోనే జేడీయూ కొనసాగుతుందని శుక్రవారం ఆయనిక్కడ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకుగాను ఎన్డీయే 39 స్థానాలు గెలుచుకుంది.
*జమ్మూకశ్మీర్‌ ‘ప్రత్యేక హోదా’ రద్దు ఖాయం: కేంద్ర మంత్రి
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాంత హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం ఖాయమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ- భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా ఒకమాట అన్నారంటే దానిని కచ్చితంగా చేసి తీరతారని చెప్పారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రాంత హోదాను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా షా హామీ ఇచ్చారు. మంత్రి దీనిని ప్రస్తావిస్తూ… షా చెప్పినట్టే త్వరలో జరుగుతుందన్నారు.
*విలీనం అప్రజాస్వామికం: కత్తి వెంకటస్వామి
కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని (సీఎల్పీ) తెరాస శాసనసభా పక్షంలో విలీనం చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ ఓబీసీ విభాగం ఛైర్మన్‌ కత్తి వెంకటస్వామి అన్నారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ దిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట శుక్రవారం ఆయన నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజలు తెరాసకు మంచి మెజారిటీ ఇచ్చినా, కాంగ్రెస్‌ శాసనసభ్యులను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం దారుణమన్నారు.
* అధికార కన్జర్వేటివ్‌ పార్టీ (టోరీ) నాయకురాలిగా బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే శుక్రవారం రాజీనామా చేశారు. తదుపరి వ్యక్తి బాధ్యతలు చేపట్టే వరకు ప్రధాని పదవిలో కొనసాగనున్నారు. బ్రెగ్జిట్‌ వ్యవహారంలో తన విధానాలకు మద్దతు లభించకపోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ఆమె గత నెల 23నే ప్రకటించడం గమనార్హం. అందులో భాగంగా తొలుత కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశారు.