Kids

గుజరాత్‌లో డైనోసార్ పార్క్

Indias first dinosaur park opens in Gujarat

భారతదేశంలోనే తొలిసారిగా రాక్షస బల్లుల శిలాజాల పార్కును గుజరాత్‌లోని మహిసాగర్‌ జిల్లాలో ప్రారంభించారు. బాలానిసోర్‌ సమీపంలోని రాయ్‌యోలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పార్కు మన దేశంలోనే తొలి డైనోసార్‌ పార్క్‌ అని, ప్రపంచంలో మూడోదని తెలిపారు. ఐక్యతకు చిహ్నంగా నిలిచిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం తర్వాత , ఈ పార్కు గుజరాత్‌ రాష్ట్రానికి మరో కలికితురాయిగా నిలుస్తుందని అన్నారు. అధునాతనమైన టెక్నాలజీ ఈ పార్క్‌ సొంతం. త్రీడీ ప్రొజెక్షన్‌, విర్చువల్‌ రియాలిటీ కూడిన ప్రదర్శనలు ఇవ్వనున్నారు. డైనోసార్ల జీవిత పరిణామక్రమంతో పాటు, రాక్షసబల్లుల ప్రతిరూపాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 10 గ్యాలరీలు ఉన్నాయి. దాదాపు 65 మిలియన్‌ ఏళ్లనాటి రాక్షసబల్లుల చరిత్రను ఇక్కడ పొందుపరిచారు. ఇది విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు సమాచార సంగ్రహణిగా ఉపకరిస్తుందని విజయ్‌ రూపాని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలానిసోర్‌లో 1980 ప్రాంతంలో పలు డైనోసార్‌ శిలాజాలు, వాటి గుడ్లు దొరికిన విషయం తెలిసిందే.