Sports

నిబంధనలు పాటించాల్సిందే

Rules exist for strict enforcement says Gavaskar over Dhoni gloves issue

క్రికెట్‌లో నియమ నిబంధనలు ఉన్నవి పాటించేందుకే అని, అందుకే వాటిని పెట్టారని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ధోనీ గ్లోవ్స్‌ విషయంలో చెలరేగిన వివాదంపై ఆయన స్పందించాడు. గావస్కర్‌ మాట్లాడుతూ ధోనీ ఏది వేసుకున్నా తనకు అభ్యంతరం లేదని, ఆయన ఆడినంత కాలం మైదానంలో ఎలా అలరించాడోననేదే ముఖ్యమని తెలిపాడు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వికెట్‌ కీపింగ్‌ చేసే సమయంలో ధోనీ చేతి గ్లోవ్స్‌పై భారత ఆర్మీకి చెందిన బలిదాన్‌ చిహ్నం కనిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడిన సన్నీ.. నియమ నిబంధనలు ఉన్నవి పాటించేందుకేనని, అందుకే వాటిని పెట్టారని చెప్పాడు. 2014లో ఇంగ్లాండ్‌ కీపర్‌ మోయిన్‌ అలీ ఉద్దేశపూర్వకంగా చేతి బాండ్‌ ధరించాడని తెలిసి ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అతడికి జరిమానా విధించిందని గుర్తుచేశాడు. ఒకవేళ ధోనీ ఆ గ్లోవ్స్‌ ధరించేందుకు అనుమతిస్తే.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా వారికి నచ్చినట్టు వ్యవహరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అయితే ఈ వివాదం వల్ల టీమిండియాకి ఎలాంటి నష్టం లేదని, ధోనీకి ఎలా వ్యవహిరించాలో తెలుసని అన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం ఓవల్‌ వేదికగా టీమిండియా రెండో వన్డేకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కంగారూలపై మరో విజయం సాధిస్తే న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌తో ఆడేముందు పూర్తి ఆత్మవిశ్వాసం నెలకొంటుంది.