ScienceAndTech

ఇక హువావే ఫోన్లు ఇటుకలుగా వాడుకోవచ్చు

Social Media Giant Facebook Bans Huawei From Its Supported Devices List

చైనాకు చెందిన టెలికాం దిగ్గజం హువావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్‌ సహా పలు టెక్‌ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని తెలిపాయి. కాగా, ఇప్పుడు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌లుగా లభించవు. తప్పక డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. అయితే, ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్‌డేట్స్‌ ఇస్తామని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లాంటి సామాజిక మాధ్యమ యాప్‌లు కొత్త మొబైల్స్‌లో ప్రీ-ఇన్‌స్టాల్‌ అయి రావడానికి ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. ఇటు మొబైల్‌ కంపెనీలకు, అటు సోషల్‌మీడియాకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా, హువావేలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, బుకింగ్‌.కామ్‌ వంటి యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌ అయి వస్తుంటాయి. ఫేస్‌బుక్‌ నిర్ణయంపై ట్విటర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇటీవల గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్‌ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు. ప్రస్తుతం హువావే ఫోన్లు కొనుగోలు చేయాలనకున్న వారికి ఫేస్‌బుక్‌ ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా లభించదు. అయితే, గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వారు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కానీ, 90రోజుల తర్వాత గూగుల్‌ ప్లేస్టోర్‌ యాక్సెస్‌ను కూడా హువావే కొత్త ఫోన్లకు ఇవ్వదు. దీంతో ఆయా మొబైల్స్‌ కొనుగోలు చేసేవారికి ఫేస్‌బుక్‌ వినియోగించడం కష్టమే.