Health

ప్రతిరోజు బరువు చూసుకోవడమే అసలైన కిటుకు

Check your weight daily to lose weight daily and easily

కొంతమంది బరువు పెరిగిపోతున్నాం… అంటుంటారు. తగ్గించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు కానీ పెద్దగా ఫలితం కనిపించదు. కానీ ఓ చిన్న చిట్కా ద్వారా పెరుగుతోన్న బరువును నియంత్రించుకోవచ్చు, తగ్గనూ వచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకి చెందిన పరిశోధకులు. సాధారణంగా ఎవరైనాగానీ ఏడాదికి అరకిలో నుంచి కిలో వరకూ పెరుగుతుంటారట. కానీ ఊబకాయం వచ్చేవాళ్లలో మాత్రం ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకే సదరు పరిశోధకులు 18-65 ఏళ్ల వయసులోపు వందమంది వ్యక్తుల్ని ఎంపికచేసి మూడు విభాగాలుగా చేసి, మీకిష్టమైన పద్ధతుల్ని అవలంబించండి. కానీ మూడునెలల్లో బరువు తగ్గాలి అన్న షరతు విధించారట. నెలకోసారి మాత్రం వాళ్లేం పద్ధతులు అవలంబిస్తున్నారో ఎంత తగ్గారో చూసి వెళ్లేవారట. చిట్టచివరగా అందరినీ పరిశీలించగా- వాళ్లలో ప్రతిరోజూ బరువు చూసుకునేవాళ్లలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించిందట. అంటే- బరువు చూసుకోవడంవల్ల వాళ్లు ఆ మర్నాడు తక్కువ తినడం లేదా ఎక్కువ వ్యాయామం చేయడం వంటివి చేశారని అర్థమవుతోంది. దీన్నిబట్టి ఏ రోజుకారోజు మనకు మనమే బరువు చూసుకోవడం వల్ల ఎంత పెరిగాం, ఎంత తగ్గాం అన్నదానితోబాటు మన శరీరానికి ఏ పద్ధతులయితే సరిపోతాయి అనేదానిమీద చక్కని అవగాహన ఏర్పడటం ద్వారా బరువుని నియంత్రించుకోవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.