ScienceAndTech

ఇక మీ వేగం గూగుల్ చేతిలో

Google maps introduces speedometer into its Maps service

ఏదైనా నగరంలో ఓ కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే నానా హైరానా పడేవారు. దారి తెలియకపోతే తిప్పలు పడాల్సిందే. గూగుల్‌ మ్యాప్స్‌ పుణ్యమా అని ఆ బాధ తప్పింది. అంతగా వినియోగదారులను చేరువైన గూగుల్‌.. మరిన్ని ఫీచర్లను జోడిస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పుడు మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను గూగుల్‌ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే స్పీడో మీటర్‌. ఇప్పటి వరకు రూట్‌ తెలుసుకోవడానికి మాత్రమే పరిమితమైన గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై మనం వాహనంపై వెళ్లే వేగం కూడా చూపించనుంది. అయితే, ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. అమెరికా, యూకే, యూరప్‌, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో వచ్చినట్లు వార్తలు వస్తున్నా.. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. త్వరలో అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే మీరు వాహనం నడిపేటప్పుడు ఎంత వేగంతో వెళుతున్నారో చూడొచ్చు. అంతేకాదు నిర్దేశించిన వేగం దాటిన తర్వాత మీకు హెచ్చరికలు కూడా గూగుల్‌ మ్యాప్స్‌ జారీ చేస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో నేవిగేషన్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే డ్రైవింగ్‌ ఆప్షన్‌ దగ్గర స్పీడో మీటర్‌కు సంబంధించిన సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. దాన్ని ఎనేబుల్‌ చేసుకుంటే డిస్‌ప్లేపై స్పీడో మీటర్‌ను పొందొచ్చు. అయితే, ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన వారికి మాత్రమే తెరపై కనిపిస్తాయి. ఓ సారి మీరూ చెక్‌ చేయండి.