Editorials

అమెరికాపై ఆసక్తి తగ్గుతోంది

Indian techie losing interest on USA jobs

భారత్‌లో టెక్నాలజీ చదువకున్న ఎవరికయినా విదేశాలే పరమావధి. ఇక్కడ చదువుకున్నప్పటికీ అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగాలు చేయాలని కొందరు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో భారతీయ యువతకు అగ్రరాజ్యం మీద ఆసక్తి తగ్గుతోందట. ఇందుకు కారణం అక్కడి వీసా విధానాలు, ఉద్యోగం పొందటానికి పెట్టిన కఠిన నిబంధనలేనని ఓ సర్వే తేల్చింది. 2018 నుంచి 2019 మార్చి వరకు చూసుకుంటే అమెరికాలో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 9.6% నుంచి 9.3%కు తగ్గిపోయింది. వలస విధానాల మీద అమెరికా విధించిన నిబంధనలు, వీసా విధానాల నియమాలే ఇందుకు కారణం. భారతీయ యువత ఆసక్తి చూపించనప్పటికీ ఇతర దేశాలు మాత్రం అమెరికాలో ఉద్యోగం కోసం బాగానే ఉబలాటపడుతున్నాయి. సాధారణంగా అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లే దేశాల్లో భారత్‌, పాకిస్థాన్‌, యూకే దేశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో జర్మనీ, ఫిలిప్పీన్స్‌, రష్యా, ఫ్రాన్స్‌ వంటి దేశాల యువత కూడా ఆసక్తి చూపుతున్నాయని ఇండీడ్‌ ఎకనమిస్ట్ ఆండ్రూ ఫ్లవర్స్‌ అనే సంస్థ తెలిపింది. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తమ సామాజిక మాధ్యమాల వివరాలు కూడా జత చేసేలా అమెరికా ఇటీవల కొత్తనియమాలను తీసుకొచ్చింది. నిజానికి ఈ నియమం గురించి గతేడాదే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రజాభిప్రాయం సేకరణ జరిపి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియమం ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ఈ నియమం నుంచి ద్వైపాక్షిక, అధికారిక వీసాదార్లకు మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం, విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం తప్పని సరిగా సోషల్‌ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే.