Sports

డజను టైటిళ్లు ఒళ్లో వేసేసుకున్నాడు

Rafael Nadal Wins French Open For The 12th Time

చందమామ, వెన్నెల్లా.. వాన చినుకు, మట్టివాసనలా.. కొన్ని బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి! రఫెల్‌ నాదల్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మధ్య ఉన్న అనుబంధం అలాంటిదే.. క్యాలెండర్‌ తిరుగుతున్నా.. ప్త్యర్థులు మారినా..ఆ టైటిల్‌ చూసేది అతనివైపే. అడ్డంకులు ఎదురైనా..ఆగిపోయేలా కనిపించినా.. అతని అడుగులు తుదకి చేరేది ఆ గమ్యాన్నే! తన్మయత్వంతో ముద్దాడేది ఆ ట్రోఫీనే. ఫ్రెంచ్‌ ఓపెన్లో పదకొండుసార్లు చూసిన ప్రేమ గాథ మరోసారి ఆవిష్కృతమైంది. అంచనాలను కొనసాగించిన నాదల్‌ మరోసారి ఫ్రెంచ్‌ వీరుడయ్యాడు. రికార్డు స్థాయిలో పన్నెండో సారి ట్రోఫీని ముద్దాడాడు. ఎర్రమట్టిలో తనకు తిరుగులేదని సగర్వంగా చాటాడు. తుదిపోరులో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించిన నాదల్‌ ఎర్రకోటలో తనను కొట్టేవాడెవరూ లేరని మరోసారి చాటాడు. ఊహించేందే… మరోసారి తన ఎదను దోచిన వీరుడుకే ఫ్రెంచ్‌ ఓపెన్‌ దాసోహమైంది. స్పెయిన్‌ టెన్నిస్‌ దిగ్గజానికే ఎర్రమట్టి కోర్టు సలామ్‌ కొట్టింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 6-3, 5-7, 6-1, 6-1 తేడాతో నాలుగో సీడ్‌ థీమ్‌పై విజయం సాధించి వరుసగా మూడో ఏడాదీ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన నాలుగు సెట్ల పోరులో నాదల్‌ పైచేయి సాధించాడు. మరోవైపు వరుసగా రెండో ఏడాది కూడా థీమ్‌కు నిరాశ తప్పలేదు. నిరుడు కూడా తుదిపోరు చేరిన థీమ్‌.. నాదల్‌ చేతిలోనే ఓటమి పాలయ్యాడు. టైటిల్‌ పోరును ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా ప్రారంభించారు. తొలి సెట్‌లో చెరో గేమ్‌ గెలుస్తూ పోయారు. దాంతో ఓ దశలో స్కోరు 3-3 సమమైంది. ఈ దశలో దూకుడు పెంచిన నాదల్‌ వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకొని సెట్‌ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌ కూడా పోటాపోటీగానే సాగింది. 5-5తో స్కోరు సమమైంది. ఈసారి థీమ్‌ లయ అందుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి సెట్‌ దక్కించుకున్నాడు. అతనికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా పోయింది. ఎందుకంటే అక్కడి నుంచే నాదల్‌ మరింత తీవ్రతతో ఆడడం మొదలెట్టాడు. గేరు మార్చి దూకుడు పెంచాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో చెలరేగాడు. వరుస గేమ్‌లు గెలుస్తూ దూసుకెళ్లాడు. మరోవైపు థీమ్‌ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపించాడు. అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి వెనకబడడాన్ని సొమ్ము చేసుకొన్న నాదల్‌ మరింతగా చెలరేగాడు. వరుసగా మూడు, నాలుగు సెట్లను నెగ్గి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. మూడు ఏస్‌లు సంధించిన నాదల్‌.. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. 38 విన్నర్లు కొట్టాడు. 38 అనవసర తప్పిదాలు చేసిన థీమ్‌ మూల్యం చెల్లించుకున్నాడు.

1 – ఒక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఒకే కోర్టులో 12 సార్లు గెలుచుకొన్న ఏకైక ఆటగాడు నాదల్‌. మార్గరెట్‌ కోర్ట్‌ 12 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలిచినా అవి వివిధ వేదికల్లో ఆమె సొంతమయ్యాయి.

18 – రఫా నెగ్గిన మొత్తం గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు. రోజర్‌ ఫెదరర్‌ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లున్నాయి.

12 – నాదల్‌ గెలిచిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్ల సంఖ్య. టోర్నీలో ఫైనల్‌ చేరిన ప్రతిసారి అతను విజేతగా నిలిచాడు