Kids

చీకటి రక్తం బల్లుల కన్నా పరీక్షలంటే దడిసిపోతున్న చిన్నారులు

Students In Telugu States Scared Of Exams More Than Anything

చీకటంటే భయం, రక్తమంటే భయం, బల్లులంటే భయం… ఇలా పిల్లల్లో రకరకాల చిన్నాచితకా భయాలుండటం సహజం. అయితే మన తెలుగు ప్రాంత పిల్లలను మాత్రం వీటన్నింటినీ మించి మరో పెద్ద విషయం ఎక్కువగా భయపెడుతోంది. అదేమిటో తెలుసా? తాజాగా జరిగిన ఓ సర్వే.. మన ప్రాంత పిల్లలను మిగతా అన్నింటికంటే కూడా పరీక్షలే ఎక్కువగా భయపెడుతున్నాయన్న ఆందోళనకర వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది! విద్యార్ధుల ఆత్మహత్యల వార్తలు తరచూ కలచివేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం మరింతగా పెరుగుతోంది. భయం.. సహజం! పిల్లల నుంచి పెద్దల వరకూ.. ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని భయాలు సాధారణంగా కనిపించేవే. అయితే కొన్నిసార్లు ఈ భయాలే పెనుభూతంగా తయారై చివరికి ప్రాణాల మీదికి కూడా తెచ్చిపెడుతుంటాయి. అందుకే పిల్లల్లో పేరుకుంటున్న భయాలేమిటో చిన్నతనంలోనే గుర్తించి, వాటిని తొలగించే ప్రయత్నం చెయ్యటం చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక సర్వే నిర్వహించారు. దీనిలో మన ప్రాంతంలోని పిల్లలను ఎక్కువగా భయపెడుతున్నది పరీక్షలేనని తేలటం కీలకమైన అంశం. కొన్నిచోట్ల అయితే అసలు పరీక్షల పేరు చెబితేనే పిల్లలు కంపించిపోతున్నారని గుర్తించారు. సర్వేలో భాగంగా ఒక ప్రాంతంలోని పిల్లలనే పలకరించినా చాలా ప్రాంతాల్లో ఒకేరకం పరిస్థితులు నెలకొనటం, మన పిల్లల్లో భయాలకు సంబంధించి మన దగ్గర ఎలాంటి సమాచారం లేని నేపథ్యంలో ఈ సర్వే మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటోంది.

గతేడాది గుంటూరు జిల్లాల్లో ముగ్గురు విద్యార్ధులు తరగతి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరు ముగ్గురూ 8-10 తరగతులు చదువుతున్నవాళ్లే. ముగ్గురూ కూడా ఇంటి నుంచి రోజూలాగే బడికి వెళ్లి.. అక్కడ ఆత్మహత్య చేసుకోవటంతో వీరి మరణాలు సంచలనమే కాదు, పెద్ద చర్చనీయాంశం కూడా అయ్యాయి. తరచి చూస్తే ముగ్గురిలో ఇద్దరు పరీక్షలంటే భయంతో చనిపోయారని, ఒకరు చదివినా గుర్తుండటం లేదన్న ఆందోళనతో చనిపోయినట్లు వెల్లడైంది. ఇది రాష్ట్రంలోని పలువురు మానసిక వైద్యులను కూడా కలచివేసింది. ఈ నేపథ్యంలో అసలు పాఠశాల వయసు విద్యార్ధుల్లో ఎలాంటి భయాలు ఉంటున్నాయి? వీటిని నివారించేందుకు మనమేదైనా చెయ్యొచ్చా? అన్న ఆలోచనతో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సీనియర్‌ ఆచార్యులు పొదిలి శంకర పిచ్చయ్య సర్వే చేపట్టారు. గుంటూరు జిల్లా ఐదారు మండలాల్లోని 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకుని దాదాపు 5 నెలల పాటు నేరుగా పిల్లలతో గడిపారు. ఈ క్రమంలో 8-10వ తరగతి చదువుతున్న 3379 మందిని పలకరించి.. వీరిలో నెలకొన్న భయాలేమిటన్నది గుర్తించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరంగా ఎక్కువ మంది పిల్లలు పరీక్షలు, చదువుంలంటే భయపడుతున్నట్లు గుర్తించటం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశం.

ఈ సర్వేని ఒక ప్రాంతంలో, కొద్ది మండలాల పరిథిలోనే నిర్వహించి ఉండొచ్చు. ఎన్ని పరిమితులున్నా కూడా మన ప్రాంతంలోని పిల్లల్లో ప్రత్యేకించి ఎటువంటి భయాలు నెలకొన్నాయన్నది తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంగా ఈ సర్వే కొన్ని కొత్త విషయాలను పైకి తెచ్చింది. ముఖ్యంగా ఈ సర్వేలో అత్యధికంగా దాదాపు 41% మంది పిల్లలు పరీక్షలంటే భయపడుతున్న వాస్తవం వెల్లడైంది. పరీక్షల్లో సరైన ప్రతిభ కనబరచలేకపోతే ఇంట్లో వాళ్లు, ఉపాధ్యాయులు తిడతారనో, కొడతారనో భయ పడుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాగే ఇతరత్రా భయాలు కూడా ఇబ్బంది పెట్టేవే. మనసుల్లో ఈ భయాలు గూడుకట్టుకుపోతే పిల్లలు పెద్దయిన తర్వాత ఉద్యోగంలో రాణించటం వంటివి కూడా సమస్యగానే తయారవుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

విద్యార్థి దశలో ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతున్న భయం ఇదే. కొందరిలో ఈ భయం పరీక్ష తేదీలు తెలిసినప్పటి నుండే మొదలవు తుండగా మరికొందరికి పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ బలపడుతోంది. పరీక్ష హాల్లోకి ప్రవేశించి, ఒక్కొక్క ప్రశ్న చదువుతున్న కొద్దీ భయానికి లోనయ్యే వాళ్లు కూడా ఎక్కువే. భయం ఎప్పుడు మొదలైనా రాయటం మొదలు పెట్టాక కొందరికి చదివింది చక్కగా గుర్తుకొస్తుంది. వారికి పెద్ద సమస్య ఉండదు. కానీ కొందరికి ఎంత కష్టపడినా చదివింది గుర్తుకురాదు. వీరికి భయం వల్ల మనసు మొద్దుబారిపోతుంది. ఇలాంటి భయాలు ఉన్నవారికి పరీక్షలు ముగిసే వరకూ తిండి, నిద్ర కూడా సరిగా ఉండవు. సంతోషంగా ఉండలేరు. ఏం చెయ్యాలి: ముందు ఇలాంటి భయం ఉన్న వాస్తవాన్ని గుర్తించాలి. వీరికి ప్రశాంతమైన వాతావరణంలో, మార్కులతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించి, ధైర్యం చెబుతుంటే మెల్లగా భయాలు వీడిపోయి నింపాదిగా పరీక్షలు రాయటానికి అలవాటు పడతారు. ఇలా పలుమార్లు చెయ్యటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి లేకుండా చూడాలి. చదువు కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమేనని అర్థమయ్యేలా చెయ్యాలి. అదే సమయంలో ఏడాదంతా సరదాగా గడిపి పరీక్షల ముందు హడావుడి చెయ్యటం సరికాదని తెలియజెప్పాలి. ఇలాంటి వారిని మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా చదివించాలి. చదువుతో పాటు సంగీతం, ఆటలు, పాటల వంటి ఏదో ఒక విషయం పట్ల ఆసక్తి కలిగిస్తే భయాలూ తగ్గుతాయి.

ఎత్తులు ఎక్కడమన్నా, ఎత్తు మీదికి వెళ్లటమన్నా భయపడేవాళ్ల సంఖ్య ఎక్కువే. దీన్నే ‘యాక్రోఫోబియా’ అంటారు. వీళ్లు ఎత్తెన ప్రదేశం నుండి కిందకు చూస్తే కళ్లు తిరుగుతాయి. వీరిలో కొందరు ఉయ్యాల ఎక్కడానికి కూడా భయపడతారు. వీరితో.. కొద్దిఎత్తుతో ప్రారంభించి మెల్లమెల్లగా ఎక్కువ ఎత్తు ఎక్కడం సాధన చేయించటం ద్వారా ఈ భయాన్ని అధిగమించొచ్చు. చీకటిలో ఉండాలంటే వణికిపోవటాన్ని యాక్లుఫోబియో అంటారు. చీకటి గదిలో ఒంటరిగా ఉండాలన్నా, అనుకోకుండా కరెంటు పోయినా ఉక్కిబిక్కిరైపోతారు. రాత్రి కూడా లైటు లేకుండా నిద్రపోలేరు. దీంతో ఇతరులకూ ఇబ్బందికరంగా తయారవుతారు. సాధన ద్వారా తేలికగా పోగొట్టే వీలున్న భయం ఇది. పెద్దలు తోడుగా ఉండి గదిలో పిల్లలను ఒంటరిగా కూర్చోబెట్టడం ద్వారా వారిని ఈ భయం నుంచి బయటకు తీసుకురావొచ్చు. కొందరు రక్తం చూస్తూనే భయంతో నిరుత్తరులైపోతారు. ప్రాణం పోయినా సరే, ఇంజెక్షన్‌ చేయించుకోనంటారు. ప్రమాద ఘటన చూస్తూనే కళ్లు తిరిగి పడిపోతారు. ఇంజెక్షన్‌ చేయించుకునే పిల్లల్ని చూపించటం, టీవీలో రోజువారీ ప్రమాద ఘటనల చూపించటం ద్వారా ఈ భయాన్ని పోగొట్టచ్చు. ప్రయాణమంటే అకారణంగా భయానికి లోనవుతుంటే ‘హోడోఫోబియా’ అంటారు. కొందరికి విమాన ప్రయాణమంటే భయమైతే మరికొందరు రైలు, బస్సు ప్రయాణాలకు కూడా భయపడుతుంటారు. ఈ భయాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా పోగొట్టొచ్చు. తల్లిదండ్రులు పిల్లలను వెంటబెట్టుకుని ఆటో, బస్సుల్లో ప్రయాణించటం వంటివి అలవాటు చేయాలి. కొంతమందికి రాత్రి పడుకుంటూనే భయంకర కలలు వస్తుంటాయి, కొన్నిసార్లు ఇలాంటి కలలు వస్తాయన్న భయం కూడా చుట్టుముడుతుంటుంది. దీన్ని ‘ఒనిరోఫోబియా’ అంటారు. కలలు మన మానసిక స్థితికి అద్దంపడతాయని ప్రఖ్యాత మనస్తత్వ విశ్లేషకుడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ విశ్లేషించారు. కలల భయాలున్న వారిలో ఆందోళనా ఎక్కువగానే ఉంటుంది. ఏం చెయ్యాలి: పడుకునే ముందు మనసుకు ప్రశాంతతను కలిగించే పుస్తకాలు చదువటం, సంగీతం వినటం, స్నేహితులతో ఉల్లాసకరమైన అంశాలు పంచుకోవంటివి చెయ్యాలి. ధ్యానం కూడా ఇందుకు ఉపయోగపడుతుంది.