Kids

మనమంతా నిమిత్తమాత్రులం

Telugu Kids Story - Always Keep Praying And Do Your Best As You Can

రాముకి రాత్రి 9 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఎలర్జీ వచ్చింది. ఇంటిదగ్గర మందులు లేవు. రాము తప్ప ఇంట్లో ఎవరూ లేరు. భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. రాము ఒక్కడే ఉన్నాడు. డ్రైవర్ కూడా తన ఇంటికి వెళ్లిపోయాడు. వర్షాకాలం కనుక బయట కొద్దిగా వాన పడుతున్నది. మందుల షాపు ఎక్కువ దూరం లేదు. నడుచుకుంటూ కూడా వెళ్ళగలడు. కానీ వాన పడుతున్నది కనుక రాము రిక్షా కోసం చూడగా, పక్కనే రాముని గుడి దగ్గర ఒక రిక్షా అతడు భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. రాము అతడిని వస్తావా? అని అడిగాడు. అతను వస్తాను అని తల ఊపంగానే రాము రిక్షా ఎక్కేడు. రిక్షా అతను చాలా అనారోగ్యంగా కనిపించాడు. అతని కళ్ళల్లో కన్నీరు కూడా ఉంది. ఏమైంది నాయనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒంట్లో బాగోలేదా? అని అడిగాడు. వర్షాల వల్ల మూడు రోజుల నుండి కిరాయి దొరకలేదు అయ్యా! ఆకలిగా ఉంది. కడుపులో నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడే భగవంతుని ప్రార్థిస్తున్నాను. భోజనం పంపించు నాయనా అని, అని అతడు చెప్పాడు. రాము ఏమీ మాట్లాడకుండా రిక్షా దిగి మందుల షాపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాము అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు. భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం పంపలేదు కదా? ఎందుకంటే ఇదే ఎలర్జీ అరగంట ముందు వచ్చి ఉంటే నేను డ్రైవర్ని పంపేవాడిని. రాత్రి బయటకు పోవటం నాకు అవసరం ఉండేది కాదు. మనసులో భగవంతుని అడిగాడు- నన్ను ఈ రిక్షావానికి సహాయార్థం పంపావు కదా? అని జవాబు ‘అవును’ అని వచ్చింది. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని, తన మందులతో పాటు రిక్షావాని కోసం కూడా మందులు తీసుకొన్నాడు. పక్కనే ఒక చిన్న రెస్టారెంటులో బిర్యాని కొని, ప్యాక్ చేయించి, తీసుకుని వచ్చి రిక్షావాని చేతిలో కొంత డబ్బుపెట్టి, బిర్యానీ, మందులు ఇచ్చి, ఈ ఆహారం తిని ఈ మందులు వేసుకో! అని అన్నాడు. అప్పుడు రిక్షా అతను ఏడుస్తూ అన్నాడు- నేను భగవంతుడిని ఆకలిగా వుంది కొంచెం అన్నం పెట్టు నాయనా!అని అడిగాను. ఆయన నాకు బిర్యానీ పెట్టాడు. చాలా కాలం నుంచి నాకు ఇది తినాలి అని కోరిక కలిగింది. ఈరోజు భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. అని ఇంకా ఏవేవో మాటలు చెప్తూ ఉండిపోయాడు. రాము స్తబ్ధతగా వింటూ ఉండిపోయాడు. ఇంటికి వచ్చి ఆలోచించాడు – ఆ రెస్టారెంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. స్వీట్లు,టిఫిన్లు, భోజనం… కానీ, నేను బిర్యానీని మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం నన్ను పంపాడు అని అనుకుని హృదయ పూర్వకముగా దేవునికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు. మనము ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన వేళకు చేరితే భగవంతుడు అతని ప్రార్థన విన్నాడు అని అనుకోవాలి . మనను తనకు ప్రతినిధిగా పంపాడు అని గ్రహించాలి! కాకతాలీయంగా జరిగిందని కొట్టిపారేయ్యడం మూర్ఖత్వం. మనకు కాకతాలీయంగా అనిపించినప్పటికి అవన్నీ సర్వజ్ఞుడైన భగవంతుని ఆజ్ఞానుసారం సంభవించే పరిణామాలే నని గుర్తించాలి. కనుక మనం నిరంతరమ్ ఓ భగవంతుడా! ఎల్లప్పుడూ నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రీ! అని ప్రార్ధిస్తూ వుండాలి.