Business

విశాఖకు రెండో విమానాశ్రయం

Visakhapatnam To Get Another Second Airport

పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రధాన నగరాల్లో రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పౌరవిమానయాన శాఖ యోచిస్తోంది. విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూమిని అట్టే పెట్టి ఉంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఛైర్మన్‌ గురుప్రసాద్‌ మొహపాత్ర వెల్లడించారు. దేశంలో విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల ప్రధాన నగరాల్లో రెండో విమానాశ్రయం అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏఏఐ దేశంలో 125 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇందులో 11 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఒక కొత్త విమానాశ్రయం నిర్మించాలంటే కనీసం 2000 ఎకరాల భూమి అవసరమని మొహపాత్ర అన్నారు. నగరానికి సమీపంలో భూమి చూడాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాలకు లేఖ రాశామని, ఆయ ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాలు ఏర్పడకుండా నియంత్రణ విధించాల్సిందిగా కోరామని వెల్లడించారు. ఇప్పటికే ముంబయి, దిల్లీల్లో రెండో విమానాశ్రయం ఉండగా, త్వరలో విశాఖపట్నంలోనూ రెండోది ఏర్పాటు కానుందని తెలిపారు.. కోల్‌కతా, చెన్నై, పుణె వంటి ఇతర నగరాల్లో సైతం రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల నిలిపివేత వల్ల వివిధ విమానాశ్రయాల్లో దాదాపు 700 స్లాట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు.