Devotional

మీకు మీరే వెతుక్కోండి

June 10 2019 - Daily Devotional News - Chinajeeyar says one should search within themselves

1.మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి – తదితర ఆద్యాత్మిక వార్తలు
అంబర్ పేట లోని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆలాయ్మ్లో ప్రత్యెక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణ కుమ్భంతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత అంబార పేట నియోజకవర్గం తులసీ రాం నగర్, లంక బస్తీలలో పాదయాత్ర నిర్వహించారు కిషన్ రెడ్డి.

2. ధర్మచక్రాన్ని రక్షించే బాధ్యత మోదీకిచ్చారు
గత ఐదేళ్లుగా ఎన్డీయే అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆమోదం తెలిపారని, భారత ధర్మచక్రాన్ని రక్షించే బాధ్యతను మోదీకిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రేణిగుంట విమానాశ్రయం వద్ద భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాధన్యవాద సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు చక్రం తిప్పుతామంటూ ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దిల్లీలో ఉండేది ఒకటే చక్రం. మోదీ రెండోసారి అధికారంలోకి రారని విశ్లేషకులు ప్రచారం చేసినా ప్రజల అండతో ఆయనే తిరిగి ధర్మచక్రాన్ని స్వీకరించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై గతంలో హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ తగిన చర్యలు చేపట్టారు. ఇప్పుడు అమిత్‌ షా సైతం ఆంధ్రా ప్రజలకు తగిన న్యాయం చేస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నాం. దేశంలో కాంగ్రెస్‌ కనుమరుగవుతున్న పార్టీ. తెదేపాకు పురోగతి లేదు. ఇప్పుడు నందమూరి ఆశయాలు లేవు.ఉన్నవన్నీ నారావారి ఆశయాలే. చంద్రబాబు రాహుల్‌గాంధీ కాళ్ల దగ్గర ఏపీని తాకట్టుపెట్టారు. తెలుగు ప్రజల ప్రతినిధిగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన నాకు మోదీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొస్తా’’ అని అన్నారు.

3. వేదాలకు అర్థాన్ని భక్తుల గుండెల్లో వెతకండి
వేదాలకు అర్థాన్ని భక్తుల గుండెల్లో వెతకాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో అన్నమాచార్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో యువ ఆధ్యాత్మిక గాయకుడు అన్నమయ్య పవన్‌ సారథ్యంలో ‘శ్రీహరి పదార్చన’ నిర్వహించారు. వేయి మంది శిష్య బృందంతో సహస్ర గళ సంకీర్తార్చన మధ్య వేంకటేశ్వరుడి కల్యాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. 12వ శతాబ్దంలో పాండవుల కృష్ణమాచార్యులు పాడుతుంటే సింహాద్రి అప్నన్న నాట్యమాడేవారని తెలిపారు. మనసులో భగవంతుడిపై ప్రేమ పొంగితే అది పాటగా మారుతుందని, అదే ఆనంద ప్రవాహమవుతుందన్నారు.

4. ఘనంగా శ్రీవారికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆదివారం ప్రత్యేక సహస్రకలశాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీవారి గర్భాలయంలో వెలసియున్న శ్రీభోగ శ్రీనివాసమూర్తికి ఆలయ అర్చకులు ఆగమోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. పల్లవరాణి సమవాయి పెరుందేవి ఏడో శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి రజత భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహూకరించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏటా జ్యేష్ఠమాసంలో తితిదే ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని నిర్వహిస్తోంది.

5. శ్రీవారి సేవలో ప్రధాని
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. షెడ్యూలు కంటే గంట ఆలస్యంగా తిరుపతి నుంచి తిరుమలలోని పద్మావతి విశ్రాంతి సముదాయానికి చేరుకున్న ప్రధాని.. కాసేపు విశ్రాంతి తీసుకుని ఆలయానికి బయలుదేరారు. తితిదే ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికి ఆయనను శ్రీవారి సన్నిధికి ఆహ్వానించింది. ధ్వజస్తంభానికి మొక్కుకుంటూ శ్రీవారి సన్నిధికి ప్రధాని వెళ్లారు.

6. రుత్వికులకు ఘన స్వాగతం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా అష్టబంధన మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ బృహత్తరమైన క్రతువును దిగ్విజయంగా నిర్వహించడానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 41 మంది రుత్వికులను తితిదే ఆదివారం ఉదయం స్వాగతించింది. తితిదే సంప్రదాయ పద్ధతిలో యాగశాలలో హోమపూజలకు హాజరయ్యే రుత్వికులందరూ పసుపు పంచకట్టు, నుదుటన శ్రీవారి నామాలతో గ్రామోత్సవంగా దేవాలయం చేరుకున్నారు. కంకణభట్టర్‌ సీతారామాచార్యులు రుత్వికులందరికీ రక్షాబంధనం కంకణాలను కట్టి వారికి కేటాయించిన హోమగుండాల వద్ద పుణ్యాహం, అగ్నిప్రతిష్ఠ, కుంభస్థాపన పూజలు చేయించారు.

7. పురాతన నాణేలతో జ్ఞాపిక తయారీకి యత్నం
తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించేందుకు పురాతన నాణేలతో తితిదే అధికారులు తయారు చేయించేందుకు సిద్ధపడిన ఓ జ్ఞాపిక వివాదానికి కారణం అవుతోంది. అధికారుల అత్యుత్సాహంతో తితిదే మ్యూజియంలోని 14, 15 దశాబ్దాల నాటి పురాతన నాణేలతో పాటు పలు రకాల ఆకృతులతో ఉన్న కొన్ని నమూనాలను పెట్టి ఓ జ్ఞాపిక తయారీకి బయట వ్యక్తులకు పురమాయించారు. శనివారమే దీనికి కావాల్సిన నాణేలను ఇచ్చి అందంగా, ఆకర్షణీయంగా దాన్ని తయారు చేయాలని చెప్పారు. దీన్ని ఆదివారం ప్రధానికి అందించి అత్యుత్తమ బహుమతిగా ఆయనకు పరిచయం చేయాలని భావించినట్లు సమాచారం. మ్యూజియంలో ఉండాల్సిన విలువైన నాణేలు బయటకు రావడం అది మీడియాకు పొక్కడంతో వెంటనే ఈ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

8. బాసరలో భక్తుల రద్దీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో ఇవాళ భక్తుల సందడి నెలకొంది. ఇవాళ సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివచ్చారు. చిన్నారులు, పెద్దలు అమ్మవారి దర్శనార్థం క్యూలో బారులు తీరారు. చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

9. వేములవాడలో భక్తుల రద్దీ
వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ వేకువజాము నుంచే భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేసి తలనీలాలు సమర్పించుకుని క్యూలైన్లలో బారులు తీరారు. శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం జిగ్‌జాగ్ క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని కోడెమొక్కునును తీర్చుకున్నారు. అభిషేక పూజలను, కల్యాణ మొక్కులను చెల్లించుకున్నారు. దేవస్థానం ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో ఉమారాణి, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, నటరాజ్, ప్రతాప నవీన్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, భూపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్నను దాదాపు 8 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఆలయానికి సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

10. బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష
సచివాలయంలో మంత్రులు, అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చేనెలలో జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్‌అలీ, దేవాదాయశాఖ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, రాజాసింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

11. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు సోమవారం 10-06-2019 ఉదయం 5 గంటల సమయానికి. తిరుమలలో కొనసాగుతున్న
భక్తుల రద్దీ …… శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.. నిన్న జూన్ 9 న 76,677 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.63 కోట్లు.

12. చరిత్రలో ఈ రోజు/జూన్ 10
పోర్చుగల్ జాతీయదినోత్సవం
సమయపాలనను ఖచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.
1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889).
1938 : ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ జననం.
1960 : తెలుగు సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ జననం
1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.
1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.

13. శుభమస్తు
తేది : 10, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 24 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(నిన్న సాయంత్రం 3 గం॥ 51 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 22 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : భద్ర (విష్టి)
ర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 51 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 40 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 51 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 31 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : సింహము